గర్భాల్ని, శిశువులి అమ్మే అంగడి తెరిచిన లేడీ డాక్టర్

అంగడి పేరు సంతాన సాఫల్య కేంద్రం. ప్రతి కేసుకు డాక్టర్ రు. 20-30 లక్షలు వసూలు.;

Update: 2025-07-27 13:30 GMT
Srushti IVF Centre Dr Namratha

సృష్టి సరొగసి సెంటర్ ముసుగులో డాక్టర్ పచ్చిపాల నమ్రత పిల్లలను అమ్ముతున్న విషయాన్ని పోలీసులు బయటపెట్టారు. డాక్టర్ నమ్రత ఆధ్వర్యంలో నడిచిన సృష్టి ఫర్టిలిటి సెంటర్ లో జరిగిన మోసం బయటపడి డాక్టర్ తో పాటు మరికొందరిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. డాక్టర్ తో పాటు 10 మందిని సరొగసి, పిల్లల అమ్మకం రాకెట్లో పాలుపంచుకున్న కారణంగా గోపాలపురం పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడితే కోర్టు వీరందరికీ 14 రోజులు రిమాండు విధించింది. ఈనేపధ్యంలోనే నార్త్ జోన్, డిప్యుటి కమీషనర్ ఆఫ్ పోలీసు(డీసీపీ) ఎస్. రష్మి పెరుమాళ్(North Zone DCP Rashmi Perumal) మీడియాలో చెప్పిన విషయాలు సంచలనంగా మారుతున్నది. డాక్టర్ నమ్రత ఇల్లీగల్ బాగోతాలన్నింటినీ డీసీపీ మీడియాకు వివరించారు.

రాజస్ధాన్ కు చెందిన దంపతులు పిల్లలు పుట్టేందుకు వైద్యంకోసం యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటి సెంటర్(Srushti Fertility Centre) అధినేత డాక్టర్ నమ్రతను(Dr Namratha) 2024, ఆగష్టులో కలిశారు. ఫెర్టిలిటీ టెస్టులు చేసిన డాక్టర్ దంపతులతో మాట్లాడి ఐవీఎఫ్ ద్వారా కష్టమని సరొగసి పద్దతిలో బిడ్డకోసం ప్రయత్నించమని సూచించారు. అందుకు దంపతులు అంగీకరించిన తర్వాత వాళ్ళని డాక్టర్ విశాఖపట్నంలోని(Vizag) మరో సెంటర్ కు పంపించారు. దంపతుల్లో భర్త స్పెసిమన్ ను కలెక్ట్ చేసిన తర్వాత అద్దెగర్భం ధరించే మహిళ గర్భంలోకి పంపుతామని చెప్పారు. అందుకు చాలా ఖర్చవుతుందని చెప్పటంతో దంపతులు అందుకు అంగీకరించారు. సరొగసి(Surrogacy) పద్దతిలో బిడ్డను కనేందుకు మహిళను తమ క్లినిక్కే చూస్తుందని నమ్మబలికారు.

కొన్నిరోజుల తర్వాత సరొగసికి ఒక మహిళ అంగీకరించిందని అందుకు డబ్బులు అవసరం అవుతాయని డాక్టర్ చెప్పారు. డాక్టర్ చెప్పినట్లుగానే దంపతులు 35 లక్షల రూపాయలు చెల్లించారు. ఇందులో రు. 15 లక్షలు చెక్కు రూపంలోను, మిగిలిన డబ్బు బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేశారు. 2025, జూన్ మాసంలో సరొగసి మహిళ పిల్లాడికి జన్మ ఇచ్చిందని వైజాగ్ వెళ్ళి డెలవరీ ఛార్జెస్ తీసుకుని కొడుకును తీసుకోవచ్చని దంపతులకు డాక్టర్ నమ్రత చెప్పారు. దంపతులు వైజాగ్ లోని క్లినిక్కుకు వెళ్ళి డెలవరీ ఛార్జెస్ చెల్లించగానే అవసరమైన డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకుని పిల్లాడిని క్లినిక్ వాళ్ళు దంపతులకు అందించారు. దంపతులకే పిల్లాడు పుట్టినట్లుగా క్లినిక్ లోని డాక్టర్ పిల్లాడి బర్త్ సర్టిఫికేట్ ను కూడా జారీచేశారు.

