ఓటు హక్కును కాపాడాలనే కాంగ్రెస్ పోరాటమా..?
కేరళ అలెప్పిలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.;
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. దేశ ప్రజల హక్కులను కమలం పార్టీకాలరాస్తోందన్నారు. ప్రజల ఓటు హక్కును కూడా లాక్కుంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు దేశంలో ఏర్పడ్డాయని ఆయన చెప్పారు. కేరళలోని అలెప్పిలో మెరిట్ విద్యార్థలకు అవార్డుల ప్రదానం చేసే కార్యక్రమంలో రేవంత్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ‘ఓట్ల చోరీ’ అంశంపై మాట్లాడారు. ప్రతి భారతీయుడి ఓటు హక్కును కాంగ్రెస్ కాపాడుతుందని, అందుకోసం ఎంత దూరం వెళ్లడానికయినా తమ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. అందుకోసమే ‘ఓట్ అధికార్’ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా చేస్తున్నామని రేవంత్ తెలిపారు.
ఇంకా రేవంత్ ఏమన్నారంటే..
‘‘కేసీ వేణుగోపాల్ ఎల్లప్పుడూ పేదల పట్ల, అణ న వర్గాల కోసం పోరాడుతూనే ఉన్నారు. అణిచివేతకు, అన్యాయానికి గురవుతున్న బాధితుల తరఫున వారు గొంతుకగా నిలుస్తున్నారు. కేసీ వేణుగోపాల్ తన నియోజకవర్గంతో పాటు కేరళ రాష్ట్రానికే కాకుండా యావత్ దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ప్రత్యేకించి మహిళలు, పిల్లల న్యాయం కోసం, వారి అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్నారు. వేణుగోపాల్ 2006 లో ప్రారంభించిన పొంథువల్ (ఎంపీ) మెరిట్ అవార్డులకు దేశంలోనే చాలా ప్రత్యేకత ఉంది. 10 వ తరగతి, 12 వ తరగతి విద్యార్థినీ విద్యార్థుల్లో అత్యుత్తమ ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడానికి, వారిలో ఒక స్ఫూర్తిని నింపడానికి ఈ మెరిట్ అవార్డులు ఎంతగానో దోహదపడుతున్నాయి’’ అని అన్నారు.
‘‘ఈ ఏడాది వంద శాతం ఫలితాలను సాధించిన 150 పాఠశాలల్లో దాదాపు 3,500 లకుపైగా ప్రతిభ కలిగిన విద్యార్థులకు అవార్డులు అందిస్తున్నారు. దేశంలో విద్యకు, కేరళ రాష్ట్రానికి బలమైన సంబంధం ఉంది. దేశంలో వంద శాతం అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రం కేరళ. ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్న వయోజన విద్యా కార్యక్రమం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కేరళ రాష్ట్రంలో విద్యా రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. 10 వ, 12 వ తరగతి తర్వాత… సున్నా శాతం డ్రాప్ అవుట్స్ సాధించడమంటే అందులో ఆశ్చర్యమేమీ ఉండదు. విద్య అనేది మనకు లభించిన ఒక గొప్ప బహుమతి. విద్య అన్నది ఒక గొప్ప ఆయుధం. అదే అందరికీ గొప్ప శక్తి.. అని నేను చాలా బలంగా విశ్వసిస్తా’’ అని చెప్పారు.
‘‘అలాంటి విద్యకు ప్రాధాన్యతనిస్తున్న దైవ భూమి కేరళ రాష్ట్రం. తెలంగాణలో విద్యాభివృద్ధికి పెద్ద ఎత్తున దృషి సారించాం. విద్యకున్న ప్రాధాన్యత గురించి నేను ప్రతి సందర్భంలోనూ ప్రజలకు చెబుతున్నా. ప్రభుత్వం చేసే సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు ఏది చేసినా విద్య మనకు అత్యంత ప్రాధాన్యత కలిగింది. వచ్చే పదేళ్లలో తెలంగాణకను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగాపెట్టుకున్నాం. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిదేందుకు కృషి చేస్తున్నాం. తెలంగాణలో పేదలకు నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పించాం. కేవలం 55 రోజుల్లో 11055 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశాం’’ అని వెల్లడించారు.
