వీళ్ళిద్దరి బాధ మామూలుగా లేదుగా

రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళల్లో చాలామంది తమకు ప్రాధాన్యత దక్కాలని కోరుకుంటారు. పదిమంది ముందు ఉన్నతాధికారులు తమను గౌరవించాలని బలంగా కోరుకుంటారు.

Update: 2024-07-12 04:30 GMT
chairman Guttha and Speaker Gaddam prasad

వీళ్ళిద్దరి బాధ మామూలుగా లేదు. ఇద్దరు కూడా చట్టసభల్లో రాజ్యాంగబద్దమైన స్ధానాల్లో ఉన్నవాళ్ళే. ఇంతకీ వీళ్ళెవరంటే శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందరరెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. వీళ్ళల్లో స్పీకర్ అధికారపార్టీ ఎంఎల్ఏ అయితే ఛైర్మన్ మాత్రం బీఆర్ఎస్ ఎంఎల్సీ. మామూలుగా అయితే అధికారపార్టీ తరపున ఎంపికైన ఎంఎల్ఏ కాబట్టి స్పీకర్ కు సమస్యలు ఉండకూడదు. కాని ఇక్కడ విషయం ఏమిటంటే ఇద్దరు ఒకేరకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఇద్దరూ ప్రోటోకాల్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళల్లో చాలామంది తమకు ప్రాధాన్యత దక్కాలని కోరుకుంటారు. పదిమంది ముందు ఉన్నతాధికారులు తమను గౌరవించాలని బలంగా కోరుకుంటారు. అధికారులు తమకు గౌరవం ఇస్తేనే నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, క్యాడర్ తో పాటు మామూలు జనాలు కూడా తమను గౌరవిస్తారన్నది నేతల భావన. తమను అధికారులు పట్టించుకోకపోతే జనాల్లో పలుచనయిపోవటం ఖాయమని తెగ ఫీలైపోతారు. ఇది ఫీలింగే కాదు వాస్తవం కూడా అనటంలో సందేహంలేదు. ఇపుడా సమస్యే ఛైర్మన్, స్పీకర్ కు ఎదురైంది.

ప్రోటోకాల్ అన్నది బ్రహ్మపదార్ధంగా మారిపోయింది. ప్రభుత్వానికి, ప్రభుత్వానికి, వ్యక్తులకు, వ్యక్తులకు మారిపోతోంది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారికి ప్రోటోకాల్ సమస్యలు ఎదురుకాకూడదు. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవాళ్ళకి ఎవరికి అందాల్సిన ప్రోటోకాల్ మర్యాదలు ఏమిటనే విషయంలో ఒక లెక్కుంటుంది. ఆ లెక్క ప్రకారమే ప్రోటోకాల్ అందాల్సుంటుంది. కాకపోతే పాలకు కొద్దిబుద్దుల కారణంగా అంతా తారుమారైపోతున్నాయి. ఇపుడు విషయం ఏమిటంటే అధికారపార్టీ తరపున ఎంపికైన నేత కాబట్టి స్పీకర్ కు ప్రోటోకాల్ సమస్యలు ఎదురు కాకూడదు. ఛైర్మన్ గుత్తా సుఖేందర్ అంటే బీఆర్ఎస్ ఎంఎల్సీ కాబట్టి ప్రోటోకాల్ సమస్యలు ఎదురవుతున్నాయంటే అర్ధముంది.

అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి బీఆర్ఎస్ నుండి హస్తంపార్టీలోకి ఫిరాయింపులు ఊపందుకుంటున్నాయి. ఫిరాయింపుదారుల్లో ఎంఎల్ఏలతో పాటు ఎంఎల్సీలు కూడా ఉన్నారు. ఎంఎల్ఏల విషయాన్ని స్పీకర్ చూసుకుంటారు. అలాగే ఎంఎల్సీ విషయాన్ని చూడాల్సింది ఛైర్మన్. ఎంఎల్ఏల ఫిరాయింపుల వ్యవహారం అంటే స్పీకర్ అధికారపార్టీ నేతే కాబట్టి సమస్యలేదు. మరి ఎంఎల్సీల ఫిరాయింపల మాటేమిటి ? ఫిరాయింపుల కారణంగా ఎంఎల్సీలపై ఛైర్మన్ అనర్హత వేటు వేశారంటే అంతే సంగతులు. ఎంఎల్సీలు కాంగ్రెస్ లోకి ఫిరాయించటం వల్ల అధికారపార్టీకి ఉపయోగం ఉండదు, అలాగే ఎంఎల్సీలు మాజీలయిపోతారు. ఎంఎల్సీలపై అనర్హత వేటుపడకూడదంటే ఛైర్మన్ సహకారం చాలా చాలా అవసరం.

