‘రేవంత్.. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తుండు’
తమ ఫోన్లు ట్యాప్ చేయడం వల్లే క్యాబినెట్ మీటింగ్‌కి రాకుండా మంత్రులు ఢిల్లీలో కూర్చున్నారన్న పాడి కౌశిక్.;
‘చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు.. చేసేవేమో గుడిచేటి పనులు’ అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తీరు ఉందంటూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనకేమీ తెలియని నంగనాచిలా వ్యవహరిస్తున్న రేవంత్.. ఎంతో మంది ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారని, చాలా మందిని బ్లాక్‌మెయిల్ కూడా చేస్తున్నారని కౌశిక్ ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలతో పాటు కొందరు కాంగ్రెస్ నేతల ఫోన్లను కూడా రేవంత్.. ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. పలువురు హీరోయిన్ల ఫోన్లను కూడా ప్రైవేటు హ్యాకర్ల సహాయంతో హ్యాచ్ చేయిస్తున్నారని, పైగా వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు పాడి కౌశిక్ రెడ్డి.
లీకులతో కాలం వెళ్లదీస్తున్నావ్..
రేవంత్ రెడ్డి.. ఫోన్ ట్యాపింగ్, లీకులతో కాలం గడుపుతున్నారని, పాలనను మరిచిపోయారని కౌశిక్ విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఫోన్‌ను సైతం ట్యాప్ చేసిండు రేవంత్ రెడ్డి అని అన్నారు. రేవంత్ చేస్తున్న పాడు పనులన్నీ తమకు తెలుసని అన్నారు. మైహోంభుజాలో ఏ హీరోయిన్ దగ్గరకు రేవంత్ వెళ్లారో కూడా తమకు తెలుసని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘నువ్వు తిరిగిన 16 మంది విషయాలు కూడా తెలుసు. ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నందుకు రేవంత్ రెడ్డిపై ఈడీ, సీబీఐ విచారణ చేయాలి. బ్రోకర్లతో కలిసి సినీ ఇండస్ట్రీలో ఉన్న వారి ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేయిస్తున్నారు. నా ఫోన్ హ్యాక్ చేస్తున్నారని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదు. నా భార్య ఫోన్ కూడా హ్యాక్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహా కొందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు చెప్పారు’’ అని కౌశిక్ పేర్కొన్నారు.
కేబినెట్ మీటింగ్ అందుకే వాయిదా..
‘‘నిజానికి శుక్రవారం తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉంది. కానీ అనూహ్యంగా అది వాయిదా పడింది. మంత్రివర్గ సమావేశం అప్పటికప్పుడు అనుకుని పెట్టుకునేది కాదు. దానికి పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. అలాంటి సమావేశం వాయిదా పడటానికి కూడా రేవంత్ రెడ్డి చేయిస్తున్న ఫోన్ ట్యాపింగే కారణం. ఈ వ్యవహారంపై ఢిల్లీలో పెద్ద పంచాయితీ అవుతోంది. తమ ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని మంత్రులంతా ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల దగ్గరకు వెళ్లి కూర్చున్నారు. అందుకే ఇక్కడ జరగాల్సిన క్యాబినెట్ సమావేశం వాయిదా పడింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తేల్చే వరకు తాము ఏ సమావేశానికి రాబోమని మంత్రులు భీష్మించారు. ఈ విషయంలో రేవంత్‌పై కాంగ్రెస్ పెద్దలు కోపంగా ఉన్నారు’’ అని పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.