రేషన్ కార్డుల విషయంలో కీలక నిర్ణయం ?

ఇపుడున్న రేషన్ కార్డుల స్ధానంలో స్వైపింగ్ కార్డులను ప్రవేశపెట్టాలని. ఎప్పటినుండి స్వైపింగ్ కార్డులను ప్రవేశపెట్టాలనే విషయమై ప్రభుత్వం ఆలోచిస్తోంది.

Update: 2024-08-10 11:41 GMT
Ration cards

తెలంగాణా ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే ఇపుడున్న రేషన్ కార్డుల స్ధానంలో స్వైపింగ్ కార్డులను ప్రవేశపెట్టాలని. ఎప్పటినుండి స్వైపింగ్ కార్డులను ప్రవేశపెట్టాలనే విషయమై ప్రభుత్వం ఆలోచిస్తోంది. స్వైపింగ్ కార్డుల డిజైన్, అందులో ఉండాల్సిన అంశాలు తదితరాలపై క్యాబినెట్ సబ్ కమిటి చర్చిస్తోంది. మొత్తంమీద అర్ధమవుతున్నది ఏమిటంటే ఇపుడున్న రేషన్ కార్డులను స్వరూపాన్ని మార్చేయాలని. రేషన్ కార్డు ఎంత ముఖ్యమైపోయింది అంటే ప్రభుత్వం అందిస్తున్న ఏ సంక్షేమ పథకాన్ని అందుకోవాలన్నా రేషన్ కార్డు మస్ట్. రేషన్ కార్డు లేకపోతే ప్రభుత్వ సంక్షేమపథకాల్లో లబ్ది దొరకటం కష్టమనే చెప్పాలి.

అందుకనే ప్రభుత్వ సంక్షేమపథకాల లబ్దిపొందేందుకు అర్హలంతా కచ్చితంగా రేషన్ కార్డు కావాలని బలంగా కోరుకుంటారు. రేషన్ కార్డుల్లో కూడా తెల్లరేషన్ కార్డులే చాలా ఎక్కువగా ఉంటాయి. తెల్ల రేషన్ కార్డులున్న వాళ్ళు ప్రభుత్వ లెక్కల ప్రకారం పేదలనే. ప్రభుత్వ వర్గాల ప్రకారం సుమారు 3 కోట్ల తెల్ల రేషన్ కార్డులున్నాయి. తెల్ల రేషన్ కార్డులు కావాలని దరఖాస్తులు పెట్టుకున్న వారిసంఖ్య సుమారు 12 లక్షలుంటుంది. తెల్ల రేషన్ కార్డుల్లో సవరణలు అంటే అడ్రస్ మార్చుకోవాలని, కుటుంబసభ్యుల జాబితాలో మార్పులు చేయాలని దరఖాస్తులు పెట్టుకున్న వారిసంఖ్య మరో 5 లక్షల దాకా ఉంటుంది. వివిధ కారణాలతో పై దరఖాస్తులను ప్రభుత్వం పెండింగులో పెట్టింది.

కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలకు తెల్లరేషన్ కార్డే అర్హతకు ప్రామాణికం. ఈమధ్యనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన రైతు రుణమాఫీలో కూడా రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకున్నది. రుణమాఫీ లబ్దిదారులందరూ తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు కారు. అయితే రుణమాఫీ లబ్ది అందుకోవాలంటే మాత్రం కచ్చితంగా రేషన్ కార్డు కలిగుండాలి. ఇపుడున్న రేషన్ కార్డులు రెండే రకాలు. మొదటిది పింక్ రేషన్ కార్డు, రెండో రకం తెల్ల రేషన్ కార్డు. పింక్ రేషన్ కార్డులను తీసేస్తే తెల్ల రేషన్ కార్డుల జారీలో, వాడకంలో కొన్ని లోపాలున్నట్లు బయటపడుతోంది. అలాగే రేషన్ షాపు డీలర్ల స్ధాయిలో మోసాలు జరుగుతున్నట్లు కూడా బాగా ఆరోపణలు వినబడుతున్నాయి.

కాబట్టి రేషన్ తీసుకోవటంలో కాని డీలర్ల దగ్గర కాని మోసాలకు తావులేకుండా ప్లాస్టిక్ కార్డుల స్ధానంలో కొత్తగా స్వైపింగ్ కార్డులను ప్రవేశపెట్టాలని మంత్రవర్గ ఉపసంఘం నిర్ణయించిందని సమాచారం. చిన్న ఐడి కార్డు సైజులో ఉండే స్వైపింగ్ కార్డులను ప్రవేశపెట్టి అందులో ఒక చిప్ ను అమర్చాలని కమిటి డిసైడ్ అయ్యిందట. కార్డును స్వైప్ చేయటంతో అందులోని చిప్ యాక్టివేటవుతుంది. చిప్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అందులోని లబ్దిదారుల వివరాలు, కుటుంబసభ్యుల వివరాలు, రేషన్ కు సంబంధించిన సమస్త సమాచారం మానిటర్లో కనబడేలా జాగ్రత్తలు తీసుకోవాలని సబ్ కమిటి నిర్ణయించింది. తమ ఆలోచనలను కమిటిలోని మంత్రులు సాఫ్ట్ వేర్ నిపుణులతో మాట్లాడుతున్నారు. మరి ఏమి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News