చర్చనీయాంశమైన రాజాసింగ్ వీడియో

పార్టీ వీడినా మారని వైఖరి;

Update: 2025-08-13 11:03 GMT

పార్టీ నుంచి వెళ్లిపోయినా బీజేపీ అధిష్టానాన్ని నిందించడం మాత్రం రాజాసింగ్ ఆపలేదు. తాజాగా మంగళవారం ఒక వీడియో విడుదల చేశారు. బీజేపీలో 11 ఏళ్లు ఉన్న తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘‘పార్టీలో చేరే సమయంలో ముందు వరుసలో ఉన్న నేతలు.. పదవులు, టికెట్లు అడిగే సమయంలో చివరి వరుసలో నిల్చుంటారు’’ అని రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. ‘‘బీజేపీలో చేరాలనుకున్న నాయకులు జరజాగ్రత్త. ఒకసారి ఆలోచించుకోండి. మీరు బీజేపీలో చేరిన తర్వాత కార్యకర్తలకు ఒక్క పదవి కూడా ఇప్పించుకోలేరు. టికెట్ వస్తుందన్న గ్యారెంటీ లేదు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేను కార్యకర్తలకు ఏం చేయలేకపోయాను’’ అని రాజాసింగ్ అన్నారు. ‘‘విజయశాంతి, జితేందర్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి.. పార్టీలో చేరారు. చివరకు ఏమైంది. చివరకు పార్టీని వదిలి వెళ్లిపోయారు. హిందుత్వానికి, దేశానికి మంచి పనులు చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ’’ అంటూనే ‘‘తెలంగాణలో మాపార్టీ, మేం ఏం చెబితే అదే జరుగుతుంది అనుకునే వాళ్లే పార్టీని సర్వనాశనం చేశారు’’  అని రాజాసింగ్ ఆ వీడియోలో పేర్కొన్నారు. ఇటీవలె ఆ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేరారు. ఇదే సమయంలో రాజా సింగ్ పనిగట్టుకుని ఇలాంటి వ్యాఖ్యాలు చేస్తూ వీడియో చేయడంతో పరోక్షంగా గువ్వల బాలరాజును ఉద్దేశించే ఆయన మాట్లాడుతున్నారన్న చర్చ మొదలైంది.

Tags:    

Similar News