కలెక్టర్లను పరుగులుపెట్టిస్తున్న రేవంత్

ఉత్తర్వులను గనుక కచ్చితంగా అమలు చేయించగలిగితే అప్పుడు జనాలే రేవంత్ ప్రభుత్వాన్ని నిజమైన ప్రజాప్రభుత్వమని చెప్పుకుంటారు.

Update: 2024-07-12 12:21 GMT
Revanth Reddy

జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారుల పనితీరుపై రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతి కలెక్టర్, జిల్లా స్ధాయి అధికారులు ప్రతినెలా విధిగా తమ పరిధిలో పర్యటించాలని గట్టిగా చెప్పారు. ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను కలెక్టర్లు, అధికారులు పర్యవేక్షించాలి, పరిశీలించాలి, లబ్దిదారులతో మాట్లాడాలి ప్రతినెలా ఫీడ్ బ్యాక్ పంపాలని రేవంత్ స్పష్టంగా చెప్పేశారు. రేవంత్ ఆదేశాలను చీఫ్ సెక్రటరి శాంతికుమారి ఉత్తర్వులుగా(మెమొ నెంబర్ 5645/ జనరల్ ఎల్ అండ్ సి/2024) కలెక్టర్లకు జారీచేశారు.

నిజానికి కలెక్టర్లు ఫీల్డ్ విజిట్లు చేయాలనే నిబంధన దశాబ్దాలుగా ఉన్నదే. అయితే ఒకపుడు కలెక్టర్లపై పనిభారం తప్ప ఇతరత్రా ఒత్తిళ్ళు ఉండేవికావు. కాని కొంతకాలంగా కలెక్టర్లపైన పనిభారంతో పాటు అన్నీరకాల ఒత్తిళ్ళు పెరిగిపోయాయి. దాంతో చాలామంది కలెక్టర్లు ఫీల్డ్ విజిట్లను మరచిపోయారు. ముఖ్యమంత్రి లేదా మంత్రుల పర్యటనల్లో మాత్రమే కలెక్టర్లు ఫీల్డులో కనబడుతున్నారు. ఇపుడు కూడా ఫీల్డు విజిట్ చేయాలి, బాధితులు, లేదా లబ్దాదారులతో ముఖాముఖి మాట్లాడాలనే ఆసక్తి ఉన్న కలెక్టర్లు ఏదో రూపంలో ఫీల్డులో తిరుగుతున్నారు. వివిధ కారణాలతో చాలామంది కలెక్టర్లు నాలుగు గోడలమధ్యకే పరిమితమైపోతున్నారు.

ఈ విషయం గ్రహించిన రేవంత్ ప్రతి కలెక్టర్ ను తప్పనిసరిగా ఫీల్డ్ విజిట్ చేయాలని స్పష్టంగా ఆదేశించారు. ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగులకు మంత్లీ పెర్ఫార్మెన్స్ రిపోర్టు ఉన్నట్లుగానే కలెక్టర్లకు కూడా మంత్లీ రిపోర్టు ఉండబోతోంది. ప్రతినెలా 5వ తేదీన అంతకుముందు నెలలో తాము చేసిన ఫీల్డ్ విజిట్లు, తాము పరిశీలించిన విషయాలతో రిపోర్టు తయారుచేసి చీఫ్ సెక్రటరీకి పంపాలి. కలెక్టర్లు తమ ఫీల్డ్ విజిట్లలో గమనించాల్సిన అంశాలను కూడా ప్రముఖంగా ప్రస్తావించింది. అవేమిటంటే

1. వైద్య రంగం: ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లను తనిఖీచేయాలి. మందులతో పాటు ఇతరత్రా సౌకర్యాలు ఉన్నాయో లేదో గమనించాలి

2. విద్య : గ్రామీణ ప్రాంతాల్లోని స్కూళ్ళు పనిచేస్తున్న తీరును గమనించాలి. టీచర్లు సరిగా వస్తున్నారా ? పాఠాలు చెబుతున్నారా అన్న విషయాలతో పాటు సౌకర్యాలను కూడా తనిఖీచేయాలి

3. నీటి సరఫరా, పారిశుధ్యం : మంచినీరు అందరికీ అందుతున్నది లేనిది గమనించాలి. తాము పర్యటించిన ప్రాంతాల్లో పారిశుధ్యం ఎలాగుందో చూడాలి.

4. వ్యవసాయం : రైతుల సమస్యలను తెలుసుకోవటంతో పాటు ఎరువులు, విత్తనాల లభ్యతతో పాటు పంటల పరిస్ధితి కూడా రైతులతో చర్చించాలి.

5. చౌకదుకాణాలు : గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించినపుడు చౌకదుకాణాల ద్వారా రేషన్ అర్హులందరికీ అందుతోందా లేదా అన్న విషయాన్ని గమనించాలి.

