Saleshwaram | త్వరలో సలేశ్వరానికి సఫారీ యాత్ర...
తెలంగాణ అమరనాథ్ యాత్రగా పేరున్న సలేశ్వరం యాత్రలో భక్తుల రద్దీ వల్ల వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.రద్దీని తగ్గించేందుకు సఫారీ యాత్ర చేపట్టనున్నారు.;
By : Saleem Shaik
Update: 2025-02-11 13:32 GMT
పచ్చని చెట్లు,ఎతైన కొండలు, గుట్టలు, జాలువారే జలపాతాలు, ప్రకృతి అందాలకు నెలవైన దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ని సలేశ్వరం లింగమయ్యను దర్శనం చేసుకోవాలంటే అమర్నాథ్ యాత్రలా సాహసం చేయాలి.అందుకే సలేశ్వరం జాతరకు తెలంగాణ అమర్నాథ్ జాతర అని పేరు వచ్చింది.సలేశ్వరం జలపాతాలు ఏడాది పొడవునా 200 అడుగుల ఎత్తు నుంచి ప్రవహిస్తుంటాయి.
-అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో సలేశ్వరం జాతర వల్ల వన్యప్రాణులకు ప్రాణసంకటంగా మారింది. ప్రతీ ఏటా చైత్రపౌర్ణమి నాడు జరిగే సలేశ్వరం జాతరకు 5లక్షల మంది భక్తులు తరలివస్తుంటారు. తెలంగాణలో కొండ కోనల్లో దట్టమైన అడవిలో జలపాతాల హోరు మధ్య లోయల్లో జరిగే సలేశ్వరం జాతర ప్రతీ ఏటా కేవలం మూడు రోజుల పాటు జరుగుతోంది.
- తెలంగాణ అమరనాథ్ యాత్రగా పేర్కొనే ఈ సలేశ్వరం యాత్రలో పాల్గొనే లక్షలాది మంది భక్తుల రద్దీ వల్ల అభయారణ్యంలోని వన్యప్రాణుల మనుగడకు ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ అమ్రాబాద్‌లో పెద్ద పులుల సంఖ్య 34కు పెరిగింది. 180 దాకా చిరుతలు, 22 రకాల వన్యప్రాణులు, 350 రకాల పక్షులు ఈ అభయారణ్యంలో ఉన్నాయి.
భక్తుల రద్దీతో వన్యప్రాణులకు అంతరాయం
సలేశ్వరం జాతరకు వచ్చే వాహనాల వల్ల అభయారణ్యంలోని వన్యప్రాణులపై తీవ్ర ప్రభావం చూపించనుంది. దట్టమైన అడవిలో పగలూ, రాత్రి సమయంలో వాహనాలు కదులుతున్నప్పుడు వన్యప్రాణులకు అంతరాయం ఏర్పడనుంది. భక్తుల రద్దీ వల్ల పులులే కాకుండా ఇతర వన్యప్రాణుల ఆవాసాల దెబ్బతినే అవకాశముందని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ సిద్ధిఖీ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. భక్తుల రద్దీతో పాటు చెత్త అడవిలో పేరుకుపోతే వన్యప్రాణులు వాటిని ఆహారంగా తీసుకుంటాయని దీని వల్ల వాటికి ముప్పు ఏర్పడే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. దట్టమైన అడవిలోకి వచ్చే భక్తులు, చుట్ట, బీడీలు, సిగరెట్లు కాల్చి పడేస్తే అది అగ్నిప్రమాదాలకు దారితీసే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అడవిలో ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలు పడేయడం వల్ల అభయారణ్యానికి పెనుముప్పు ఏర్పడే అవకాశముందని వన్యప్రాణి ప్రేమికులు చెబుతున్నారు.
జాతరలో భక్తుల రద్దీని తగ్గించేలా ఎమ్మెల్యే ప్రతిపాదనలు
అమ్రాబాద్ అభయారణ్యంలో భక్తుల రద్దీని తగ్గించేందుకు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీ కృష్ణ వినూత్న ప్రతిపాదనలను రాష్ట్ర అటవీశాఖ ముందుంచారు. సలేశ్వరం జాతర కోసం ఏడాదికి మూడు రోజులు మాత్రమే భక్తులను అనుమతించడం వల్ల లక్షలాది మంది భక్తుల రాకతో రద్దీ పెరిగి అభయారణ్యంలోని వన్యప్రాణులకు ముప్పు ఏర్పడే అవకాశముందని ఎమ్మెల్యే వంశీ కృష్ణ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. అలా కాకుండా ఏడాదిలో వర్షాకాలంలో పులులు గర్భం దాల్చే జులై, ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో కాకుండా మిగతా 9 నెలల పాటు సలేశ్వర క్షేత్ర దర్శనం కోసం అటవీశాఖ సఫారీ వాహనాల్లో రోజుకు 30 నుంచి 50 మంది భక్తులను లింగమయ్యను దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తే పర్యాటక ఆదాయం కూడా పెరుగుతుందని ఎమ్మెల్యే ప్రతిపాదించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రతిపాదనను రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ కూడా ఆమోదించారు. ప్రస్థుతం 9 నెలల పాటు సలేశ్వరం దర్శనభాగ్యం కల్పించాలనే ప్రతిపాదనలు అటవీశాఖ అధికారుల పరిశీలనలో ఉన్నాయి.