కొంతకాలం తర్వాత పిల్లాడికి తరచూ అనారోగ్యం వస్తుంటే దంపతులకు అనుమానం వచ్చింది. డాక్టర్ నమ్రత దగ్గరకు తీసుకొస్తే పిల్లాడికి వైద్యం చేయటం తనపనికాదని చెప్పటంతో దంపతులు వేరే డాక్టర్ దగ్గరకు వెళ్ళారు. పిల్లాడికి కొత్త డాక్టర్ పరీక్షలు చేయించగా క్యాన్సర్ అని తేలింది. ఇదే విషయాన్ని డాక్టర్ దంపతులకు చెప్పగా వాళ్ళు షాక్ అయ్యారు. ఎందుకంటే దంపతుల్లో రెండువైపులా ఎవరికీ క్యాన్సర్ లేదని డాక్టర్ తో చెప్పారు. దాంతో అక్కడ డాక్టర్ కు జరిగిన విషయం మొత్తం చెప్పటంతో డీఎన్ఏ టెస్టు చేయించారు. దాంతో పిల్లాడి డీఎన్ఏ, దంపతుల్లో తండ్రి డీఎన్ఏ మ్యాచ్ కాలేదు.

అదే విషయాన్ని దంపతులకు డాక్టర్ చెప్పారు. ఈవిషయాన్ని దంపతులు డాక్టర్ నమ్రతతో మాట్లాడటానికి ప్రయత్నించినపుడు ఆమె ఇష్టపడకపోవటమే కాకుండా బెదిరింపులకు దిగటంతో దంపతులు వేరేదారిలేక పోలీసులను కలిశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు జరిపిన దర్యాప్తులో డాక్టర్ నమ్రత పెద్ద ఎత్తున అక్రమ సరొగసీలు చేస్తున్నట్లు బయపడింది. అలాగే సరొగసి ముసుగులో పిల్లలను కొనటంతో పాటు అమ్ముతున్నట్లు ఆధారాలు బయపడినట్లు డీసీపీ చెప్పారు. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటి సెంటర్ పేరుతో సికింద్రాబాద్, కొండాపూర్, కుకట్ పల్లి, విజయవాడ, విశాఖపట్నంలో అనధికారికంగా దందా నడుపుతున్నట్లు తేలింది.


1995లో ప్రాక్టీస్ మొదలుపెట్టిన నమ్రత 1998లోనే ఫెర్టిలిటి సెంటర్లతో పాటు సరొగసి పద్దతిని మొదలుపెట్టేశారు. డాక్టర్ ప్రాక్టీస్ మొత్తం ఇల్లీగలే అని డీసీపీ వివరించారు. ప్రతి కేసుకు డాక్టర్ రు. 20-30 లక్షలు వసూలు చేసినట్లు చెప్పారు. తమ క్లినిక్కులకు అబార్షన్ల కోసం వచ్చేయువతులతో మాట్లాడి డబ్బులు ఆశచూపించి పిల్లలను కనేట్లుగా ప్రోత్సహించేవారు. పిల్లలు కావాలని వచ్చే దంపతులకు ఐవీఎఫ్ ద్వారా గర్భం సాధ్యంకాదని నచ్చచెప్పి సరొగసి ద్వారా బిడ్డను కనచ్చని ఒప్పించేవారు. మెడికల్ విషయాలు తెలియవు కాబట్టి దంపతులు డాక్టర్ నమ్రత చెప్పినట్లే వినేవారు. అప్పుడు అబార్షన్ కోసం వచ్చిన యువతులతో మాట్లాడి డబ్బులు బేరం కుదుర్చుకునేవారు. దంపతులు తమ దగ్గరకు వచ్చిన సమయాన్ని సరొగసి పద్దతిలో యువతులు బిడ్డలను కనే సమయాన్ని డాక్టర్ నమ్రత లెక్కవేసి తమకు ఇబ్బందులు లేని యువతలతోనే డబ్బులకు బేరం కుదుర్చుకునే వారు. అదేపద్దతిలో ఇపుడు రాజస్ధాన్ దంపతులకు కూడా సరొగసి పద్దతిలోనే బిడ్డను కన్నట్లుగా కలరింగ్ ఇచ్చి బిడ్డను అప్పగించింది. నిజానికి దంపతుల్లో భర్త వీర్యాన్ని తీసుకున్నప్పటికీ సరొగసి తల్లి గర్భంలోకి వీర్యాన్ని ప్రవేశపెట్టలేదు.

