ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం,హైడ్రా కార్యాచరణ వేగిరం

ప్రజల సమస్యల పరిష్కారానికే హైడ్రా ప్రాధాన్యం ఇస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఉపదేశంతో రూటు మార్చిన హైడ్రా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల ప్రశంసలు అందుకుంటోంది.;

Update: 2025-05-15 09:13 GMT
కాలనీలకు దారి చూపిన హైడ్రాఅధికారిని సన్మానిస్తున్న కాలనీ వాసులు

హైదరాబాద్ భవిష్యత్తు కోసం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పనిచేయాలని సాక్షాత్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల హైడ్రా పోలీసు స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కోరారు. క‌బ్జా చేసిన వారు ధ‌నికులు, ఆక్ర‌మ‌ణ‌దారుల ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించి, పేద‌ల ప‌ట్ల సానుభూతితో ప‌ని చేయాల‌ని హైడ్రాకు ముఖ్య‌మంత్రి సూచించారు. సీఎం ఉపదేశంతో హైడ్రా ప్రజావాణి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తోంది. ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ వారి నుంచి ప్రశంసలు అందుకుంటోంది.


చెరువుల కబ్జాలతో వరద ముప్పు
కుతుబ్ షాహీల షాన్ దార్ నగరమైన హైదరాబాద్ లో దూరదృష్టి, శాస్త్రీయ దృక్పథంతో నీటివనరులను పరిరక్షించడమే కాకుండా చెరువులు, వాగుల నిర్మాణంతో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఉత్తమమైన డ్రైనేజీ వ్యవస్థకకు నాందీ పలికారు. నిజాంల దూరదృష్టితో నాడు నిర్మించిన చెరువులు నేడు రాజకీయ నాయకుల నిర్లక్ష్యం, ధనవంతుల అత్యాశకు కబ్జాల పాలయ్యాయి. శతాబ్దాలుగా వరద ముప్పు నుంచి కాపు కాచిన డ్రైనేజీ వ్యవస్థ ఆక్రమణలతో వర్షం కురిస్తే చాలు లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. చెరువులు, నాలాల భూముల కబ్జాలకు పుల్ స్టాప్ పెట్టేందుకే తము హైడ్రా ను ఏర్పాటు చేశామని సీఎం ప్రకటించారు. చెరువులను ఆక్రమించినవారిని చెరసాలకు పంపిందుకు హైడ్రా పోలీసుస్టేషన్ ను సీఎం ఇటీవల ప్రారంభించారు. చెరువుల కబ్జాల నుంచి విముక్తి చేసి కబ్జాదారులను చెరసాల లోకి నెడతామని హైడ్రా ప్రకటించింది. ప్రజా శ్రేయస్సు, ప్రగతి కోసం హైడ్రా అంటూ హైడ్రా ఇటీవల ప్రచార వీడియో ను విడుదల చేసింది.



హైడ్రా అంటే వెన్నులో వణుకు పుట్టాలి

హైడ్రా పేరు చెప్ప‌గానే క‌బ్జాదారులకు వెన్నులో వ‌ణుకు పుట్టాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. చెరువులు, నాలాలు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాలు అనే తేడా లేకుండా ఖాళీ జాగా క‌నిపిస్తే క‌బ్జా చేసేద్దామ‌నే ఆలోచ‌న చేసిన వారికి హైడ్రా ఉంద‌నే భ‌యం ఉండాల‌ని ఆయన పేర్కొన్నారు. హైడ్రాకు డీఆర్ ఎఫ్ ట్ర‌క్కులు 21, స్కార్పియోలు 55, ద్విచ‌క్ర వాహ‌నాలు 37 , ఇన్నోవాలు 4, మినీ బ‌స్సులు, ట్రూప్ కేరియ‌ర్స్ ఐదింటిని ముఖ్య‌మంత్రి ప్రారంభించారు.పేద‌ల అక్ర‌మ‌ణ‌లు తొల‌గించాల్సి వ‌స్తే వారికి ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేయాల‌న్నారు.



 కబ్జాదారుల కబంధ హస్తాల్లో 491 చెరువులు

హైదరాబాద్ న‌గ‌రంలో 940 చెరువులు ఉండ‌గా..వాటిలో 491 చెరువులు క‌బ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి.ఎన్నో ఏళ్లుగా అవ‌స్థ‌లు ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కు హైడ్రా అండ‌గా ఉందని కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు.ద‌ళిత‌వాడ‌కు దారి చూపినా,కాల‌నీల మ‌ధ్య అడ్డుగోడ‌లు తొల‌గించినా, సామాన్యుల ప‌క్ష‌మే అని అనేక సంఘ‌ట‌ల‌ను రుజువు చేస్తున్నాయ‌న్నారు.ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్రస్థాయి పరిశీలన చేసి చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం హైడ్రా కమిషనర్ రంగారెడ్డి జిల్లా నుంచి పర్యటన మొదలు పెట్టీ రాత్రి 7.30 గంటలకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాతో పర్యటన ముగించారు.



