మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు: సుప్రీంకోర్ట్
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో పర్యావరణాన్ని రక్షించే ప్రతిపాదనతో రావాలని సర్కార్‌కు సూచన.;
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో బుధవారం మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా పర్యావరణహితంగా చర్యలు తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అభివృద్ధికి తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. ఈ భూముల వ్యవహారంలో పర్యావరణాన్ని, వన్యప్రాణులను రక్షించేలా ప్రతిపాదనలు రెడీ చేయాలని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచనలు చేసింది. అభివృద్ధి పేరుతో రాత్రికి రాత్రి వందల బుల్డోజర్లతో అడవులను ధ్వంసం చేస్తారా? అని ప్రశ్నించింది. పర్యావరణాన్ని రక్షించకపోతే ఆ కంచె గచ్చిబౌలి స్థలంలోనే తాత్కాలిక జైలు నిర్మించి సీఎస్‌తో పాటు అధికారులను కూడా అందులో పెట్టాల్సి వస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సీజేఐ. కాగా ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించిన సింగ్వి.. అడవులు, వన్యప్రాణులు, చెరువల రక్షణ కోసం అన్ని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు.
గతంలో ఏమందంటే..
కంచె గచ్చిబౌలి వ్యవహారంలో సీఎస్‌ను ప్రతివాదిగా సుప్రీంకోర్టు చేర్చింది. అదే విధంగా ఆఘమేఘాలపైన అక్కడ పనులు ప్రారంభించాల్సిన అవసరం ఏమొచ్చింది? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ 400 ఎకరాలు అటవీ భూమి కాకపోయినా.. భారీ ఎత్తున చెట్లు కొట్టేయడానికి సీఎస్ అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించింది. గచ్చిబౌలి భూముల్లో పెద్దఎత్తున జరుగుతున్న అభివృద్ధి పనులను న్యాయస్థానం సుమోటోగా తీసుకుంది. ఆ ప్రాంతంలో విస్తృతంగా వృక్షసంపద నిర్మూలన జరుగుతుందని ధర్మాసనం పేర్కొంది. దాదాపు 100 ఎకరాలను డెవలప్‌మెంట్‌కు సిద్ధం చేసేటంత యంత్ర సముదాయం అక్కడ మోహరించి ఉందని హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన నివేదిక పేర్కొంది. ప్రభుత్వం చేపడుతున్న ఈ పనులను అక్కడ ఉన్న వన్యప్రాణులను ప్రభావితం చేస్తుందని ధర్మాసనం పేర్కొంది. 1932 నిబంధనల ప్రకారం నెల రోజుల్లోగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, ఆరు నెలల్లోగా ఆ ప్రాంతంలో పరిశీలన అంచనా పనులను పూర్తి చేసి నివేదిక అందించాలని తెలిపింది.