సుప్రీం కోర్టు ‘బుల్డోజర్ షాక్’ హైడ్రా కు తగులుతుందా?

అనధికార నిర్మాణాలని, ఆక్రమణల పేరుతో ఇళ్ళు, భవనాలను కూల్చేయటం కూడా తీవ్రంగా ఆక్షేపణీయమన్నారు.

Update: 2024-09-03 04:28 GMT
Hydra commissioner

తొందరలో హైడ్రా జోరుకు స్పీడ్ బ్రేకులు పడకతప్పేట్లులేదు. క్రిమినల్ కేసుల్లో నిందితుల ఇళ్ళను బుల్డోజర్లతో కూల్చేయటంపై సుప్రింకోర్టులో జస్టిస్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వివిధ రాష్ట్రాల్లో ఇళ్ళ కూల్చివేతలకు సంబంధించి దాఖలైన పిటీషన్లను ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా గవాయ్ మాట్లాడుతు ఒక కేసులో నిందితుడు అయినంత మాత్రాన అతని ఇంటిని కూల్చేసే అధికారం ప్రభుత్వాలకు ఎవరిచ్చారు ? అంటు మండిపడ్డారు. నిందితుల ఇళ్ళను కూల్చే ఘటనలతో తెలంగాణాకు ఇప్పటికైతే ఎలాంటి సంబంధంలేదు. అయితే ఇదే సందర్భంలో గవాయ్ మరో కీలకమైన వ్యాఖ్య కూడా చేశారు. ఆ వ్యాఖ్య తెలంగాణాకు సరిగ్గా సరిపోతుంది.

ఇంతకీ గవాయ్ చేసిన వ్యాఖ్య ఏమిటంటే కొన్ని రాష్ట్రాల్లో అనధికార నిర్మాణాలని, ఆక్రమణల పేరుతో ఇళ్ళు, భవనాలను కూల్చేయటం కూడా తీవ్రంగా ఆక్షేపణీయమన్నారు. ఆక్రమణలు, అనధికార నిర్మాణాలను సుప్రింకోర్టు ఎట్టి పరిస్ధితుల్లోను సమర్ధించదని కూడా జస్టిస్ చెప్పారు. అయితే ఆక్రమణలని, అనధికార నిర్మాణాల పేరుతో కూల్చేయటం తగదన్నారు. కూల్చివేతలపై తొందరలోనే సుప్రింకోర్టు మార్గదర్శకాలను రూపొందిస్తుందన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఏదో పేరుతో కూల్చివేతలు జరగకుండా సుప్రింకోర్టు రూపొందించబోయే మార్గదర్శకాల ప్రకారమే జరగాలని కూడా గవాయ్ చెప్పారు. మున్సిపల్ నిబంధనలను లేదా స్ధానిక ప్రధకారసంస్ధలకు మాత్రమే కూల్చివేతల అధికారాలు ఉంటాయని అదికూడా సుప్రింకోర్టు ఆదేశాలకు లోబడి మాత్రమే అని గుర్తుచేశారు. చట్టానికి లోబడి జరగాల్సిన కూల్చివేతలు చట్టాన్ని ఉల్లంఘించి జరుగుతున్నాయని గవాయ్ అభిప్రాయపడ్డారు.

తాజాగా కూల్చివేతలపై జస్టిస్ గవాయ్ ఆందోళన, అభిప్రాయం చూసిన తర్వాత హైడ్రా చర్యలను కూడా దృష్టిలో పెట్టుకుని చేశారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా ఇచ్చిన నోటీసులను చాలెంజ్ చేస్తు చాలామంది యజమానులు కోర్టుల్లో కేసులు వేశారు. చెరువులు, కుంటలు, కాల్వలను ఆక్రమించి సుమారు పదిహేను, ఇరవై ఏళ్ళక్రితం చేసిన నిర్మాణాలను కూడా ఇపుడు హైడ్రా కూల్చేస్తామని నోటీసులు ఇస్తోంది. కొన్నింటిని కూల్చేసింది కూడా. అప్పట్లో చెరువులు, కుంటలు, కాల్వలను ఆక్రమించి నిర్మించిన వాటికి స్వయానా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మున్సిపాలిటీలు, పంచాయితీలే అనుమతులిచ్చాయి. అనుమతుల ప్రకారమే విద్యుత్ కనెక్షన్లు, మంచినీటి కనెక్షన్లు, ప్రాపర్టీట్యాక్సులను యజమానులు చెల్లిస్తున్నారు.

అనుమతులు ఇవ్వటంలోనే అక్రమాలు, అవినీతి జరిగిందని ఇపుడు హైడ్రా చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. చెరువులు, కుంటలు, కాల్వలను ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని తెలిసినా అప్పట్లో ప్రభుత్వ శాఖలే ఎందుకు అనుమతులు ఇచ్చినట్లు ? ఎందుకంటే ఆ బిల్డర్ల వెనుక రాజకీయనేతల ప్రమేయం ఉందికాబట్టే. రాజకీయనేతల ఒత్తిళ్ళ కారణంగానే అధికారులు కళ్ళుమూసుకుని తమదేంపోయిందని అనుమతులు మంజూరుచేసేశారు. కొన్ని నిర్మాణాలకైతే అసలు అనుమతులు లేవన్న విషయం ఇపుడు బయటపడుతోంది. ఇలాంటి వాటిపై జాబితా రెడీచేసుకుని హైడ్రా ఇపుడు విరుచుకుపడుతోంది. ఈ విషయాన్ని కూడా జస్టిస్ గవాయ్ దృష్టిలో పెట్టుకునే ఆక్రమణలు, అనధికారనిర్మాణాలని వ్యాఖ్యానించి ఉంటారు.

ఏదేమైనా తొందరలోనే కూల్చివేతలపై మార్గదర్శకాలను జారీచేస్తామన్నారు కాబట్టి అప్పటివరకు హైడ్రా జోరుకు బ్రేకులు పడక తప్పదనే అనిపిస్తోంది. ఆక్రమణలు, అనధికార నిర్మాణాలను అనుమతించకూడదు అనటంలో రెండో ఆలోచన అవసరంలేదు. ఆక్రమణలని తెలీక బిల్డర్ల మాయాజాలంలో ఇరుక్కుని అప్పోసొప్పో చేసి, బ్యాంకు లోన్లు తీసుకుని ఫ్లాట్లు కొనుక్కున్న మధ్యతరగతి జీవుల మాటేమిటి ? హైడ్రా దెబ్బకు ఫ్లాట్లు, ఇళ్ళుపోయి, బ్యాంకులోన్లు తీర్చలేక అవస్తలుపడుతున్న మధ్యతరగతి జనాల పరిస్ధితి గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పటికే ఆక్రమణలపేరుతో హైడ్రా దాదాపు 50 నిర్మాణాలను కూల్చేసింది. బడాబాబుల ఆధీనంలో ఉన్న ఫాంహౌసులు, అక్రమనిర్మాణాలను కూల్చేస్తే ఎవరికీ ఇబ్బందిలేదు. కాని మధ్యతరగతి జనాలుంటున్న ఫ్లాట్లు, ఇళ్ళను కూల్చేస్తేనే జనాలు ఇబ్బంది పడతారు. తొందరలోనే సుప్రింకోర్టు జారీచేయబోయే మార్గదర్శాల్లో ఏముంటుందో చూడాలి.

Tags:    

Similar News