అందాలపోటీలపై కేటీఆర్ రచ్చ
ఇన్ని సానుకూలతలున్న మిస్ వరల్డ్ పోటీలను కేటీఆర్ ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ?;

మిస్ వరల్డ్ 2025 పోటీలు దగ్గరపడేకొద్దీ రాజకీయ రచ్చ పెరిగిపోతోంది. మే 7వ తేదీనుండి మే 31వ తేదీవరకు తెలంగాణలో మిస్ వరల్డ్ 2025 పోటీలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ పోటీలో 140 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొనబోతున్నారు. ఈ మెగా ఈవెంటును కవర్ చేయటానికి ప్రపంచం మొత్తంమీద 3వేలమంది మీడియా ప్రతినిధులు వస్తున్నారు. 72వ మిస్ వరల్డ్(Miss World 2025) పోటీలను నిర్వహించటం ద్వారా తెలంగాణ(Telangana)ను ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయాలని, చేయవచ్చన్నది రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం ప్లాన్. అందుకనే ఈ మెగా ఈవెంట్ ప్రారంభం, ముగింపు వేడుకలు మాత్రం హైదరాబాదులో జరగబోతున్నాయి. మధ్యలో కొన్నికార్యక్రమాలను తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించబోతోంది. అయితే ఇంతటి ప్రిస్టేజియస్ ఈవెంటుపై రాజకీయ రచ్చ పెరిగిపోతోంది.
మిస్ వరల్డ్ పోటీల నిర్వహణను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందాలపోటీలకు ప్రభుత్వం రు. 200 కోట్లు ఖర్చుచేయబోతోందట అని ఎద్దేవా చేస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఇపుడు తెలంగాణ ప్రభుత్వానికి అవసరమా ? అని కేటీఆర్ నిలదీస్తున్నారు. కేటీఆర్ ఎక్కడ పర్యటించినా మిస్ వరల్డ్ పోటీలకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. ప్రారంభ, ముగింపు ఈవెంట్లను హైదరాబాదులోని హైటెక్స్, శిల్పారామం, గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. మధ్యలో జరిగే మరో ఎనిమిది ఈవెంట్లను పోచంపల్లి(Pochampalli), యాదగిరిగుట్ట, రామప్ప(Ramappa Temple), లక్నవరం, నాగార్జునసాగర్, వికారాబాద్ లాంటి ప్రాంతాల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణలోనే తెలంగాణ సంస్కృతి, పర్యాటకం, వంటలు, ఎకో టూరిజం లాంటివి ప్రమోట్ చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది.

ప్రభుత్వం చేస్తున్న ప్లాన్ సక్సెస్ అయితే ప్రపంచవ్యాప్తంగా పోచంపల్లి చీరలు, రామప్ప దేవాలయం, లక్నవరం ఎకోటూరిజం, గ్రామీణ ప్రాంతాల్లోని వంటలు, నాగార్జున సాగర్ లో బౌద్ధారామాలు, బుద్ధవనం లాంటివి అంశాలను ప్రపంచమీడియా కవర్ చేస్తుంది. 140 దేశాలనుండి వచ్చే అందెగత్తెలు పోచంపల్లి చీరలు కట్టుకుని ర్యాంప్ వాక్ చేస్తుంటే ఎలాగుంటుందో ఎవరికి వాళ్ళు ఊహించుకోవాల్సిందే. లక్నవరం ఎకోటూరిజంలో భాగంగా అడవుల్లో వేలాదిమంది మీడియా ప్రతినిధులతో పాటు వందలాదిమంది అందగత్తెలు ములుగు అడవుల్లోని రిసార్ట్స్ లో స్టే చేస్తే లక్నవరంకు ప్రపంచఖ్యాతి రాదా ? మెగా ఈవెంట్ ను నిర్వహించటంలో రేవంత్ ప్రభుత్వం రెండు లక్ష్యాలను ఆశిస్తోంది. మొదటిది పెట్టుబడులను ఆకర్షించటం, రెండోది తెలంగాణను అంతర్జాతీయస్ధాయిలో పాపులర్ చేయటం. పెట్టుబడుల ఆకర్షణ ఏమవుతుందో ఇపుడే చెప్పలేకపోయినా రెండో అంశం తెలంగాణకు అంతర్జాతీయంగా పేరురావటం మాత్రం ఖాయం.
ఇన్ని సానుకూలతలున్న మిస్ వరల్డ్ పోటీలను కేటీఆర్ ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ? ఎందుకంటే ఫార్ములా కార్ రేసును కాంగ్రెస్ వ్యతిరేకించింది కాబట్టే. తమహయాంలో జరిగాల్సిన ఫార్ములా కార్(Formula Car Race) రేసును కాంగ్రెస్ వ్యతిరేకించింది కాబట్టి ఇపుడు జరగబోతున్న మిస్ వరల్డ్ పోటీలను వ్యతిరేకించాల్సిందే అన్నట్లుగా ఉంది కేటీఆర్ వైఖరి. నిజానికి తాము అనుకున్నట్లే ఫార్ములా కార్ రేసును ఒకసారి కేటీఆర్ నిర్వహించగలిగారు. అయితే రెండోసారి కూడా నిర్వహించాలని అనుకున్నపుడు కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఎందుకంటే రేసు నిర్వహణ పేరుతో కోట్లరూపాయల అవినీతి జరుగుతోందని ఆరోపించింది. ఇక, ఎన్నికలకు ముందు కారురేసు నిర్వహణ కాబట్టి సహజంగానే రాజకీయ రచ్చ జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫార్ములా కార్ రేసు నిర్వహణను రేవంత్ రద్దుచేశారు. ఆ మంటే కేటీఆర్లో బాగా కనబడుతోంది. ఆ విషయాన్ని డైరెక్టుగా చెప్పకుండా మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ దండగ, అందాల పోటీలకు రు. 200 కోట్ల ఖర్చుపెడుతోందని కేటీఆర్ మండిపోతున్నారు.