BRS Govt Scams | బీఆర్ఎస్ హయాంలో ఆరు స్కాంలపై రేవంత్ సర్కార్ దృష్టి
బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఆరు బాగోతాలపై సీఎం రేవంత్ దృష్టి సారించారు.ఫార్ములా ఈ కార్ రేసింగ్,ఓఆర్ఆర్ టోల్ కాంట్రాక్టు,మేడిగడ్డ అక్రమాలపై దర్యాప్తు సాగుతోంది.;
By : The Federal
Update: 2024-12-20 02:03 GMT
ఫార్ములా ఈ కార్ రేసింగ్,హైదరాబాద్ ఓఆర్ఆర్ టోల్ కాంట్రాక్టు,మేడిగడ్డ బ్యారేజీ,విద్యుత్ కొనుగోళ్లు, థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలపై దర్యాప్తు వేగంగా సాగుతోంది.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో...
యూకేకు చెందిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో రూ.54.88 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్, ఐఎఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలపై నిధుల దుర్వినియోగంపై ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ కేసు నమోదు చేశారు. మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం రూ.54.88 కోట్లు ఓ విదేశీ సంస్థకు చెల్లించారని, దీనివల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని, దీనిపై కేసు నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ అనుమతితోనే కేసు నమోదు చేసింది. ఈ నిధుల దుర్వినియోగంపై ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.
హైదరాబాద్ ఓఆర్ఆర్ టోల్ కాంట్రాక్టు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ ఓఆర్ఆర్ టోల్ కాంట్రాక్టును 30 ఏళ్ల పాటు ఓ ప్రైవేటు కంపెనీకి ధారాదత్తం చేశారు. టోల్ ఆపరేట్ ట్రాన్స్ ఫర్ విధానంలో ఐఆర్ బీ ఇన్ ఫ్రా లిమిటెడ్ రూ.7,380 కోట్లకు టెండరు ఇచ్చింది. దీంతో ఓఆర్ఆర్ ను ఆ సంస్థ స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్ పై రోజుకు 1.3లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఏటా రూ.700కోట్లకు పైగా ఆదాయం టోల్ ద్వారా వస్తుంది. గతంలో ఈ అక్రమాలపై రేవంత్ రెడ్డి ఆందోళన చేశారు. బీఆర్ఎస్ టోల్ టెండరు బాగోతంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు విచారణకు సిట్ వేస్తామని ప్రకటించారు.
మేడిగడ్డ బ్యారేజీ
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పగుళ్లు ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో కాళేశ్వరం కమిషన్ ను ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు, ప్రాణహిత చేవెళ్ల పథకం మార్పులపై జస్టిస్ ఘోష్ కమిషన్ అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్ లను విచారించింది. రూ.2,591 కోట్లతో మేడిగడ్డ, రూ.1785 కోట్లతో అన్నారం, రూ.1437 కోట్లతో సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి అప్పటి సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫైళ్లలో లోపాలపై కాళేశ్వరం కమిషన్ విచారణ జరుపుతోంది. కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసి నివేదిక సమర్పిస్తే కేసీఆర్ తోపాటు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, పలువురు అధికారులపై చర్యలు తీసుకునే అవకాశముంది.
విద్యుత్ కొనుగోళ్లు, థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2014 నుంచి విద్యుత్ కొనుగోళ్లు, థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలపై విచారణకు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో ప్రభావవంతైన సూపర్ క్రిటికల్ టెక్నాలజీ కాకుండా సూపర్ సబ్ క్రిటికల్ టెక్నాలజీ వినియోగించడంపై విచారణ జరుపుతున్నారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్‌కు వివరణ ఇవ్వాలంటూ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో కేసీఆర్ తోపాటు అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిలపై చర్యలు తీసుకునే అవకాశముంది.
గొర్రెల పంపిణీ పేరిట స్కాం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పేరిట అక్రమాలకు తెర తీశారు. గొర్రెల కొనుగోళ్లలో రూ.700కోట్ల అవినీతి బయటపడింది. నలుగురు ప్రభుత్వ అధికారులను అరెస్టు చేశారు. ఏసీబీ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో బీఆర్ఎస్ నేతల హస్తం ఉందని భావిస్తున్నారు. 700కోట్ల రూపాయలను రైతులకు బదులు ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లోకి మళ్లించారని ఏసీబీ అధికారులు గుర్తించారు. వందల కోట్ల రూపాయలు బ్రోకర్స్, అధికారులే మింగేశారని ఏసీబీ అనుమానిస్తోంది.
భూదాన్ భూముల స్కామ్
బీఆర్ఎస్ హయాంలో భూదాన్ భూముల స్కామ్ జరిగింది. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. వంశీరాం బిల్డర్స్ సుబ్బారెడ్డికి సైతం ఈడీ నోటీసులు జారీ చేసింది.ఇప్పటికే ఐఏఎస్ అమోయ్ కుమార్‌ను ఈడీ అధికారులు పలుమార్లు విచారించారు.ఇందులో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పాత్ర ఉందని అనుమానిస్తున్నారు.