అటవీ గ్రామాల చెంచులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటాం : డీఎఫ్ఓ గోపిడి రోహిత్
అమ్రాబాద్ అటవీ ప్రాంతంలోని అప్పాపూర్, రాంపూర్ గ్రామాల చెంచులను సంప్రదించి వారి అభీష్టం ప్రకారం 9 నెలల పాటు సలేశ్వరం లింగమయ్యను దర్శించుకునేలా సఫారీ యాత్ర చేపడతామని అమ్రాబాద్ డీఎఫ్ఓ గోపడి రోహిత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. జాతర ద్వారా వచ్చే ఆదాయంలో చెంచుల సంక్షేమానికి కేటాయిస్తున్నామని, దీనిపై రెండు అటవీ గ్రామాల ప్రజల మధ్య వివాదం ఏర్పడిందని చెప్పారు. సలేశ్వరం సమీపంలోని రాంపూర్ గ్రామస్థులు తీర్మానం చేస్తేనే తాము 9 నెలల పాటు సలేశ్వరం సందర్శనకు అనుమతిస్తామన్నారు. కేవలం మూడు రోజులే అనుమతిస్తుండటం వల్ల భక్తుల రద్దీ వల్ల తొక్కిసలాటలకు దారి తీసి ప్రాణ నష్టం కూడా జరుగుతుందని రోహిత్ చెప్పారు.
భక్తుల రద్దీని తగ్గించేందుకే సఫారీ యాత్ర
అమ్రాబాద్ అభయారణ్యంలోని వన్యప్రాణుల ఆవాసాలకు నష్టం తగ్గించడం,ప్లాస్టిక్ వాడకంపై నియంత్రణ,బయటి వ్యక్తులు దుకాణాలను ఏర్పాటు చేయడంపై నియంత్రణ,ప్రతిరోజూ చెత్త నిల్వలను నివారించడం, చెత్తను బయట తరలించడానికి తాము చర్యలు తీసుకుంటున్నామని రోహిత్ చెప్పారు.లింగమయ్య గుడి, జలపాతం ప్రదేశంలో చిప్స్ ,కుర్కురే ,షాంపూ, సబ్బు కవర్ల వాడకంపై నిషేధం విధిస్తామని చెప్పారు. సఫారీ వాహనాల్లో 9 నెలల పాటు భక్తులను సలేశ్వరం సందర్శనకు అనుమతిస్తే జాతర సందర్భంగా భక్తుల రద్దీ తగ్గుతుందని, దీని వల్ల అభయారణ్యానికి పర్యావరణ ముప్పు ఏర్పడకుండా నివారించవచ్చని డీఎఫ్ఓ చెప్పారు.
త్వరలో సలేశ్వరానికి సఫారీ యాత్రలు
తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరొందిన సలేశ్వరం జాతర ఏప్రిల్ నెలలో మూడు రోజుల పాటు జరగనుంది. ఈ జాతరకు భక్తుల రద్దీని నివారించేందుకు సలేశ్వరానికి సఫారీ యాత్రలు ప్రారంభించాలని అటవీ శాఖ యోచిస్తోంది. రెవెన్యూ, ఆర్టీసీ,పర్యాటక శాఖ, పోలీసు, అటవీశాఖల అధికారులు ఈ జాతర సందర్భంగా ఏర్పాట్లు చేయనున్నారు. త్వరలో సలేశ్వరానికి సఫారీ యాత్రను ప్రారంభిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
సలేశ్వరం ఆలయానికి ఎలా వెళ్లాలంటే...
సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవాలంటే భక్తులు పెద్ద సాహసం చేయాలి. దట్టమైన నల్లమల అడవిలో కొండలు, గుట్టలు ఎక్కి దిగుతూ... మధ్య రాళ్లు, రప్పలు దాటుతూ ,జాలువారుతూ ప్రవహిస్తున్న జలపాతాలను దాటుకొని ఆలయానికి చేరుకోవాలి. పరహాబాద్ కు 19 కిలోమీటర్ల దూరంలోని సలేశ్వరం లింగమయ్యను దర్శించుకునేందుకు కొంతదూరం కాలినడకన వెళ్లాలి.నల్లమల అటవీ ప్రాంతంలోని లోయల్లో పున్నమి వెన్నెల్లో లింగమయ్య నామస్మరణం చేస్తూ భక్తులు సలేశ్వరం ఆలయానికి చేరుకుంటారు. వెయ్యి అడుగుల పై నుంచి జాలువారుతున్న జలపాతాల తుంపర్ల మధ్య ఆలయానికి చేరుకోవాలి.
