అంతా రేవంతే చేశారా ?

మహేశ్ గౌడ్ ను అధిష్టానం ప్రకటించటం వెనుక కచ్చితంగా రేవంత్ చక్రం తిప్పారనే అంచనాలు పెరిగిపోతున్నాయి.

Update: 2024-09-07 06:12 GMT
TPCC President Mahesh

మొత్తం రేవంత్ రెడ్డే చేశారా ? అవుననే చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. తాజాగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈయన నియామకాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం సాయంత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. విచిత్రం ఏమిటంటే పీసీసీ ప్రెసిడెంట్ నియామకాన్ని అధిష్టానం ప్రకటించగానే చర్చంతా రేవంత్ మీద జరుగుతోంది. మహేశ్ గౌడ్ ను అధిష్టానం ప్రకటించటం వెనుక కచ్చితంగా రేవంత్ చక్రం తిప్పారనే అంచనాలు పెరిగిపోతున్నాయి.

పిసీసీ అధ్యక్షుడిగా ఎవరున్నా నిజానికి చేయగలిగేది ఏమీ ఉండదు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా రేవంత్ లాంటి పవర్ ఫుల్ నేతున్నపుడు పీసీసీ అధ్యక్షుడికి పెద్దగా పనుండదు. స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని అమలుచేసేంత సీనుండదు. అందుకనే అధిష్టానం కూడా రేవంత్ కు అనుకూలంగా ఉండి పనిచేసే నేతనే అధ్యక్షుడిగా నియిమించాలని డిసైడ్ అయ్యింది. మహేష్ తో పాటు అధ్యక్షపదవికి పోటీపడిన మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, కేంద్రమాజీమంత్రి, ప్రస్తుత మహబూబాబాద్ ఎంపీ బలరామ్ నాయక్, మాజీ ఎంఎల్ఏ సంపత్ ను కాదన్న అధిష్టానం మహేష్ ను ఫైనల్ చేసింది. దీనికి కారణం ఏమిటంటే మహేష్ వెనుక రేవంత్ ఉండటమే.

పీసీసీ అధ్యక్షుడి పనితీరు ముఖ్యమంత్రి పనితీరుకు తగ్గట్లే ఉండాలి. అలాకాదని ముఖ్యమంత్రి ఒకదారిగా పీసీసీ అధ్యక్షుడు మరో దారిగా వ్యవహరిస్తే ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయం దెబ్బతింటుంది. ఈ విషయం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్-డీ శ్రీనివాస్ విషయంలో ఒకసారి బయటపడింది. కాకపోతే అప్పట్లో వైఎస్సార్ హోల్ అండ్ సోలుగా ఉన్నారు కాబట్టి ఎక్కడా బయటపడకుండా వ్యవహారాలను లాక్కొచ్చారు. మధు యాష్కిని అధ్యక్షుడిగా నియమిస్తే మళ్ళీ అదే జరుగుతుందని పార్టీలో సీనియర్లు అంచనా వేశారు. యాష్కీకి డైరెక్టుగా అధిష్టానంతో మంచి సంబంధాలున్నాయి. కాబట్టి పార్టీకి సంబంధించి రేవంత్ మాట నూరుశాతం చెల్లుబాటు అవటానికి అవకాశాలు తక్కువనే చెప్పాలి.

ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రేవంత్ అధిష్టానం దగ్గర మహేష్ కోసం గట్టిగా పట్టుబట్టారని సమాచారం. ఇపుడు రేవంత్ మాట అధిష్టానం దగ్గర బాగా చెలామణి అవుతోంది. అందుకనే రేవంత్ కోరినట్లుగా అధిష్టానం కూడా మహేష్ కుమార్ గౌడ్ నే పీసీసీ చీఫ్ గా నియమించిందని పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. మొదటినుండి మహేష్ పార్టీలోనే ఉండటం అదనంగా కలిసొచ్చింది. మిగిలిన పోటీదారులు కూడా మొదటినుండి కాంగ్రెస్ లోనే ఉన్నప్పటికీ రేవంత్ మద్దతు మహేష్ కు బాగా కలిసొచ్చింది.

మహేష్ నేపధ్యం

నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్ యూఐలో ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1986-90 మధ్య జిల్లా ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడిగా పనిచేశారు. 1990-98 మధ్య ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత ఎన్ఎస్ యూఐ నుండి యూత్ కాంగ్రెస్ లోకి మారిన గౌడ్ 1998-2000 మధ్య అఖిలభారత యువజన కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేశారు. 2000-2003 వరకు ఏపీ కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేసిన మహేష్ కు తర్వాత కొంతకాలం గ్యాప్ వచ్చింది. తర్వాత 2012-16 మధ్యలో పార్టీ అధికార ప్రతినిధిగా, 2016-21 మధ్య పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

2013-14లో ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ గా కూడా పనిచేశారు. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పోటీచేసి ఓడిపోయారు. 2021 నుండి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. పార్టీ 2023లో అధికారంలోకి రాగానే ఎంఎల్సీగా అపాయింట్ అయ్యారు. మొత్తానికి తెలంగాణా బీసీ సామాజికవర్గాల్లో బలమైన గౌడ్ కులానికి చెందిన మహేష్ ను కొత్త అధ్యక్షుడిగా ఎంపికచేయటం ఊహించిందే. ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం టికెట్లు ఇవ్వలేదనే గోల జరిగింది. రేపు స్ధానికసంస్ధల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలంటే బీసీల మద్దతు చాలా అవసరం.

అందుకనే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పీసీసీ అధ్యక్షపదవిని బీసీలకు అధిష్టానం కేటాయించింది. రెండో పవర్ సెంటర్ తయారవ్వకుండా మహేష్ ఎలా వ్యవహరిస్తారన్నది ఇపుడు ఆసక్తిగా మారింది. మొన్నటివరకు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ డబుల్ యాక్షన్ చేశారు. ఇపుడు మహేష్ నియమితులయ్యారు కాబట్టి రేవంత్ ప్రభుత్వాధినేతగా మాత్రమే ఉంటారు. ఈ సమయంలోనే మహేష్ జాగ్రత్తగా అడుగులు వేయకపోతే మొదటికే మోసం వచ్చేస్తుంది. రేవంత్ అంటే పడని నేతలకు పార్టీలో కొదవలేదు. వాళ్ళందరు ఇపుడు మహేష్ వెనుక చేరే అవకాశముంది. అలాంటివాళ్ళ విషయంలో కొత్త అధ్యక్షుడు జాగ్రత్తగా వ్యవహరించకపోతే రేవంత్ తో విభేదాలు మొదలవ్వటానికి ఎంతోకాలం పట్టదు. కాబట్టి తాను రెండో పవర్ సెంటర్ కాకుండా మహేష్ జాగ్రత్తపడక తప్పదు. మరి భవిష్యత్తులో మహేష్ అడుగులు ఎలాగ ఉంటాయో చూడాల్సిందే.

Tags:    

Similar News