హైదరాబాద్‌కు రాహుల్ రాక.. మాట నిలబెట్టుకోవడానికేనా..

కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ ఫుల్ బిజీ షెడ్యూల్ ఉన్నా హైదరాబాద్‌లో పర్యటించడానికి అంగీకరించారు. అందుకు కారణం ఏంటో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ వెల్లడించారు. అదేంటంటే..

Update: 2024-11-04 11:25 GMT

కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ ఫుల్ బిజీ షెడ్యూల్ ఉన్నా హైదరాబాద్‌లో పర్యటించడానికి అంగీకరించారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో పర్యటించి పలు కార్యక్రమాలను పరిశీలించనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. తెలంగాణ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికే రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు వస్తున్నారని మహేష్ కుమార్ చెప్పారు. ‘తెలంగాణ ప్రజలకు అండగా ఉంటా. సమస్య ఉన్నా, అవసరం ఉన్నా మీముందు, మీ కోసం నేను వస్తా’ అని ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు రాహుల్ గాంధీ మాటిచ్చారు.

దానిని నిలబెట్టుకోవడం కోసమే ఆయన మంగళవారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారని మహేష్ వివరించారు. కాంగ్రెస్ నేత రాహుల్ నైజం ఇలా ఉంటుందని మహేష్ కుమార్ చెప్పారు. అయితే దశాబ్దాల తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కుల గణన జరగనుంది. ఈ నేపథ్యంలో హదరాబాద్‌కు రాహుల్ వస్తుండటం కీలకంగా మారింది. ఇప్పటికే రాహుల్ గాంధీకి స్వాగతం పలకడం కోసం హైదరాబాద్‌లోని కాంగ్రెస్ శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం ఈ పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. రాహుల్ గాంధీకి భారీగా స్వాగతం పలకాలని తెలంగాణ కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది.

రాహుల్ వస్తోంది అందుకే..

‘‘ఝార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల వల్ల బిజీ షెడ్యూల్‌తో ఊపిరాడనంతలా బిజీ అయ్యారు రాహుల్ గాంధీ. కానీ హైదరాబాద్ కోసం అనడంతో వెంటనే తన బిజీ షెడ్యూల్‌లో కూడా వీలు కల్పించుకుని మరీ హైదరాబాద్ విచ్చేస్తున్నారు. తెలంగాణలో చేపట్టనున్న కుల గణనకు అత్యంత ప్రాధాన్యం ఉండటంతో హైదరాబాద్‌కు రావడానికి రాహుల్ కూడా అంతే ప్రాధాన్యతనిచ్చారు. 5 నవంబర్ సాయంత్ర 5 గంటలకు రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకుంటారు. కుల గణనలో ఎలాంటి అంశాలు ఉండాలి అని సూచించడం కోసం ఈ పర్యటన ఉపయోగపడుతోంది. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ అత్యంత ప్రాధాన్యతతో చేపట్టింది’’ అని మహేష్ కుమార్ వివరించారు.

అన్ని వర్గాలకు మేలు

‘‘కుల గణన జరిగితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. అదే మా పార్టీ అభిమతం. అందుకే తెలంగాణలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ గణనలో అనేక ప్రశ్నలు పొందుపరిచాం. అంతేకాకుండా ఇంకా ఎటువంటి అంశాలు చేర్చడం ద్వారా సర్వే తీరు మరింత లోతుగా, సమగ్రంగా ఉంటుంది అని ఆలోచించి నిర్ణయం తీసుకోనున్నాం. అందుకు రాహుల్ గాంధీ పర్యటనలో అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నాం.

ఈ చారిత్రాత్మకంగా ఉన్న కుల గణనకు ప్రతి వర్గం ప్రజలకు సహకరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క చాలా పట్టుదలతో రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వాటిలో కుల గణన కూడా ఒకటి. తెలంగాణలో జరిగే కుల గణన దేశానికి ఆదర్శంగా ఉంటుంది. రాహుల్ పర్యటనను కాంగ్రెస్ నేతలు, నాయకులు, కార్యకర్తలు అంతా కలిసి విజయవంతం చేయాలి’’ అని మహేష్ కుమార్ కోరారు.

రాహుల్‌కు కేటీఆర్ లేఖ

ఇదిలా ఉంటే తెలంగాణ కుల గణను పరిశీలించడానికి రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు రానున్న క్రమంలో ఆయనకు కేటీఆర్ రాసిన లేఖ కీలకంగా మారింది. ప్రజల దగ్గరకు వెళ్లే దమ్ము రాహుల్‌కు ఉండా అని కేటీఆర్ తన లేఖలో ప్రశ్నించారు. అంతేకాకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా పలు కీలక ఫిర్యాదులు చేశారు కేటీఆర్. అభివృద్ధి తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వంగా చేసిందంటూ విమర్శలు గుప్పించారు.

అంతేకాకుండా రాహుల్ గాంధీ.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. ‘‘ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు అని ప్రజలను మభ్యపెట్టారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. ఎన్నికల సమయంలో మొత్తం 420 హామీలు ఇచ్చి ప్రజలకు నమ్మకద్రోహం చేశారు.

ఆ మోసానికి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ నేతలంతా క్షమాపణలు చెప్పాలి. ఏడాది కాలంలో అన్ని వర్గాలు రోడ్డెక్కించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. సబ్బండ వర్గాలను మోసం, నయవంచనకు గురి చేసిన పాపంలో ప్రధాన పాత్ర మీదే రాహుల్ జీ. మీ ప్రభుత్వ ఫల్యాలు తీస్తే చిత్రగుప్తుడి చిట్టా వచ్చినట్లు వస్తుంది’’ అని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News