 కబ్జాదారులపై క్రిమినల్ కేసులు

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కొహెడ గ్రామంలోని రాజాజీ నగర పేరిట వేసిన లే ఔట్ ను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.17 ఎకరాల విస్తీర్ణంలో 190 వరకు ప్లాట్లతో ఉన్న లేఅవుట్ లోని పార్కులు, రహదారులు కలిపేసి సమ్మిరెడ్డి బాల్ రెడ్డి తప్పుడు ధ్రువపత్రాలతో తమ ప్లాట్లను కబ్జా చేశారంటూ అక్కడి ప్లాట్ యజమానులు గతంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.ఆక్రమణలను, రహదారులకు అడ్డంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా తొలగించింది.దీంతో ప్లాట్ యజమానులు ఊపిరి పీల్చుకున్నా రు.రాజాజీ నగర లేఔట్ ప్రకారం రహదారులు, పార్కులను కబ్జాల చెర నుంచి విడిపిస్తామని.ఆక్రమణదారులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ఏవీ రంగనాథ్ చెప్పారు. ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.



 ఆక్రమణలపై ఫిర్యాదులెన్నో...

కోహెడ విలేజ్ లోని కొత్త చెరువును కమిషనర్ సందర్శించారు.చెరువులో తమ స్థలాలు మునిగిపోయాయనే పిర్యాదుల విషయమై క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని డాలర్ హిల్స్ కాలనీని హైడ్రా కమిషనర్ సందర్శించారు. ఇక్కడ పార్కు స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారనే ఫిర్యాదును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు ఎలా చేపట్టారంటూ సదరు నిర్మాణ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు.గుట్టల బేగంపేటలో రోడ్డు ను ఆక్రమించి నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని పరిశీలించారు.నిర్మాణ అనుమతులు పరిశీలించి రహదారి ఆక్రమణ లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.



 క్షేత్రస్థాయిలో పరిశీలన

కూకట్ పల్లి లోని డైమండ్ హిల్స్ లే ఔట్ ను హైడ్రా అధికారులు పరిశీలించారు.కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చినా ఫలితం లేకుండా పోయింది అని ప్లాట్ యజమానులు కమిషనర్ ముందు వాపోయారు. మొత్తం 9 ఎకరాల్లో 70 ప్లాట్లతో లేఔట్ ఉండగా అక్కడ రోడ్స్, పార్కుల ఆనవాళ్లు లేకుండా కబ్జాదారుడు ఆక్రమించేశాడని వాపోయారు.దుండిగల్ మండలం బౌరంపేట విలేజ్ పరిధిలో జీపీఆర్ లేఔట్ ను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. సర్వే నెంబర్ 345 లో 20 ఎకరాల పరిధిలో 200 ప్లాట్లతో లేఔట్ వేయగా.. ఇప్పుడు యాదగిరి అనే వ్యక్తి ఈ భూమి తనదంటూ రోడ్లు వేయనివ్వడం లేదని ప్లాట్ యజమానులు ఫిర్యాదు మేరకు కమిషనర్ పర్యటించారు.

హైడ్రాకు అభినంద‌న‌లు
ఏడు కాల‌నీల‌కు దారి చూపిన ఘ‌న‌త హైడ్రాద‌ని ఆయా కాల‌నీవాసులు అభినందించారు. ప్ర‌ధాన ర‌హ‌దారి మూత ప‌డ‌డంతో అంబులెన్సులు, స్కూల్ బ‌స్సులు రాలేని ప‌రిస్థితుల్లో 20 ఏళ్లుగా అవ‌స్థ‌లు ప‌డ్డామ‌ని... ఇప్పుడు హైడ్రా చ‌ర్య‌ల‌తో ఉప‌శ‌మ‌నం ల‌భించింద‌ని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వెంట‌నే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించార‌ని ప్ర‌జావాణి కార్య‌క్ర‌మంలో ఉన్న హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ను అభినందించారు. రంగారెడ్డి జిల్లా తుర్క‌యాంజ‌ల్‌ మున్సిపాలిటీ ఇంజాపూర్‌ గ్రామంలోని శ్రీ రంగాపురం కాల‌నీలో 45 అడుగుల ప్ర‌ధాన ర‌హ‌దారిపై అడ్డంగా క‌ట్టిన ప్ర‌హ‌రీని హైడ్రా ఈ నెల 19న తొల‌గించిన విష‌యం విధిత‌మే. యాపిల్ ఎవెన్యూ, శ్రీ‌రంగాపురం, సాయినాథ్‌కాల‌నీ, సుంద‌ర‌య్య కాల‌నీ, శ్రీ శ్రీ‌నివాస కాల‌నీ, ఇందిర‌మ్మ కాల‌నీ 1, ఇందిర‌మ్మ కాల‌నీ 2 నివాసితులు హైడ్రా క‌మిష‌న‌ర్‌ను క‌ల‌సిన వారిలో ఉన్నారు.

