నిన్న తెలంగాణ.. నేడు ఆంధ్రప్రదేశ్...
లిక్కర్ కంపు కొడుతున్న తెలుగు రాజకీయాలు;
నాడు ఢిల్లీ నేడు ఏపీ... ఢిల్లీ లిక్కర్ స్కాంను తలదన్నేదగా ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణం సాగింది. వేలకోట్ల రూపాయలు విదేశాలకు తరలాయా ? అదే జరిగిందంటోంది ఏపీలోని కూటమి ప్రభుత్వం. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం దందా తీగలాగితే డొంక కదులుతోంది.ఇంటి వాడికే గుట్టు తెలుస్తుందన్నట్లు, గతంలో వైసీపీ లో వుండి ప్రస్తుతం తెలుగుదేశం ఎంపీగా వున్న లావు శ్రీకృష్ణదేవరాయలు విప్పిన జగన్ లిక్కర్ లెక్కలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాష్ట్ర సీఐడి నుంచి కేసు విచారణ కేంద్ర స్థాయి దర్యాప్తు సంస్థ చేతిలోకి వెళ్లే పరిణామాలు జరుగుతున్నాయి.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం అప్పటి అక్కడి కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఎంత కుదిపేసిందో, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ కుటుంబాన్ని అంతకన్నా ఎక్కువగానే కుదిపేసింది. ఆ కుంభకోణంలో స్వయానా కేసీఆర్ కుమార్తె కవిత జైలుకు వెళ్లాల్సివచ్చింది. ఆ వ్యవహారం తెలంగాణ రాజకీయాలతో పాటు అప్పట్లో ఏపీలో కొందరి సంబంధాలతో వేడెక్కగా, ప్రస్తుతం ఏపీలో తాజా లిక్కర్ స్కాం తెలుగు రాష్ట్రాల రాజకీయాలను మరోమారు వేడెక్కిస్తోంది. అది వైసీపీ అధినేత జగన్ తో పాటు పలువురు ఆ పార్టీ లీడర్ల మెడకు చుట్టుకొంటోంది.దాంతో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ మీద కూటమి ప్రభుత్వం ఇంత దాడిచేసేందుకు కేంద్రం ఆయనకు ఎన్ డిఎ మిత్రులు అంగీకరిస్తారా అనేది ఒక ప్రశ్న.
తీగలాగిన కూటమి ప్రభుత్వం...డొంక కదలాలి
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పలు రకాల అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న ప్రస్తుత చంద్రబాబు నాయకత్వం లోని కూటమి ప్రభుత్వం ఒక్కొక్క అంశంపై విచారణ కొనసాగిస్తోంది. అందులో భాగంగా గత ప్రభుత్వ లిక్కర్ అమ్మకాలపై జరుగుతున్న విచారణ లో విస్తుగొలిపే నిజాలు వెలుగుచూస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ తవ్వితే బడా బడా తిమింగలాలు అడ్డంగా దొరుకుతాయి. ఆ స్కాంతో ఏపీనే దోచారు. కానీ ఆ సొమ్మును చాలా చోట్లకు తరలించారు. ఇది ఇప్పుడు కూటమి పెద్దలు చెబుతున్న మాట.ప్రభుత్వమే స్వయంగా మద్యం దుకాణాలను నిర్వహించడమంటే ,వినియోగదారులకు మంచి జరగాలి, నాణ్యమైన మద్యం లభించాలి. కానీ అందుకు భిన్నంగా లెక్కాపత్రం లేకుండా జగన్ సర్కారు దోపిడికి తెరతీసిందని, ఆన్లైన్ పేమెంట్లు కూడా లేకుండా బ్లాక్ మనీ కోట్లలో తాడేపల్లి ప్యాలెస్ కు జగన్ బీనామీలకు చేరాయని, ప్రభుత్వ ఖజానాకు తీవ్రంగా నష్టం తెచ్చారనిటీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా టీడీపీ ఎంపీ లావు ఈ వ్యవహారాన్ని పార్లమెంట్ వేదికగా ప్రస్తావించడం, కేంద్ర హోంశాఖ మంత్రి ని కలిసి వివరాలు అందించడం కలకలం రేపుతోంది.
