శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ ఫిబ్రవరి 22వతేదీన కూలిపోయి 8 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ ఇన్‌లెట్ సొరంగంలో 14వ కిలోమీటరు వద్ద పైకప్పు కూలిన సమయంలో 40 మంది కార్మికులు పనిచేస్తుండగా 32 మంది తప్పించుకొని బయటపడ్డారు. టన్నెల్ కూలినపుడు లోపల పనిచేస్తున్న 32 మంది కార్మికులు పరుగులు పెట్టి ప్రాణాలు కాపాడుకున్నారు.
టన్నెల్ లోపల చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన 8 మంది కార్మికుల్లో టన్నెల్ బోర్ మెషీన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని ఒక్కటే సహాయ బృందాలు వెలికితీశాయి. టన్నెల్ లోపల జాడ లేకుండా పోయిన మనోజ్‌కుమార్, శ్రీనివాస్, సందీప్‌సాహు , జక్తాజెస్, సంతోష్‌సాహు, అనూజ్ సాహు , సన్నీ సింగ్ ల మృతదేహాల కోసం 12 విభాగాలకు చెందిన నిపుణులు, సిబ్బంది గాలిస్తున్నా, వారి జాడ లభించలేదు.(SLBC Missing Workers) సొరంగం పై కప్పులో 10 మీటర్ల భాగం కూలి పెద్ద రంధ్రం ఏర్పడింది.
12 విభాగాల ఆధ్వర్యంలో సహాయ పనులు
ఇండియన్ ఆర్మీ, బార్డర్ రోడ్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ,ఇండియన్ నేవీకి చెందిన మెరైన్ కమాండోలు, రోబోలు,హైడ్రా, ఎన్జీఆర్ఐ,దక్షిణ మధ్య రైల్వే అధికారులు, ర్యాట్ హోల్ మైనర్స్,అన్వి రోబోటిక్స్ ,కడావర్ డాగ్ స్క్వాడ్,జేపి,కంపెనీ బృందాలు అయిదు షిఫ్టుల్లో నిరంతరం సహాయ పనులు చేస్తున్నా గల్లంతైన కార్మికుల మృతదేహాల జాడ మాత్రం కనిపించలేదు.
సహాయ పనులు ఎక్కడి దాకా జరిగాయంటే...
టన్నెల్ (SLBC Tunnel)లోపల శిథిలాలను నిషేధిత జోన్ వరకు జరిగాయి. టన్నెల్ బోరింగ్ మెషీన్ ను మూడు స్థాయిల్లో కత్తిరించారు. టీబీఎం శిథిలాలను కూడా తొలగించారు. డి 2 పాయింటు వదకు శిథిలాలను తొలగించినా మృతదేహాలు కనిపించలేదని పేరు చెప్పేందుకు ఇష్ఠపడని ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన ఓ అధికారి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. టన్నెల్ కూలిన ప్రదేశంలో టీబీఎం వెనుక గుహలోపల ఉన్న శిథిలాల్లో మృతదేహాలు ఉండవచ్చని ఆ ఆధికారి అనుమానం వ్యక్తం చేశారు. సొరంగం కూలిన ప్రాంతంలో గుహలాగా ఏర్పడింది. టన్నెల్ కూలిన ప్రదేశంలో భూమి వదులుగా ఉందని మరోసారి కూలిపోయే ప్రమాదముందని ఎన్జీఆర్ఐ, జీఎస్ఐ అధికారులు హెచ్చరించారు.దీంతో గుహ ప్రాంతాన్ని నిషేధిత జోన్ గా ప్రకటించారు. టన్నెల్ కూలిన ప్రాంతంలో టీబీఎంను వెనక్కినెట్టి ఏర్పడిన గుహలోపల మృతదేహాలు కూరుకుపోయి ఉండవచ్చని సహాయ పనులు చేస్తున్న ఆర్మీ అధికారులు చెబుతున్నారు.
