స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు స్టే

1950లో రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన గిరిజనేతరులు.

Update: 2025-09-23 13:50 GMT

ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మేరకు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ 23 మండలాలు గిరిజన మండలాలా? కాదా? అన్న అంశంపైనే ఈ వివాదం మొదలైంది. గతంలో ఈ గ్రామాలను గిరిజన గ్రామాలుగా పేర్కొంటూ హైకోర్టు ప్రకటించింది. దీంతో ఆయా గ్రామాల్లోని గిరిజనేతరులంతా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమవి గిరిజన గ్రామాలు కాదని వారు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. తమ గ్రామాలు గిరిజన పరిధిలో లేవని అన్నారు. అందుకు 1950లో రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులే సాక్షమని వివరించారు. 

2013లో ఈ అంశంపై గిరిజన సంఘాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. వారి పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. నిజాం ఆర్డర్ ఆధారంగా తమ గ్రామాలను గిరిజన గ్రామాలుగా పరిగణించాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో 1950లో రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులను పక్కనబెట్టి నిజాం ఆర్డర్‌ను హైకోర్టు పరిగణనలోకి తీసుకోవడంపై స్థానికులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ గ్రామాలను గిరిజన గ్రామాలుగా పరిగణించొద్దని వారు కోరారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో జరిగిన వాదోపవాదనల్లో.. రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వుల్లో మండపేటలోని 23 గ్రామాలు లేవని గిరిజనేతరుల తరుపు న్యాయవాది విష్ణువర్దన్ రెడ్డి వాదనలు వినిపించారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై స్టే విధించాలని ఆయన కోరారు. ఈ మేరకు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్‌ విజయ్‌ బిష్టోయ్‌లతో కూడిన ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టులు ఉత్తర్వులపై, ఈ 23 గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News