‘‘వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించబోతున్నాం. ఒక్కో స్కూల్ కు రూ.200 కోట్లు ఖర్చుతో 25 ఎకరాల్లో నిర్మించబోతున్నాం. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పించాం. యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఆనంద్ మహీంద్రాను చైర్మన్ గా నియమించాం. ఐటీఐ లను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేశాం. ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేసుకుంటున్నాం. విద్యార్థుల్లో ఒక స్ఫూర్తిని నింపడానికి ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన కేసీ వేణుగోపాల్‌కి అభినందనలు’’ అని తెలిపారు.
‘‘వేణుగోపాల్ తీసుకున్న ఈ చొరవను ప్రతి నియోజకవర్గంలో, రాష్ట్రం మొత్తం ఈ విధానాన్ని స్పూర్తిగా తీసుకోవాలని కోరుకుంటున్నా. విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అగ్రస్థానంలో విజేతగా నిలుస్తున్న కేరళ రాష్ట్రం పట్ల ఒకింత అసూయ కలుగుతోంది. గత లోక్ సభ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ ని, ప్రియాంకా గాంధీ ని తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరాను. కానీ వారు కేరళను తమ ఇంటిగా, తమ నియోజకవర్గంగా, తమ కర్మభూమిగా ఎంచుకున్నారు. ఈ రోజు దేశంలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తున్నాం. ఓట్ చోరీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేస్తున్నాం. ప్రతి భారతీయుడి ఓటు హక్కును కాపాడాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరముంది’’ అని పేర్కొన్నారు.
‘‘కేరళ రాష్ట్రానికి ఎన్నికలు రాబోతున్నాయి. 2026 లో జరిగే ఎన్నికలు కేవలం కేరళ అసెంబ్లీ ఎన్నికలుగా భావించకండి. అవి 2029 లో దేశ భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలవుతాయి. దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి రాజీవ్ గాంధీ ఓటు హక్కు కల్పించారు. అదే బీజేపీ నాయకుడు నరేంద్ర మోదీ పౌరుల నుంచి ఓటు హక్కును కొల్లగొడుతున్నారు. 2029 లో జరగబోయే లోక్ సభ ఎన్నికలు ఈ రెండు శక్తుల మధ్య జరగబోతున్నాయి. దేశంలోని యువత ఈ తేడాను గమనించాలి. 21 ఏళ్ల వయసున్న IAS లు జిల్లాలను సమర్ధవంతంగా నడుపుతున్నప్పుడు 21 ఏళ్ల వయసున్న యువత ఎమ్మెల్యేలుగా ఎందుకు పోటీ చేయకూడదు’’ అని తెలిపారు.
‘‘ఆ దిశగా మనం రాజ్యాంగాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంది. యువతకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. యువత తమలోని శక్తిని గుర్తించాలి. రాజ్యాంగ పరిక్షణ కోసం పని చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వద్ద ఆర్థిక బలం లేదు. మీడియా మద్దతు లేదు. కేవలం యువత, యువతలోని శక్తిని నమ్ముకుని కాంగ్రెస్ పోరాటం సాగిస్తోంది. ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ పోరాడుతుంది. బీజేపీ యువత హక్కులను కొల్లగొడుతోంది. కాంగ్రెస్ యువత హక్కులను పరిరక్షిస్తుందని గుర్తించండి. 2029 సంవత్సరం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే సంవత్సరంగా అందరికీ చాటుదాం. మీరే మా నమ్మకం. మీరే మా బ్రాండ్ అంబాసిడర్లు. మీ భవిష్యత్తు కోసం పోరాటం చేయండి. దేశం కోసం పోరాటం చేయండి. మీరంతా ఆ పని చేస్తారని బలంగా విశ్వసిస్తున్నా’’ అని తెలిపారు రేవంత్.