బీఆర్‌ఎస్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాం: రేవంత్
కళ్లు నెత్తికెక్కి విర్రవీగిన కల్వకుంట్ల ప్రభుత్వాన్ని తరిమి కొట్టింది మీరు.;
రాష్ట్రంలో అధికారం తమదే, తమను పడగొట్టేటోడు లేడు అనుకున్న బీఆర్ఎస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వాళ్లు కలలో కూడా ఊహించని రీతిలో అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి సీట్లు మార్చామని, అది తట్టుకోలేక ఓ పెద్దమనిషి అసెంబ్లీ గేటును తాకడానికి కూడా ఇష్టపడటం లేదని కౌంటర్లు వేశారు. ఎల్బీ స్టేడియం వేదికగా నిర్వహించిన ‘సామాజిక న్యాయం సమరభేరి’ సభలో రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు తిరుగులేదన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎంతో మంది ఎన్నో రకాల ఆశలు పెట్టుకున్నారని, ఆరు నెలల్లో ప్రభుత్వం కూప్పకూలుతుందని కలలు కన్నారని, కానీ తాము వాటన్నింటిని పటాపంచలు చేసి సుపరిపాలన అందిస్తున్నామని రేవంత్ చెప్పారు.
‘‘తెలంగాణలో తమకు ఎదురులేదని కళ్లు నెత్తికెక్కి విర్రవీగిన కల్వకుంట్ల ప్రభుత్వాన్ని తరిమి కొట్టింది మీరు. ఇదే వేదిక నుంచి ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి గుండె తడుతూ పాలన అందిస్తున్నాం. మా ప్రభుత్వం ఏర్పడినప్పుడు.. ఇది మూడు నెలల ముచ్చటే అని, ఆ తర్వాత ఎవరూ కలిసి పనిచేయలేరని కొందరు కారుకూతలు కూశారు. కానీ మేము వారికి మా ఐకమత్యంతో బుద్ధి చెప్పాం. వరుసగా సంక్షేమ పథకాల అమలు చేస్తూ వాళ్లు నోళ్లు మూయించాం. ఎన్ని కష్టాలు, ఒడిదుడుకులు వస్తున్నా వాటన్నింటిని అధిగమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాం’’ అని రేవంత్ అన్నారు.
‘‘ఆకలితో ఉన్న పేదల కడుపు నింపాలన్న ఉద్దేశంతో ఇందిరమ్మ పేరుతో క్యాంటీన్‌లు పెట్టాం. కానీ వాటిని చూసి కడుపుమండిన ఇద్దరు దద్దమ్మలు ధర్నాలకు దిగారు. అలాంటోళ్లను బట్టలూడిదీసి కొడితే గానీ ఇందిరమ్మ గురించి తెలియదు. గతంలో హాస్టల్‌లకు ఇచ్చే సరుకులను బీఆర్ఎస్ నేతలు దోచుకుపోయారు. కానీ మా ప్రభుత్వం ఆ బాధ్యతను మహిళా సంఘాలు అప్పగించింది. ఈ 18 నెలల్లో.. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వమే’’ అని ముఖ్యమంత్రి రేవంత్ తెలియజేశారు.