వెండితో పట్టుపీతాంబరం చీర, సిరిసిల్ల చేనేత కార్మికుడి ఘనత
శతాబ్ద కాలం నాటి పట్టుపీతాంబరం చీరను చేనేత మగ్గంపై నేసి రికార్డు సృష్టించారు.
By : The Federal
Update: 2025-10-10 12:40 GMT
సిరిసిల్ల చేనేత కళాకారుడు తనకున్న కళా నైపుణ్యంతో శతాబ్ద కాలం నాటి పట్టుపీతాంబరం చీరను నేసి ఔరా అనిపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ చేనేత మగ్గంపై పురాతన కాలం నాటి పట్టు పీతాంబరం చీరను ఆర్డరుపై నేశారు. ఈ చీరలో వెండి దారాలను ఉపయోగించారు.
మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన స్వప్న పట్టు పీతాంబరం చీర నేసి ఇవ్వాలని కోరగా సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ దీన్ని నేసి పునర్ సృష్టించాడు. 60 రోజుల పాటు శ్రమించి ఈ చీరను నేశాడు.
ఈ అరుదైన చీర 660 గ్రాములు బరువుందని, ఇందులో 362 గ్రాముల వెండిని ఉపయోగించి నేశానని హరిప్రసాద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. సాధారణంగా చీర రెండు పక్కల అంచులు రన్నింగ్ లో వస్తుంది కానీ ఈ చీరలో బార్డర్ బుటా, మీనా వర్క్ అన్నీ కూడా చేతితో పెట్టి నేయడం విశేషం. శుక్రవారం ఈ చీరను హరిప్రసాద్ స్వప్నకు అందజేశారు.