అందుకనే ప్రభుత్వం ఛైర్మన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటిది ఛైర్మన్ కు ప్రోటోకాల్ సమస్యలున్నాయంటే ఆశ్చర్యంగానే ఉంది. ఇదే సమయంలో స్పీకర్ కూడా ఇదే సమస్యతో బాధపడుతుండటం విచిత్రంగా ఉంది. అందుకనే ఈనెలాఖరులో మొదలయ్యే బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఛైర్మన్, స్పీకర్ జాయింట్ గా చీఫ్ సెక్రటరి, డీజీపీతో పాటు ఉన్నతాధికారులతో మీటింగ్ పెట్టారు. ఈ సందర్భంగానే ప్రోటోకాల్ సమస్యలను ప్రస్తావించారని సమాచారం. రాష్ట్రస్ధాయి నుండి మండలస్ధాయి వరకు అధికారులు ఎవరూ తమకు గౌరవం ఇవ్వటంలేదని బాధపడిపోయారు. జిల్లాల్లో తమ పర్యటనల సందర్భంగా ప్రోటోకాల్ మర్యాదలను పాటించటంలేదని వాపోయారు.

జిల్లాల పర్యటనలకు వెళ్ళినపుడు రిసీవ్ చేసుకోవాల్సిన ఆర్డీవో లేదా ఎంఆర్వోలు కనబడటంలేదట. తమ పర్యటనలకు సంబంధించిన సమాచారాన్ని జిల్లాల ఉన్నతాధికారులకు ప్రోటోకాల్ విభాగం పంపటంలేదని తీవ్రంగా ఆక్షేపించారట. జిల్లా, నియోజకవర్గాల్లో జరిగే అభివృద్ధి, శంకుస్ధాపన కార్యక్రమాలకు ఆహ్వానాలు అందటంలేదు. మంత్రులు, ఎంఎల్ఏలకు ఆహ్వానాలు పంపుతున్న అధికారులు తమను పక్కనపెట్టేస్తున్నారని చెప్పారు. ట్రాన్సఫర్లపై జల్లాలకు వచ్చే అధికారులు తమను మర్యాదపూర్వకంగా కూడా కలవటంలేదన్నారు. దీనివల్ల జిల్లాలో ఏ శాఖలో ఏ అధికారి పనిచేస్తున్నారో కూడా తమకు తెలీటంలేదని తెగ బాధపడిపోయారు.

జాతీయ పండుగలైన ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం, జనవరి 26 గణతంత్ర దినోత్సవం, రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాల్లో ఏ జిల్లాలో పాల్గొనాలనే విషయాన్ని కూడా తమకు చివరినిముషంలో మాత్రమే సమాచారం ఇస్తున్నారని అసంతృప్తిని వ్యక్తంచేశారు. తమ పర్యటనల్లో ఎస్ఐలు కూడా పాల్గొనటంలేదట. కారణం ఏమిటంటే మంత్రుల పర్యటనల్లో బందోబస్తులో ఉన్నారనే సమాధానం వస్తోందని చెప్పారు. ఎదురుకాకూడని ప్రోటోకాల్ వివాదాలు తమకు ఎదురవుతున్నట్లు వీళ్ళు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. చివరకు ఎయిర్ పోర్టు లాంజుల్లో సినిమాతారలను వీవీఐపీ లాంజుల్లో కూర్చోబెడుతున్న అధికారులు తమను మాత్రం చిన్నచూపుచూస్తున్నట్లు వాపోయారు. హోలు మొత్తంమీద ఛైర్మన్, స్పీకర్ అసంతృప్తిని గమనించిన తర్వాత తమను ఎవరూ లెక్కచేయటంలేదని బాగా పీలైనట్లు అర్ధమవుతోంది. మరీ ప్రోటోకాల వివాదాన్ని ఉన్నతాధికారులు ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాల్సిందే.

Tags:    

Similar News