సహాయక చర్యలపై అధికారుల సమీక్షలు
ఆర్మీ జనరల్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ అజయ్ మిశ్రా, డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ లు ప్రతి రోజు సహాయ పనుల పురోగతిపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నా, మృతదేహాలను ఇంకా గుర్తించలేక పోయారు. ఆర్మీ ఉన్నతాధికారులు, సహాయక బృందాల ఉన్నతాధికారులతో, టన్నెల్ లోపల ప్రమాద ప్రదేశంలో జరుగుతున్న సహాయక చర్యలపై, తిసుకోవాల్సిన భద్రత ప్రమాణాలపై చర్చించారు.
నిరంతరాయంగా సహాయచర్యలు
టన్నెల్ లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కొనసాగుతున్న సహాయక చర్యల్లో భాగంగా టన్నెల్ బోరింగ్ మెషీన్ (TBM) భాగాలను కత్తిరించారు. టన్నెల్ భాగాలను తొలగించడంతోపాటు, టన్నెల్‌లో చేరిన నీటిని బయటకు పంపిస్తున్నారు. టీబీఎం లోని కీలక భాగాలను ప్రత్యేకంగా కత్తిరించి, వాటిని తొలగించేందుకు అధునాతన యంత్రాలు ఉపయోగించారు.టన్నెల్‌లో నిల్వ ఉన్న నీటిని వాటర్ జెట్ ద్వారా బురదను తొలగించే ప్రక్రియ, ఎస్కా వేటర్ల ద్వారా మట్టిని కన్వేయర్ బెల్ట్ పై తరలించే ప్రక్రియలు కొనసాగుతున్నాయి. సహాయక బృందాలకు అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లను నిరంతరాయంగా సరఫరా చేస్తున్నారు. అల్ట్రా థర్మల్ కట్టర్లతో టన్నెల్ బోరింగ్ మెషీన్ భాగాలను తొలగించారు. సహాయక చర్యలపై ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తూ, కొనసాగించవలసిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ సహాయక చర్యల వేగాన్ని పెంచారు.
భద్రతా ప్రమాణాల మేర సహాయ చర్యలు
టన్నెల్ లోపల పరిస్థితులను అనుసరించి భద్రతా ప్రమాణాలను పాటిస్తూ సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. టన్నెల్ ప్రమాద ప్రదేశంలో సహాయక పనులకు ఆటంకంగా ఉన్న ఊట నీటిని అధిక సామర్థ్యం గల పంపుల ద్వారా బయటకు తరలిస్తున్నారు.జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారుల సూచనలను పాటిస్తూ ప్రమాద ప్రదేశంలో సహాయక చర్యలు చేపడుతున్న బృందాలను నిరంతరం అప్రమత్తంగా ఉంచారు. టన్నెల్ లోపల ఉన్న పెద్ద పెద్ద బండ రాళ్లను ఎస్కవేటర్ ద్వారా తొలగిస్తూ లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు పంపే ప్రక్రియ నిరంతరం కొనసాగిస్తున్నారు.
అయిదు షిఫ్టులుగా సహాయ పనులు
టన్నెల్ లోపల మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక చర్యలు ప్రతి రోజు 5 షిఫ్టులుగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు, 11 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 7 గంటలకు, రాత్రి 11 గంటల షిఫ్టుల్లో ప్రత్యేక సహాయక బృందాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయని డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. టన్నెల్ లోపల జరిగే సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.31రోజులుగా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రాత్రి పగలు తేడా లేకుండా 5 షిఫ్టులుగా పనిచేస్తూ, ప్రమాద ప్రదేశంలో ఉన్న మట్టిని, స్టీల్, బండరాళ్లను తొలగిస్తూ సహాయక చర్యల్లో పాల్గొంటున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ సంస్థల సహాయక బృందాలను తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా జనరల్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ అజయ్ మిశ్రా అభినందించారు.
టన్నెల్ లోపల సహాయ పనులకు రూ.5కోట్లు
ఎస్ఎల్ బీసీ టన్నెల్ లోపల సహాయ పనులు కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5కోట్లను మంజూరు చేసింది. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరు చేసిన అభ్యర్థన మేరకు ఆర్థిక విభాగం ఈ నిధులను విడుదల చేసింది. ఈ నిధులతో సహాయ పనులను ముమ్మరం చేయాలని కలెక్టరును సర్కారు ఆదేశించింది.