టీడీపీ ఆరోపిస్తున్న అసలు స్కాం ఏంటి..?
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏపీ లిక్కర్ పాలసీ మార్చేశారు. దశలవారీ మద్యనిషేధం పేరుతో ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచారు. ప్రభుత్వమే మద్యం అమ్మితే అవకతవకలకు ఆస్కారం వుండదని, ప్రభుత్వ ఖజానాకు లాభమని చెప్పారు. అయితే ప్రభుత్వం నడిపే మద్యం దుకాణాలు మొత్తం వైసీపీ నేతల గుప్పిట్లోకి తెచ్చుకున్నారని ఆరోపణ. కొత్త రకం బ్రాండ్లను అమ్మకానికి వుంచారు. ఎన్నడూ లేనంత రేట్లు పెంచేశారు. ప్రభుత్వం తరుపున దుకాణాలు తెరిచి ,అందులో ఉద్యోగులను పెట్టి అమ్మకాలు సాగించడమే మొత్తంగా భారీ స్కాం కు అవకాశం గా చేసుకున్నారు.తయారీ వాళ్లే, ప్రభుత్వ దుకాణాలు అయినా వారి చేతిలోనే , ఎంత అమ్ముడయిందో లెక్కలు రాసేది కూడా వాళ్లే. అమ్మకాలు కూడా ఆన్ లైన్ పేమెంట్స్ తీసుకోలేదు. అంతా క్యాష్.మొత్తంగా ఎంత ఆదాయం అని వారు చెబితే అంత రాసుకోవడం తప్ప ఏ లెక్కా ఉండదు. ప్రభుత్వం తరుపున ప్రతిషాప్ లో సూపర్ వైజర్ ను పెట్టినా అతడు కేవలం అమ్మకాలకే పరిమితం. ఇలా లెక్కాపత్రం లేకుండా ప్రభుత్వ దుకాణాల పేరిట దోపిడీ జరిగిందని ఇప్పుడు విచారణ కొనసాగిస్తున్నారు. తమ సొంత బ్రాండ్లు, తమకు కమీషన్ ఇచ్చేందుకు అంగీకరించిన బ్రాండ్లను మాత్రమే దుకాణాలకు పంపించేవారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ బ్రాండ్ మద్యం ఎంత అమ్ముడయిందనే వివరాలు డేటా ఎంట్రీ ఆపరేటర్ ద్వారా రాజ్ కసిరెడ్డి కార్యాలయానికి చేరేవి.అక్కడినుంచి ఏ కంపెనీ నుంచి ఎంత కమీషన్ తీసుకోవాలన్న లెక్కలు తేల్చేవారని తేలింది.
సీఐడీ విచారణ చేపట్టిన కూటమి ప్రభుత్వం
చంద్రబాబు నాయకత్వం లో ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత వైసీపీ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలపై దృష్టి పెట్టి, మద్యం విధానం లోనూ మార్పులు తెచ్చింది.గత ప్రభుత్వ లిక్కర్ అవినీతి పైన సీఐడీ విచారణకు ఆదేశించింది. లిక్కర్ స్కాం లో వేల కోట్ల రూపాయాల అవినీతి జరిగిందని కూటమి ప్రభుత్వంఆరోపిస్తోంది. సీఐడీ ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం అన్ని వివరాలను సేకరించింది. మరిన్ని ఆధారాల కోసం ప్రయత్నిస్తోంది.‘సిట్’ విచారణలో భాగంగా అందులో కొందరు నోరు తెరుస్తున్నారు. మద్యం షాపుల్లో ఆర్డర్లు పెట్టినట్లు చెబుతున్న కంప్యూటర్ల నుంచి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌లో సీజ్ చేసిన కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్ ల వరకూ అన్నింటినీ ల్యాబ్‌కు పంపి సిట్ నివేదిక తెప్పించుకుంది. అందులో సంచలన అంశాలను గుర్తించినట్లు చెబుతున్నారు.
