ఎమ్మెల్యేల పాకెట్ మనీలాగా ‘స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్’

తెలంగాణలో స్పెష‌ల్ డెవ‌ల‌ప్‌మెంటు ఫండ్‌ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయి.టెండర్లు పిలవకుండా నామినేషన్ పై అభివృద్ధి పనులు అప్పగించారు.;

Update: 2025-07-23 12:27 GMT
తెలంగాణ సచివాలయం

రాష్ట్ర ప్ర‌భుత్వం అభివృద్ధి ప‌నుల‌ కోసం స్పెష‌ల్ డెవ‌ల‌ప్‌మెంటు ఫండ్‌ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయి. ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి రూ.10 కోట్ల చొప్పున మొత్తం రూ.1190 కోట్లు మంజూరు చేస్తూ గత ఏడాది జనవరి 30వతేదీన జీఓ ఆర్టీ నంబరు 22 పేరిట అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం జారీ చేశారు.

- తెలంగాణ సర్కారు జి.ఓ. నంబరు 299 తేదీ 25-11-2024 ద్వారా జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు నిధులు విడుద‌ల చేస్తూ నిధుల వినియోగంపై మార్గ‌ద‌ర్శ‌కాలు ఇచ్చారు. ఈ మార్గదర్శకాల ప్ర‌కార‌ం ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి కేటాయించిన రూ.10 కోట్ల‌లో, 2 కోట్లు ప్రభుత్వ పాఠ‌శాల‌ల అవ‌స‌రాల కోసం,ఒక కోటి రూపాయలను తాగునీటి ప‌నుల‌కు రూ.50 ల‌క్ష‌లు క‌లెక్ట‌రేట్, ఇత‌ర ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ రిపేర్ల‌కు ఇక మిగిలిన రూ.6.5.కోట్లు ఇత‌ర అభివృద్ధి ప‌నుల‌కు కేటాయించాలని, ఈ పనులకు నిధులను 2023-24 సంవ‌త్స‌రంలోనే వినియోగించాల‌ని ఆదేశాలు జారీ చేశారు.
- సంబంధిత శాస‌న‌స‌భ్యుడు అవ‌స‌ర‌మున్న అభివృద్ధి ప‌నుల జాబితా ఇవ్వ‌గా జిల్లా ఇన్ ఛార్జి మంత్రి ఆయా పనులకు నిధులను మంజూరు చేస్తారు.మంత్రి నిధుల మంజూరు తర్వాత జిల్లా క‌లెక్ట‌ర్ సంబంధిత ఇంజ‌నీరింగ్ విభాగాల‌తో ప‌ని చేయిస్తారు.స్పెష‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ ప‌నుల‌ కోసం విడుద‌ల చేసిన రూ.1190 కోట్లు మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ఖర్చు చేయడం లేదని, దీంతో ప్ర‌జాధ‌నం వృధా అవుతుందని తాజాగా వెల్లడైంది.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కం నివాసం కోసం రూ.114.55 లక్షలు
దేవ‌ర‌కొండ శాస‌న‌స‌భ్యుడు బాలు నాయక్ నెనావత్ త‌న నివాసంలో రిపేరు, రినోవేష‌న్‌, ఫ‌ర్నిచ‌ర్, ఏసీలు, టీవీల కొనుగోలు కోసం 1.14 కోట్లతో ప్రతిపాదనలు పంపించగా జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి మంజూరు చేశారు.ఎలాంటి అభివృద్ధి లేని దుబారా ఖ‌ర్చు ప‌నుల‌కు నల్గొండ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిధులను మంజూరు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కం నివాసం మరమ్మతులకు రూ.50లక్షలు మంజూరు చేశారు.

ఫర్నిచర్ కొనుగోలుకు అభివృద్ధి నిధులు
దేవరకొండలో ఎమ్మెల్యే బాలు నాయక్ నెనావత్ ఇంటికి లిఫ్టు, ఇతర పరికరాల కొనుగోలు కోసం రూ.23లక్షలు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, నివాస గృహంలో 14 సీటర్ల ఎల్ షేప్ సోఫా కొనుగోలు కోసం రూ.4.80 లక్షలు, ఎమ్మెల్యే కార్యాలయంలో నీల్ కమల్ కుర్చీలు, టేబుళ్లు, టీవీ కోసం రూ. 3.60 లక్షలు, నివాసగృహంలో మూడు సీటర్ల సోఫా, రెండు సింగిల్ కుర్చీల కొనుగోలు కోసం రూ.4.80 లక్షలు ఖర్చు చేశారు. ఇవి కాకుండా ఎమ్మెల్యే ఆఫీసు ఫర్నిచర్ పేరిట మరో రూ.4.05 లక్షలు, ఎమ్మెల్యే ఇంటికి రూఫ్ టైల్స్, కింద కొత్త టైల్స్ కోసం రూ.4.30 లక్షలు కేటాయించారు.

ఏసీల ఏర్పాటుకు రూ.5 లక్షలా?
దేవ‌ర‌కొండ శాస‌న‌స‌భ్యుడు బాలు నాయక్ నెనావత్ ఇంటికి ఏసీల ఏర్పాటు కోసం రూ.5లక్షలు, రూఫ్ షెడ్ నిర్మాణానికి రూ.3.50 లక్షలు, సోనీ బ్రేవియా 85 అంగుళాల 3 అల్ట్రా హెచ్ డీ టీవీల కోసం రూ.3.40 లక్షలు, ఎమ్మెల్యే ఇంటికి వెయ్యిలీటర్ల సామర్ధ్యం కల ఆర్వో వాటర్ ప్లాంట్ కోసం రూ.3.30 లక్షలు ఖర్చు చేశారు. ఈ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయని నామినేషన్ పై ఇచ్చిన పనులు, నిధుల కేటాయింపు చూస్తే విదితమవుతుంది.