దారిచూపిన హైడ్రా..
ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేసిన వెంట‌నే స్పందించి స‌మ‌స్య ప‌రిష్క‌రించిన‌ హైడ్రా అధికారిని అదే ప్ర‌జావాణిలో ప్ర‌జ‌లు స‌త్క‌రించారు. మిఠాయి తినిపించి, క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ చేతుల మీదుగా ఇన్‌స్పెక్ట‌ర్ తిరుమ‌లేష్‌ను స‌న్మానించారు.రాజేంద్ర‌న‌గ‌ర్ మండ‌లం కాటేదాన్ ద‌గ్గ‌ర మ‌ధుబ‌న్ కాల‌నీకి అనుకుని ఉన్న ఇందిరాగాంధీ కో ఆప‌రేటివ్ హౌసింగ్ సొసైటీలో మొత్తం 800ల ప్లాట్లున్నాయి. కాటేదాన్ నుంచి శ్రీ‌రాం కాల‌నీకి వెళ్లే ప్ర‌ధాన 60 అడుగుల ర‌హ‌దారిని క‌లిపే 20 అడుగుల ర‌హ‌దారికి అడ్డంగా నిర్మించిన గోడ‌ల‌ను ఈ నెల 6వ తేదీన హైడ్రా తొల‌గించింది. దీంతో ఇందిరాగాంధీ కోప‌రేటివ్ హౌసింగ్ సొసైటీతో పాటు శ్రీ‌రాంన‌గ‌ర్ కాల‌నీ వాళ్ల‌కు కూడా ద‌గ్గ‌ర దారి దొరికింద‌ని అక్క‌డి నివాసితులు సంతోషం వ్య‌క్తం చేశారు.

పార్కుల‌ను ప్లాట్లుగా మార్చేసి అమ్మ‌కాలు
పార్కులు, ర‌హ‌దారులు, ప్ర‌జావ‌స‌రాల‌కోసం ఉద్దేశించిన స్థ‌లాల‌ను కాపాడాల్సిన కాల‌నీ సంక్షేమ సంఘాల ప్ర‌తినిధులే వాటిని చెర‌బ‌డుతున్నారు.ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను వ్యాపారుల‌కు దారాద‌త్తం చేయ‌డం లేదా ప్లాట్లుగా ప‌త్రాలు సృష్టించి అమ్మేయ‌డం చేస్తున్నారు. బ‌స్తీ, కాల‌నీ సంక్షేమ సంఘాల నాయ‌కులుగా చెలామ‌ణి అవుతూ ఇందుకు తెగ‌బ‌డుతున్నార‌ని ప‌లువురు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. నిజాంపేట మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ప‌రిధిలో స‌ర్వే నంబ‌రు 181, 183 ప‌రిధిలోని సాయిల‌క్ష్మి లేఔట్‌లోని 1800ల గ‌జాల పార్కు స్థ‌లం క‌బ్జా అయ్యిందంటూ ప్ర‌జావాణిలో ఫిర్యాదు అందింది. కార్పొరేష‌న్ ప‌రిదిలోని స‌ర్వే నంబ‌రు 153, 154, 155లో కూడా దాదాపు 5 ఎక‌రాల వ‌ర‌కూ ఉన్న పార్కుస్థ‌లాలు, ర‌హ‌దారులు క‌నిపించ‌డంలేద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2.3 ఎక‌రాల వీఎన్ ఆర్ పార్కు స్థ‌లాన్ని కూడా ఆక్ర‌మించుకున్నార‌ని ఫిర్యాదు చేశారు. చెరువులు, ప్ర‌భుత్వ స్థ‌లాలే కాదు.. ఆఖ‌ర‌కు కాల‌నీ లే ఔట్ల‌లోని స్థ‌లాల‌ను కూడా వ‌ద‌ల‌డం లేదంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.



Tags:    

Similar News