సరొగసి(అద్దెగర్భం) ద్వారా పిల్లాడిని కన్నది అస్సాంకు(Assam) చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. అస్సాంకు చెందిన వారే అయినా హైదరాబాదులోనే ఉంటున్నారు. రాజస్ధాన్ దంపతులతో రు. 30 లక్షలకు బేరం కుదరగానే అస్సాంకు చెందిన మహిళను హైదరాబాద్ నుండి వైజాగ్ కు డాక్టర్ నమ్రత పంపించారు. కొన్ని నెలల పాటు ఆమెను వైజాగ్ లోనే ఉంచి బిడ్డను కనగానే ఆమెకు కొంత డబ్బు ముట్టచెప్పి తిరిగి హైదరాబాద్ కు పిలిపించారు. ఇపుడు అరెస్టయిన వారిలో పిల్లాడిని కన్న దంపతులు కూడా ఉన్నట్లు డీసీపీ వివరించారు. ఈపద్దతిలో ఎంతమంది యువతులతో డాక్టర్ నమ్రత కాంట్రాక్టులు చేసుకుని ఎంతమందిని దంపతులను నమ్మించి మోసంచేశారనే విషయాన్ని పోలీసులు విచారిస్తున్నారు. అందుకనే డాక్టర్ నమ్రతపై చైల్డ్ ట్రాఫికింగ్ కేసు కూడా పెట్టారు.

విచారణలో భాగంగా డాక్టర్ నమ్రతకు చెందిన అన్నీ క్లినిక్కుల్లోని మెటీరియల్, కంప్యూటర్లు, ల్యాబ్ ఎక్విప్ మెంట్, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. తన లైసెన్స్ రద్దయినా డాక్టర్ నమ్రత సంవత్సరాలుగా ఇదే ప్రాక్టీస్ చేస్తున్నట్లు డీసీపీ రష్మి చెప్పారు. డాక్టర్ ఇద్దరు కొడుకుల్లో లాయర్ అయిన జయంత్ క్రిష్ణను కూడా పోలీసులు అరెస్టుచేశారు. ఎందుకంటే వ్యవహారం అడ్డం తిరిగినపుడు తమ క్లినిక్కు మీదకు వచ్చినపుడు వారిని లీగల్ గా కొడుకుతో బెదిరించి డాక్టర్ నమ్రత పంపేసేదని పోలీసులు కనుక్కున్నారు. క్లినిక్కుల మీద నిర్వహించిన దాడుల్లో తమతో పాటు మెడికల్ అండ్ హెల్త్ డిపార్టమెంట్ అధికారులు కూడా ఉన్నట్లు డీసీపీ వివరించారు.

సరొగసి చట్ట విరుద్ధం : రష్మి

అరెస్టయిన వారిలో డాక్టర్ నమ్రతతో పాటు జయంత్ కృష్ణ, విశాఖపట్నం సెంటర్ మేనేజర్ కల్యాణి అచ్చయమ్మ, ల్యాబ్ టెక్నీషియన్ గొల్లమందల చెన్నారావు, అనస్తీషియ నిపుణుడు, గాంధి ఆసుపత్రి డాక్టర్ నార్గుల సదానందం, పిల్లాడి అసలు తల్లి ధనసరి సంతోషి, మోహమ్మద్ ఆలీ అదీక్, శ్రీమతి నస్రీన్ బేగమ్ తదితరులు ఉన్నట్లు డీసీపీ చెప్పారు. సరొగసి పద్దతిలో డబ్బులు తీసుకుని బిడ్డను కనివ్వటం మనదేశంలో చట్టవిరుద్ధమని డీసీపీ చెప్పారు. ఎవరైనా అలాంటి పద్దతిలో ప్రోత్సహిస్తుంటే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. బిడ్డల కోసం లైసెన్సుడ్, లీగల్ సంస్ధలనే దంపతులు సంప్రదించాలని కూడా రష్మి విజ్ఞప్తిచేశారు.

Tags:    

Similar News