ఆర్మీ అధికారులకు మంత్రి కృతజ్ఞతలు
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద తర్వాత సహాయ, రెస్క్యూ కార్యకలాపాల్లో మద్దతు ఇస్తున్న తెలంగాణ అండ్ ఆంధ్ర సబ్ ఏరియా ఆర్మీ కమాండర్ జనరల్ మిశ్రా, ఇతర ఆర్మీ అధికారులు,జవాన్లకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. భారత సాయుధ దళాల్లో సభ్యుడిగా ఉండటం తనకు గర్వకారణమని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి భారత సైన్యం కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని మెమోంటో అందజేశారు.
నెలరోజులైనా సహాయ చర్యల్లో పురోగతి ఏది : మాజీ మంత్రి టి హరీష్ రావు
ఎస్ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలి నేటికి సరిగ్గా నెలరోజులు గడచినా మంత్రులు చెప్పిన డెడ్ లైన్లు, క్యాలెండరులో డేట్లు మారినాయి తప్ప, సహాయక చర్యలో చెప్పుకోదగ్గ పురోగతి లేనే లేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఈ విషాద ఘటనలో చిక్కుకున్నవారు ఏమయ్యారో ఇప్పటికీ తెలియని పరిస్థితి నెలకొందని ఆయన చెప్పారు. ఒకరి మృతదేహం వెలికి తీయడం తప్ప, మిగతా ఏడుగురి జాడ కనుగొనడంలో ఎలాంటి పురోగతి లేకపోవడం శోచనీయమని హరీష్ రావు పేర్కొన్నారు.
ఎందుకింత జాప్యం?
పొట్టకూటి కోసం వచ్చి ప్రమాదంలో చిక్కుకున్న వారి గురించి ఆలోచిస్తే గుండె తరుక్కుపోతుందని, వారి కుటుంబాల ఆవేదన వర్ణనాతీతమని హరీష్ రావు ఆవేదనగా చెప్పారు.సహాయ పనుల్లో ఎందుకింత జాప్యం జరుగుతున్నదో కారణాలు అంతు పట్టడం లేదన్నారు. సొరంగం కూలడం వెనుక, ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించి ఇప్పటికీ బయటకి తీసుకు రాకపోవడం వెనుక ఈ ప్రభుత్వం ఘోర వైఫల్యం ఉందని హరీష్ రావు ఆరోపించారు.
హెచ్చరికలు పట్టించుకోలేదు...
భూ భౌతిక శాస్త్రవేత్తల హెచ్చరికలు పెడచెవిన పెట్టి, మొండిగా టన్నెల్ పనులు ప్రారంభించారని,ప్రమాదాన్ని ముందుగా గుర్తించి కూలీలు అప్రమత్తం చేసినా, పట్టించుకోలేదని హరీష్ రావు ఆరోపించారు.రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న తొందరపాటు నిర్ణయం 8 నిండు ప్రాణాలను మృత్యుకుహరంలోకి నెట్టిందని ఆయన చెప్పారు.
సీఎం బాధ్యత వహించాలి...
జరిగిన ప్రమాదానికి, బాధితులు అనుభవిస్తున్న క్షోభకు, వారి కుటుంబాలు పడుతున్న తీవ్ర వేదనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ి బాధ్యత వహించాలి. తమ వాళ్లు ప్రాణాలతో ఉన్నారో లేరో తెలియక, వారి కుటుంబాలన్నీ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాయని, మా వాళ్లు బతికి ఉన్నారా.. మరణించారా? రాష్ట్ర ప్రభుత్వమే తేల్చాలని వారంతా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారని హరీష్ రావు చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించి, గల్లంతైన వారి జాడ కనుక్కోవాలని,నెల రోజులుగా ఎస్ ఎల్ బి సి సొరంగం వద్ద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై పూర్తి వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు కోరారు.