నామినేషన్ పై పనులు
పంచాయతీరాజ్ డెవలప్ మెంట్ రూల్స్ ప్ర‌కార‌ం ఏ ప‌ని అయినా రూ.5 ల‌క్ష‌ల‌కు మించితే, ఆ ప‌నికి టెండ‌ర్లు పిలిచి ప‌నులు చేయించాలి. కానీ పెద్ద ప‌నిని కూడా ముక్క‌లుగా చేసి నామినేష‌న్ ప‌ద్ధతిలో త‌మ‌కు కావాల్సిన వారికి అప్ప‌చెపుతున్నారు.పంచాయతీరాజ్ శాఖ ఇంజ‌నీర్లు నామినేష‌న్ ప‌ద్ధ‌తితో ప‌నులు చేయించ‌డంతో నాణ్య‌త లోపించి ప్ర‌జాధ‌నం వృధా అవుతుంది.

ఎమ్మెల్యేలను కాదని కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జీలతో అభివృద్ధి ప్రతిపాదనలు
సాధార‌ణంగా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో సంబంధిత శాస‌న‌స‌భ్యుడు ప‌నుల‌ను ప్రతిపాదించాలి. కానీ క‌రీంన‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ శాస‌న‌స‌భ్యుడు గంగుల కమలాకర్ ను కాద‌ని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్ ఛార్జ్ పరమళ్లా శ్రీనివాస్ రూ.979.96 లక్షలతో ఇచ్చిన అభివృద్ధి ప్రతిపాదనలకు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధులు మంజూరు చేశారు.

ప్రాధాన్య‌ం లేని ప‌నుల‌కు నిధుల మంజూరు
క‌రీంన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో చాలా గ్రామాల్లోని పాఠ‌శాల‌ల్లో, మ‌రుగుదొడ్లు, మంచినీరు , డ్రైనేజీ వంటి సౌకర్యాల అవ‌స‌రం ఎంతైనా ఉంది. వాటిని ప‌క్క‌న పెట్టి గ్రామాల్లో 50 హైమాస్టులైట్ల‌కు రూ.60 ల‌క్ష‌ల‌ను మంజూరు చేశారు. అలాగే 25 గ్రామాల్లో ఓపెన్ జిమ్ కు రూ.1.25 కోట్ల ను మంజూరు చేశారు. ఈ ప‌నుల కోసం ఎలాంటి టెండ‌ర్లు పిలవ‌లేదు. అన్నీ పనులు కూడా అధికార కాంగ్రెస్ నేతల జేబులు నింపేందుకు నామినేష‌న్ ప‌ద్ధ‌తిలో కావాల్సిన వారికి పనులు ఇచ్చారు.

హుజురాబాద్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిదే పెత్తనం
హుజూరాబాదు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో శాస‌న‌స‌భ్యుడు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కాద‌ని, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్ ఛార్జి రూ.698.22 లక్షలతో వొడితెల ప్రణవ్ ఇచ్చిన అభివృద్ధి ప్రతిపాదనలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధులు మంజూరు చేశారు.

అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన
అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.10కోట్లు చొప్పున స్పెష‌ల్ డెవ‌ల‌ప్‌మెంటు ఫండ్‌ నిధుల వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నవంబరు 25వతేదీన రూ.1190 కోట్లను విడుదల చేస్తూ జీఓ ఆర్టీ నంబరు 299 పేరిట మార్గదర్శకాలను రాష్ట్ర ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా రూపొందించారు. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించి అభివృద్ధి నిధులను ఇష్టారాజ్యంగా నామినేషన్లపై పనులు చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులను కాదని కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జీలకే ఆ నిధుల ప్రతిపాదనలు ఇచ్చే అవకాశం కల్పించారు. అభివృద్ధి కోసం కేటాయించిన నిధుల్లో దేవరకొండ ఎమ్మెల్యే రూ.114లక్షల రూపాయలను ఎమ్మెల్యే ఇల్లు కం క్యాంపు కార్యాలయం షోకులకు వాడుకున్నారు.

విజిలెన్స్ విచారణ జరపాలి

స్పెష‌ల్ డెవ‌ల‌ప్‌మెంటు ఫండ్‌ నిధుల వినియోగంలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నరెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి బుధవారం సీఎం ఎ రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖను బుధవారం సాయంత్రం పత్రికలకు విడుదల చేశారు. మంచి ఉద్ద్యేశంతో గ్రామాల అభివృద్ధి కోసం రూ. 1190 కోట్లు మంజూరు చేయ‌గా ఇందులో డ‌బ్బు దుర్వ‌ినియోగం జ‌రిగిందని ఫోరం పర్ గుడ్ గవర్నెన్స్ విచారణలో వెలుగుచూసింది.ఈ నిధుల వినియోగంలో జరిగిన అక్రమాల విష‌యంలో విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ ద్వారా విచార‌ణ జ‌రిపించాల‌ని,అభివృద్ధి ప‌నుల మంజూరు అధికారాన్ని జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు ఇవ్వాల‌ని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ అధ్యక్షులు పద్మనాభరెడ్డి ముఖ్య‌మంత్రిని కోరారు.



Tags:    

Similar News