‘దేశ రక్షణ విషయంలో అంతా ఒక్కటవుతాం’

ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు భారత సైన్యానికి మద్దతుగా నిలుస్తామన్నారు.;

Update: 2025-05-08 14:11 GMT

ఆపరేషన్ సిందూర్‌కు సంఘీభావంగా కాంగ్రెస్ ప్రభుత్వం సాలిడారిటీ ర్యాలీ నిర్వంచింది. ఈ ర్యాలీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ రక్షణ విషయానికి వస్తే సిద్దాంతాలు, వైరాలు పక్కనబెట్టి అంతా ఒక్కటవుతామని రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘దేశ రక్షణలో అందరం ఒక్కటేనని చాటుతూ తెలంగాణ గడ్డ నుంచి భారత జవాన్లకు స్ఫూర్తినిచ్చేందుకే ఈ సంఘీభావ ర్యాలీ. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి భారత దేశ సార్వభౌమత్వాన్నిదెబ్బతీయాలని చూస్తే సహించేది లేదు. దేశ సార్వభౌమత్వాన్ని ఎవరైనా దెబ్బతీయాలని చూస్తే వారికి నూకలు చెల్లినట్లే.. ఇది మా హెచ్చరిక. దేశ రక్షణ విషయంలో రాజకీయాలకు అతీతంగా ఒక్కటవుతాం. మేం శాంతి కాముకులం.. అది మా చేతగానితనం అనుకుని మా ఆడబిడ్డల నుదిటి సిందూరం తుడిచేయాలనుకుంటే… వారికి ఆపరేషన్ సిందూర్ తో సమాధానం చెబుతాం. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు భారత సైన్యానికి మద్దతుగా నిలుస్తాం’’ అని అన్నారు.


“భారత సార్వభౌమాధికారం వైపు కన్నెత్తి చూసినా.. అలాంటి వారికి ఈ భూమి మీద నూకలు చెల్లినట్టే. భారతీయ వీర జవానులకు 140 కోట్ల దేశ ప్రజల మద్దతుంది. మా వీర జవానులు తలుచుకుంటే ప్రపంచ పటంలో మీ ఉనికి లేకుండా చేయగలరు” అని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఉగ్రవాదులను హెచ్చరించారు.

“భారతీయ సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్‌ను ఎవరూ ఆపలేరు. భారతదేశ రక్షణ కోసం మేమంతా ఒక్కటే. వీర జవానులు ఏ చర్య తీసుకున్నా అందుకు మద్దతుగా వారి వెంట నడవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు” అని చెప్పారు.

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ముఖ్యమంత్రి ముందుండి ర్యాలీ నిర్వహించారు.

నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి చిత్రపటాలకు ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టివిక్రమార్క గారితో కలిసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడుతూ, వీర జవానులకు దేశం అండగా నిలబడుతుందని ఉగ్రవాద ప్రేరేపిత పాకిస్తాన్‌కు గట్టిగా హెచ్చరించారు.

భారత వీర జవానులకు దేశ ప్రజలందరూ అండగా ఉన్నామని, భారత దేశ సార్వభౌమాధికారం మీద ఎవరు దాడి చేసినా వారిని వదలిపెట్టబోమనే సందేశాన్ని ఈ తెలంగాణ గడ్డమీద నుంచి ఇవ్వడానికే ఈ ర్యాలీ నిర్వహించామని చెప్పారు.

“భారత వీర జవాన్లకు అండగా నిలబడి, వారికి ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాల ప్రతినిధులు, మాజీ ఆర్మీ అధికారులు, రాష్ట్ర పోలీసు అధికారులు, సచివాలయ ఉద్యోగులంతా వేలాదిగా ఈ సంఘీభావ ర్యాలీకి తరలివచ్చి మన సైనికులకు అండగా నిలిచినందుకు అందరికీ అభినందనలు.

పాకిస్తాన్ ఉగ్రవాదులకు, పాకిస్తాన్ పాలకులతో పాటు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఈ దేశ సార్వభౌమాధికారంపై దాడి చేయాలనుకున్న ప్రతి ఒక్కరికీ ఈ ర్యాలీ ద్వారా హెచ్చరిస్తున్నాం. మా వైపు కన్నెత్తి చూసినా ఈ భూమి మీద మీకు నూకలు చెల్లినట్టే. ఈ భూమి మీద నివసించడానికి మీరు అర్హత కోల్పోయినట్టే.

Tags:    

Similar News