కాంగ్రెస్ లోకి BRS ఎమ్మెల్యే నెంబర్ 8

బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయింపుల పర్వం కొనసాగుతూనే ఉంది.

Update: 2024-07-12 17:21 GMT

బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. శుక్రవారం రాత్రి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కలిశారు. రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. రేవంత్ ప్రకాష్ గౌడ్ కి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు కూడా సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

ప్రకాష్ గౌడ్ గతంలో రెండు సార్లు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అప్పుడే పార్టీ ఫిరాయిస్తారని వార్తలు వచ్చాయి. అందునా రేవంత్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ మంచి స్నేహితులు. గతంలో టీడీపీలో కలిసి పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయన రేవంత్ రెడ్డిని రెండుసార్లు కలవడం అనుమానాలకు తావిచ్చింది. కేటీఆర్ రంగంలోకి దిగి నచ్చజెప్పడంతో తాత్కాలికంగా పార్టీ మార్పుని విరమించున్నప్పటికీ ఎక్కువకాలం కొనసాగలేదు. నేడు ఆయన కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

ప్రకాష్ గౌడ్ తో కలిపి ఎనిమిది మంది...

కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా బీఆర్ఎస్ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరికతో మొత్తం ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరినట్లయింది.

టీడీపీలో మొదలైన రాజకీయ ప్రయాణం...

ప్రకాష్ గౌడ్ టీడీపీ ద్వారా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 2009 నుండి 2023 వరకూ రాజేంద్రనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ పై 7 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. 2014 లో టీడీపీ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి జ్ఞానేశ్వర్ పై దాదాపు 25 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ లో చేరిన ప్రకాష్ గౌడ్... 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో గులాబీ అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 58 వేల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి రేణుకుంట్ల గణేష్ పై విజయం సాధించారు. 2023 ఎన్నికల్లో రాజేంద్రనగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి సుమారు 32 వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డిపై ఆధిక్యం సాధించారు. 

Tags:    

Similar News