మీడియా ఎదుట కన్నీటిపర్యంతమైన పొంగులేటి

మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. వాగు పరివాహక ప్రాంతం ప్రకాష్ నగర్ లో బ్రిక్స్ తయారీ యూనిట్ నిర్వహిస్తున్న నిరుపేద యాకూబ్ కుటుంబం మున్నేరు వాగు వరదల్లో చిక్కుకుంది.

Update: 2024-09-01 13:14 GMT

రెండు రోజులుగా తెలంగాణలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. వాగులు, వంకలు, పొంగి ప్రవహిస్తున్నాయి... చెరువులు కుంటలు అలుగుపోస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం, భీమవరం గ్రామపంచాయతీ, భవానిపురం లో ఓ యువకుడు వాగులో కొట్టుకుపోయి మృతి చెందాడు. దీంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పాలేరు రిజర్వాయర్కు వరద నీరు భారీగా చేరింది రిజర్వాయర్ నీటిమట్టం ప్రమాదకర స్థాయిలో ఉంది.

మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. వాగు పరివాహక ప్రాంతం ప్రకాష్ నగర్ లో బ్రిక్స్ తయారీ యూనిట్ నిర్వహిస్తున్న నిరుపేద యాకూబ్ కుటుంబం మున్నేరు వాగు వరదల్లో చిక్కుకుంది. సహాయం కోసం ఇంటి గోడపై బిక్కుబిక్కుమంటూ కూర్చున్న కుటుంబం... గోడ కూలడంతో వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. యాకూబ్ తోపాటు అతని భార్య, కొడుకు ప్రమాదంలో చిక్కుకున్నారు. అంతకంటే ముందు వారిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. కానీ వాతావరణం సహకరించకపోవడంతో హెలికాప్టర్ పంపేందుకు కానీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లేందుకు కానీ సాధ్యం కాలేదు. దీంతో డ్రోన్ ద్వారా బాధితులకు సేఫ్టీ జాకెట్లు పంపించారు అధికారులు. వారు ఉన్నది మట్టి గోడపై కావడంతో.. వరద ప్రభావానికి గోడ కూలి నీటిలో కొట్టుకుపోయారు.

మీడియా సమావేశంలో పొంగులేటి కంటతడి..

రాష్ట్రంలో వరద పరిస్థితులు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదారాబాద్ సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉండగానే యాకూబ్ కుటుంబం వరదలో కొట్టుకుపోయిన సమాచారం అందింది. విషయం తెలిసి భావోద్వేగానికి లోనైన మంత్రి.. కంటతడి పెట్టుకున్నారు. "నా నియోజకవర్గానికి చెందిన యాకూబ్ కుటుంబం వరదల్లో కొట్టుకుపోయింది. ఉదయం నుంచి వారిని రక్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసాం. దాదాపు 25 సార్లు వారితో ఫోన్లో మాట్లాడాను.  ఆ తల్లి ఆవేదన ఇంకా మెదులుతూనే ఉంది. వారితో లైఫ్ జాకెట్లు ఉన్నాయి, క్షేమంగా ఒడ్డుకి చేరుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను" అంటూ కన్నీటి పర్యంతమయ్యారు మంత్రి పొంగులేటి.


Tags:    

Similar News