బీఆర్‌ఎస్ లాగే బీజేపీని చిత్తు చేయాలి.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

తుక్కుగూడ సభలో బీజేపీ, బీఆర్ఎస్‌పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ మాదిరిగానే రానున్న ఎన్నికల్లో బీజేపీని చిత్తు చేయాలని పిలుపునిచ్చారు.

Update: 2024-04-06 15:13 GMT
Source: Twitter

బీఆర్ఎస్‌ను ఎంత తుక్కుతుక్కుగా ఓడించామో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని కూడా అంతే చిత్తు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమినే గెలిపించుకుందామని తుక్కుగూడలో నిర్వహించిన సభ వేదికగా పిలుపునిచ్చారాయన. కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని, కార్యకర్తల కష్టంతోనే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని రాష్ట్రంలో కాంగ్రెస్ సాధించిన గెలుపును గుర్తు చేశారు. మీ కృషితో జూన్ 9న ఢిల్లీలో మువ్వన్నెల జెండా రెపరెప లాడాలని కోరారు. ‘‘కేసీఆర్ పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఆ పదేళ్లలోనే వందేళ్ల విధ్వంసం సృష్టించారు. ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకోవడానికి నేను జానారెడ్డిని కాదు. ఎలా పడితే అలా మాట్లాడితే జైల్లో పెడతాం. ఆయన కోసం చర్లపల్లిలో ప్రత్యేకంగా డబుల్ బెడ్‌రూం జైలు కట్టిస్తా. ఇన్నాళ్లూ కాలు విరిగింది. కూతురు జైలుకు వెళ్లిందని జాలి చూపించి సైలెంట్‌గా ఉన్నాం. ఇక ఊరుకునే ప్రసక్తే లేదు. ఎక్కువ మాట్లాడితే జైలుకే. గతంలోలా కాకుండా ఢిల్లీ నుంచి రాష్ట్రానికి నిధులు రావాలంటే కాంగ్రెస్‌ను 14 స్థానాల్లో గెలిపించండి’’అని కోరారు రేవంత్ రెడ్డి.

నమో అంటే అర్థం అదే

కేసీఆర్‌పై మండిపడిన అనంతరం బీజేపీ టార్గెట్‌గా రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. మోదీ చెప్పి నమో అంటే నమ్మితే మోసం అని అర్థమంటూ కొత్త నిర్వచనం చెప్పారు. ‘‘విభజన చట్టం అమలు చేస్తా అని మాటిచ్చి నెరవేర్చలేదు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఊసే ఎత్తట్లేదు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. ఆయన ఇచ్చిన హామీ ప్రకారం చూసుకున్నా ఈ పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కేవలం 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 17 నెలల చేసిన పోరాటంలో 750 మంది మరణించారు. వారికి ఏమైనా న్యాయం చేశారా.. ఆఖరికి మృతుల కుటుంబాలను ప్రధాని పరామర్శించిన దాఖలాలు కూడా లేవు’’అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రానున్నవి ఎన్నికలు కాదు మహా యుద్ధం

త్వరలో జరగనున్నవి కేవలం ఎన్నికలు కాదని, అవి రెండు కుటుంబాల మధ్య పోరాటమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘మాటకొస్తే కాంగ్రెస్‌ను కుటుంబ పార్టీ అని ప్రధాని మోదీ సెటైర్లు వేస్తుంటారు. కానీ అసలు కుటుంబ పార్టీ ఎవరిది. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలు రెండు కుటుంబాల మధ్య యుద్ధం. ఈ పోరాటంలో మోదీ పరివార్, గాంధీ పరివార్ తలపడనున్నాయి. ఇందులో మోదీ పరివార్‌లో ఈడీ, సీబీఐ, ఐటీ, ఎన్నికల సంఘం ఉన్నాయి. మరోపక్క గాంధీ పరివార్‌లో దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన రాజీవ్, ఇందిరా గాంధీ, పదవి త్యాగం చేసిన సోనియా, రాహుల్, ప్రియాంక ఉన్నారు.ఈ యుద్ధంలో తెలంగాణ.. రాహుల్ వెంట నడుస్తుంది. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకోవాలి’’అని రేవంత్ కోరారు.

Tags:    

Similar News