6. గృహనిర్మాణం : పర్యటించిన ప్రాంతాల్లో గృహనిర్మాలు ఎలా జరుగుతున్నాయి, నిర్మాణాల్లో నాణ్యతను పరిశీలించాలి.

7. రోడ్లు, మౌళికసదుపాయాలు : పర్యటనల్లో రోడ్లు ఎలాగున్నాయి, రవాణా సౌకర్యాల పరిస్ధితిని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.

8. సంక్షేమపథకాలు : సంక్షేమపథకాలు లబ్దిదారులకు అందుతున్న విషయాన్ని పరిశీలించాలి. ముఖ్యంగా వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు పెన్షన్ అందుతున్న విషయాన్ని తెలుసుకోవాలి.

9. మున్సిపాలిటీలు : మున్సిపాలిటీల్లో పారిశుధ్యం పరిస్ధితి ఏమిటి ? మంచినీటి సరఫరా ఎలాగుంది తదితరాలపై దృష్టిపెట్టాలి

10. మహిళా, శిశుసంక్షేమం : మహిళలు, శిశువుల సంక్షేమానికి అమలవుతున్న కార్యక్రమాలు, పథకాలు అందుతున్న తీరును పరిశీలించాలి. ముఖ్యంగా అంగన్ వాడీలను కలెక్టర్లు తనిఖీ చేసి లోపాలుంటే వెంటనే సవరించాలని, పథకాల అమలుకు మెరుగైన సూచనలను చేయాలని ఉత్తర్వుల్లో చీఫ్ సెక్రటరీ స్పష్టంగా చెప్పారు.

అధికారులను తీసుకుని కలెక్టర్లు పర్యటించాల్సిన అవసరంలేదని కూడా చెప్పారు. కలెక్టర్లు, శాఖల అధికారులు ఎవరికి వారుగా జిల్లాలో పర్యటించాల్సిందే అని ఉత్తర్వుల్లో స్పష్టంగా ఆదేశించారు. వివిధ శాఖలకు సంబంధించిన స్ధానిక ఉద్యోగులతో కలెక్టర్లు ముఖాముఖి మాట్లాడి పథకాలు, కార్యక్రమాల అమలు, లోపాలపై ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుని ప్రభుత్వానికి రిపోర్టు రూపంలో పంపాలని ఆదేశించారు. టూర్ డైరీ ప్రకారం కలెక్టర్లు ఫీల్డ్ విజిట్లు చేయటమే కాకుండా ఆకస్మిక తనిఖీలు కూడా చేయాలని ప్రభుత్వం గుర్తుచేసింది. ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందుతున్న వివిధ రకాల సేవల్లో నాణ్యత ఎలాగుందన్న విషయాన్ని కలెకర్టలు తమ ఫీల్డ్ విజిట్లలో గుర్తించాలని ఉత్తర్వుల్లో ఉంది.

టూర్ డైరీని పంపటం అంటే మొక్కబడిగా కాదు. తాము తిరిగిన ప్రాంతాలు, గమనించిన విషయాలు, స్ధానికులతో జరిపిన ముఖాముఖి, గ్రహించిన లోపాలు, లోపాల సవరణకు సూచనలు ఇలా అనేక విషయాలను వివరణాత్మకంగా టూర్ డైరీ సిద్దంచేసి ప్రతినెలా 5వ తేదీకల్లా చీఫ్ సెక్రటరీకి పంపాల్సుంటుంది. కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ల గురించి ప్రభుత్వం ఇంత స్ట్రిక్ట్ గా ఎందుకు చెప్పింది ? ఎందుకంటే కలెక్టర్లు ఫీల్డ్ విజిట్లకు వస్తున్నారంటే, ఆకస్మిక తనిఖీలు జరుపుతున్నారంటే భయంతో అయినా వివిధ శాఖల అధికారులు తప్పనిసరిగా ఫీల్డు విజిట్లు చేస్తారనే. కలెక్టర్లతో పాటు వివిధ శాఖల అధికారులు కూడా రెగ్యులర్ గా ఫీల్డ్ విజిట్లు చేస్తుంటే కచ్చితంగా ప్రభుత్వం అందిస్తున్న సేవల నాణ్యత పెరుగుతుంది, ప్రజల సమస్యలూ పరిష్కారమవుతాయనటంలో సందేహంలేదు. తమది ప్రజా ప్రభుత్వం అని తరచూ చెప్పుకుంటున్న రేవంత్ తాజా ఉత్తర్వులను గనుక కచ్చితంగా అమలు చేయించగలిగితే అప్పుడు జనాలే రేవంత్ ప్రభుత్వాన్ని నిజమైన ప్రజాప్రభుత్వమని చెప్పుకుంటారు.

Tags:    

Similar News