జాతరలో అపశ్రుతులు
సలేశ్వరం జాతరలో పలుసార్లు తొక్కిసలాట జరగడంతో పలువురు మృత్యువాత పడ్డారు. 2023వ సంవత్సరంలో ఇద్దరు భక్తులు మరణించారు. తొక్కిసలాటలో లోయలోకి దిగుతుండగా గుండెపోటు రావడంతోపాటు ఒకరు మరణించారు. ట్రాఫిక్ జామ్ వల్ల అడవిలో సమస్యలు ఎదురవుతుంటాయి. గతంలో జాతరలో పలు తొక్కిసలాట ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఉదయం 7 నుంచి రాత్రి 6 గంటల వరకే యాత్రకు అనుమతి
సలేశ్వరం జాతరకు వచ్చేందుకు భక్తులకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతి ఇస్తారు.గతంలో సంవత్సరానికి ఒక్కసారి కేవలం మూడు రోజుల పాటు భక్తులను సలేశ్వరం ఆలయానికి అనుమతించేవారు.
లోయ గుండంలో ఆక్సిజన్ లెవెల్ తగ్గి...
ఏడాదికి కేవలం మూడు రోజుల పాటు సలేశ్వరం జాతరకు అనుమతించడం వల్ల లక్షల మంది భక్తులు తరలివస్తున్నారు. దీనివల్ల ఆలయం ఉన్న లోయ గుండంలో ఆక్సిజన్ లెవెల్ తగ్గి ప్రాణ నష్టం జరుగుతుంది. కేవలం మూడు రోజులే అనుమతిస్తుండటంతో రెండు లక్షల మందికి పైగా భక్తులు అభయారణ్యంలోకి వస్తున్నారు. దీనివల్ల అడవిలోని జంతువులతోపాటు పర్యావరణానికి పెనుముప్పు సంభవించే అవకాశాలున్నాయి.
అటవీశాఖ సరికొత్త ప్రతిపాదనలు...
ప్రాణనష్టంతోపాటు అభయారణ్యంలో జనం రద్దీని నివారించడానికి వీలుగా 9 నెలల పాటు రోజుకు 30 నుంచి 50 మంది భక్తులను మాత్రమే సఫారీ వాహనంలో సలేశ్వరం ఆలయానికి తీసుకువెళ్లేలా ప్రతిపాదనలను అమ్రాబాద్ అభయారణ్యానికి చెందిన అటవీ శాఖ అధికారులు తయారు చేశారు.అడవుల్లో నివాసమున్న చెంచులే భక్తులను ప్రత్యేక సఫారీ వాహనాల్లో సలేశ్వరం తీసుకువెళ్లి లింగమయ్య దర్శనం చేయించి తీసుకువచ్చేలా ప్రతిపాదించారు. దీనివల్ల చెంచులకు ఉపాధి కూడా కల్పించాలని నిర్ణయించారు.
పులుల ఆవాసాలకు ఆటంకం కలిగించొద్దు
పులుల ఆవాసాలకు ఆటంకం కలిగించవద్దని సలేశ్వరం భక్తులకు అటవీశాఖ అధికారులు సూచించారు. జాతర సమయంలో భక్తులు ప్లాస్టిక్ కవర్ల స్థానంలో కాగితపు కవర్లు, జ్యూట్ బ్యాగులు వాడాలని కోరారు.వాటర్ ప్యాకెట్లకు అనుమతించమని చెప్పారు. ప్లాస్టిక్ కవర్లను అడవిలో వేయరాదు. అడవిలో చుట్ట, బీడీ, అగ్గిపెట్టెలను నిషేధించారు. అడవుల్లో వంట చేయరాదు. మద్యపానాన్ని నిషేధించారు. నిబంధనలు పాటించని భక్తులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం చర్య తీసుకుంటామని ప్లాస్టిక్ వస్తువులను మన్ననూర్, దోమలపెంట అటవీ చెక్ పోస్టుల్లో అప్పగించాలి. అటవీ ప్రాంతంలో షాంపూలు, సబ్బులు వాడరాదు. అటవీ జంతువులకు తినుబండారాలు వేయరాదు. జాతర సందర్భంగా ద్విచక్రవాహనాలు, కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, బస్సులు, డీసీఎంల నుంచి టోల్ ఫీజును వసూలు చేసి దాన్ని టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ ఫండుకు జమ చేస్తారు.