Rain Alert| ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు… అవసరమైతే ఈ నెంబర్లకు ఫోన్ చేయండి

వందలాది కార్లు, వేలాది మోటారుబైకులు రోడ్డుమధ్యలోనే ఇరుక్కుపోయాయి.;

Update: 2025-08-08 07:26 GMT
Heavy rains in Hyderabad

క్లౌడ్ బరస్ట్(Cloud Burst) జరిగిందా అన్న అనుమానాలు వచ్చేట్లుగా తెలంగాణ(Telangana)లోని చాలా జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తోంది. జిల్లాలతో పాటు హైదరాబాద్(Hyderabad) నగరంలో గురువారం సాయంత్రం సుమారు 5.30 గంటలనుండి 8 గంటలవరకు అతిభారీ వర్షం(Heavy Rains) కురిసింది. దీనిదెబ్బకు నగరంలోని చాలా ప్రాంతాలు నడుంలోతు నీటిలో ముణిగిపోయాయి. వందలాది కార్లు, వేలాది మోటారుబైకులు రోడ్డుమధ్యలోనే ఇరుక్కుపోయాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట, ఎస్ ఆర్ నగర్, దోమలగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, యూసుఫ్ గూడ, నాగోల్, హైటెక్ సిటి, ఖైరతాబాద్, అబీడ్స్, హిమాయత్ నగర్, ఇందిరాపార్క్ లాంటి ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయాయి. ఫలితంగా లోతట్టుప్రాంతాల్లోని ఇళ్ళల్లోకి వర్షపు నీరుచేరటంతో జనాలు బాగా ఇబ్బందులు పడ్డారు.


గురువారం సంగతి అలా ఉంచితే శుక్రవారం కూడా భారీ నుండి అతిభారీ వర్షాలు కురుసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ నగరంతో పాటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, నిజామాబాద్ లో సాయంత్రం తర్వాత అతిభారీ వర్షాలు కురుస్తాయని ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ నగరంలో గురువారం కురిసిన వర్షం 12 సెంటీమీటర్లుగా నమోదైంది. అమీర్ పేట, మణికొండ, పంజాగుట్ట ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరదనీరు చేరింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో సగటున 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం కూడా తూర్పు, దక్షిణ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో భారీవర్షాలు కురుసే అవకాశాలున్నాయి.

మరో ఐదురోజులు భారీ వర్షాలు

శుక్రవారం నుండి మరో ఐదురోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు సంబంధిత అధికారులు చెప్పారు. 9,10 తేదీల్లో నల్గొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబగద్వాల్ జిల్లాల్లో భారీవర్షాలు పడతాయి. 11,12,13 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా అన్నీ జిల్లాల్లోను భారీవర్షలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి జనాలందరు ముందుజాగ్రత్త పడాలని కూడా విజ్ఞప్తిచేసింది. భారీవర్షాలు కురిసే సమయంలో ఎంతో అత్యవసరం అయితే తప్ప జనాలు ఎవరూ బయటకు రావద్దని ఉన్నతాధికారులు విజ్ఞప్తిచేస్తున్నారు.



వర్షాలవల్ల నిలిచిపోయిన ట్రాఫిక్ ను పునరుద్దరించటానికి, పడిపోయిన చెట్లను తొలగించటానికి, రోడ్లలో నిలిచిపోయిన నీటిని తొలగించేందుకు హైడ్రా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఇరిగేషన్, మున్సిపల్, పోలీసు, ఎన్డీఆర్ఎఫ్ తదితర శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది రోడ్లమీదే ఉండి పనిచేస్తున్నారు. ప్రభుత్వశాఖలు సమన్వయంతో పనిచేయటానికి వీలుగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాధ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమీషనర్, ఎన్డీఆర్ఎఫ్ ఉన్నతాధికారులు కూడా యాక్టివ్ గా నగరంలో అవసరమైన చోట్లకు చేరుకుని పరిస్ధితులను సమీక్షించి ఆదేశాలు జారీచేస్తున్నారు. ఇదే విషయాన్ని ఎనుముల రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించారు. అన్నీ శాఖల ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశాలు జారీచేశారు.

Tags:    

Similar News