మద్యం కుంభకోణంలో సంబంధం వున్న వైసీపీ పెద్దలు, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్‌లో కీలక స్థానంలో ఉన్న అధికారులతో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్ వరకు అందరినీ విచారించిన సిట్ బృందం వారి నుంచి సమగ్ర సమాచారం రాబట్టింది.వీరిలో ఐదుగురు ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్, ఎస్‌ఎన్‌జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగి, రైల్వే నుంచి వైసీపీ హయాంలో వచ్చి ఎన్నికల తర్వాత తిరిగి వెళ్లిన రమేశ్‌కుమార్ రెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ అనూష విజయవాడ కోర్టులో న్యాయమూర్తి ముందు ఇచ్చిన వాంగ్మూలాలు కీలకంగా మారాయి. సత్యప్రసాద్ న్యాయమూర్తి ఎదుట సుమారు 3 గంటల పాటు సుదీర్ఘంగా వాంగ్మూలం ఇచ్చి స్కాం జరిగిన తీరును పూర్తిగా వివరించినట్లు చెబుతున్నారు. మొత్తం గా మద్యం కుంభకోణంలో ప్రభుత్వ ఖజానాకు దాదాపు 18 వేలకోట్ల నష్టం జరిగినట్టు సీఐడీ దర్యాప్తులో తేల్చారు .
ఎంపీ లావు లోక్ సభ వేదికగా ఏమి చెప్పారంటే..
ఏపీలో వైసీపీ హయాం లో ప్రైవేట్ ఐఎంఎఫ్ఎల్ లను , డిస్టిలరీలను అక్రమంగా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకుని, 60శాతం ఉత్పతి సామర్థ్యాన్ని కొత్తగా ఏర్పాటైన కంపెనీలకు అప్పగించారని లోక్ సభలో ఎంపీ లావు ఆరోపించారు. 2019 -2024 మధ్య 38 కొత్త బ్రాండ్లను వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెబుతూ, అవన్నీ అధికార పార్టీ అనుబంధ వ్యాపారులకు చెందినవని తెలిపారు. రూ.20,356 కోట్ల విలువైన మద్యం అమ్మకాలను గోప్యంగా నిర్వహించారని పేర్కొన్నారు. ఈ స్కాం విచారణ కోసం ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.లోక్ సభలో వైసీపీ పై మద్యం ఆరోపణలు చేసిన టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆ తరువాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిసి వివరాలు అందించడం కాక పుట్టిస్తోంది.
ఇదే వ్యవహారంలో హైదరాబాద్‌కు చెందిన సునీల్‌రెడ్డి రూ.2 వేల కోట్లను దుబాయ్‌కి తరలించిన కీలకపత్రాలను లావు అందించినట్లు తెలుస్తోంది. ఈ లావాదేవీలపై ఈడీ క్షుణ్ణంగా దర్యాప్తు జరిపితే అనేక కీలక వివరాలు బయటపడతాయని పేర్కొన్నారు. లిక్కర్ స్కాం కు సంబంధిత కీలక పత్రాలను అమిత్ షాకు అందజేశారు. 90వేల కోట్ల మద్యం వ్యాపారంలో 18 వేల కోట్లు దుర్వినియోగమయ్యాయని లావు తెలిపారు. మరో 4 వేల కోట్లు బినామీ పేర్లతో దుబాయ్, ఆఫ్రికాలకు తరలించారన్న లావు ఆరోపణలపై హోంమంత్రి గట్టిగా ఆరా తీసినట్లు చెబుతున్నారు.
ఇప్పటికే ఈ కేసు సీఐడీ విచారిస్తోంది. ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి ప్రమేయం పైన టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవ రాయలు హోం అమిత్ షా కు ఫిర్యాదు చేయడం , అమిత్ షా నుంచి విచారణ జరుపుతామని తగిన హామీ పొందడం ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.
ఏపీ మద్యం స్కాం ఈడీ చేతికి వెళుతుందా..?
