ఇంటర్‌లో ఫెయిల్.. ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య
పరీక్షల్లో ఫెయిల్ అయితే జీవితం అక్కడే ఆగిపోతుందని ఏ విద్యార్థి అనుకోవద్దని అధికారులు, ఉపాధ్యాయులు చెప్తున్నారు.;
తెలంగాణ ఇంటర్ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఇందులో 71.37శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. కాగా ఈ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో క్షణికావేశంలోనే, భయంతోనో, ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు ఉన్నారు. ఫలితాలు వచ్చిన 24 గంటల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలతో ఆయా కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అశ్విత అనే విద్యార్థిని పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని తీవ్ర మనస్తాపం చెందింది. ఏం చేయాలో అర్థంకాక చివరికి ఆత్మహత్య చేసుకుంది.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం గ్రామానికి చెందిన ఓ విద్యార్థి స్థానిక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ) ప్రథమ సంవత్సరం చదివాడు. పరీక్షలో ఫెయిల్ కావడంతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
హైదరాబాద్ మోతీనగర్ సమీపంలోని అవంతినగర్‌కు చెందిన విద్యార్థి బల్కంపేటలోని ఓ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్నాడు. పరీక్షలో ఫెయిల్ కావడంతో ఆవేదనకు గురై.. సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నాగోలు తట్టిఅన్నారం వైఎస్ఆర్ కాలనీకి చెందిన విద్యార్థిని ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం పరీక్షలు రాసింది. ఒక సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 2లోని ఇందిరా నగర్‌లో నివాసం ఉంటున్న సుమతి, రామకృష్ణల కూతురు నిష్ఠ స్థానిక అభ్యాస జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. నిష్ఠ కెమిస్ట్రీలో ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లికి చెందిన విద్యార్థిని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ చదివింది. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో తాను అనుకున్న స్థాయిలో మార్కులు రాలేదని ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ మరణాలు సంభవించడంతో అధికారులు కూడా అలెర్ట్ అవుతున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయితే జీవితం అక్కడే ఆగిపోతుందని ఏ విద్యార్థి అనుకోవద్దని చెప్తున్నారు. అదే విధంగా తల్లిదండ్రులు కూడా ఈ సమయంలో తమ పిల్లలను కంటికి రెప్పల్లా కాపాడుకోవాలని, పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు వారిపై కోపగించుకోవాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరూ మనస్థాపంతో కుంగిపోవాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్తున్నారు.