ఈడీ, సీబీఐ దర్యాప్తు తో ఢీల్లీ లిక్కర్ స్కాం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఢిల్లీ ఆప్ నేతలు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మంత్రివర్గ సహచరులు జైలు కు వెళ్లాల్సివచ్చింది. ఢిల్లీ స్కాం తెలుగు రాష్ట్రాలనూ కుదుపుకుదిపి అదే కేసులో బీఆర్ఎస్ నాయకురాలు, కేసీఆర్ కుమార్తె కవిత కూడా జైలు జీవితం గడిపారు. ఇంకా ఆ కేసు సాగుతూనే వుంది. మరోపక్క తమిళనాడు లో మద్యం కుంభకోణాన్ని కూడా ఈడీ బైట పట్టింది.తమిళనాడులో లిక్కర్ స్కాం జరిగినట్లు వెయ్యి కోట్ల రూపాయలు గుర్తు తెలియని వ్యక్తులకు చేరినట్లుగా ఈడీ గుర్తించింది. తమిళనాడులో మద్యం సరఫరాదారులు, దుకాణాదారులు, ఇతరుల ఇళ్లు,కార్యాలయాల్లో సోదాలు చేసి అధికారిక ప్రకటన చేసింది. మద్యం తయారీ కంపెనీ రవాణా విషయంలో అత్యధిక ఇన్వాయిస్‌లు తయారు చేసి.. అందులో అధికంగా వేసిన మొత్తాలను రాజకీయ నేతలకు లంచాలుగా ఇచ్చారని ఈడీ భావిస్తోంది. ఆ డబ్బులు ఏ రాజకీయ పార్టీకి చేరాయన్నది తేలుస్తామని అంటున్నారు.అయితే తమిళనాట అధికార డిఎంకే లక్ష్యం గానే మద్యం కేసు నడుస్తోందన్న వాదన బలంగా వినిపిస్తోంది.
మరి వీటన్నింటి కంటే అతిపెద్ద మద్యం కుంభకోణం అంటూ బయటికొచ్చిన ఏపీ మద్యం స్కాంపై ఈడీ దృష్టి పెడుతుందా లేదా అన్నది చూడాల్సివుంది. 18 వేల కోట్ల స్కాం అంటూ టీడీపీ నేతలు వైసీపీ ని టార్గెట్ చేసిన ఈ కేసులో సిఐడీ దర్యాప్తు జరుగుతున్నా, మనీలాండరింగ్ కు సంబంధించి ఈడీ రంగంలో దిగాలని ఏపీ కూటమి ప్రభుత్వం కోరుకొంటోంది. ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు ఇక ముందు జరిగేది చూడండి అన్నట్లు, టీడీపీ ఎంపీ లావు ఈ అంశాన్ని లోక్ సభలో ప్రస్తావించి దేశ వ్యాప్తంగా చర్చకు దారితీశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆధారాలు సమర్పించి, విచారణ జరిపిస్తామన్న హామీ పొందారు. నేడో రేపో ఈ కేసులో ఈడీ రంగ ప్రవేశం చేయడమే తరువాయి. మద్యం కేసులో వైసీపీ అధినేత జగన్ ను పూర్తిగా ఇరికించి జైలుకు పంపే దిశగా కూటమి ప్రభుత్వం పక్కా ప్లానే చేస్తోంది. పక్కా పథకం ప్రకారమే పార్లమెంటు లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారన్న చర్చ సాగుతోంది. ఎంపీ లావు కూడా అమిత్ షాను కలిసి వివరాలు అందించిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలిసి చర్చించడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
అసలు జరగని స్కాం ను భూతద్దంలో చూపిస్తూ కూటమి ప్రభుత్వం రాద్దాంతం చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. మరి ఈ మద్యం కుంభకోణాన్ని కూటమి ప్రభుత్వం ఆధారాలతో నిరూపిస్తుందా, కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఏమేరకు పాత్ర పోషిస్తుందన్నది చూడాలి మరి..