నాలుగు బిల్లులకు అసెంబ్లీ ఏకగ్రీవం..
ఎంత ఆలస్యమైనా కాళేశ్వరం నివేదికపై సంపూర్ణ చర్చ జరిపి తీరుతామన్న మంత్రి ఉత్తమ్ కుమార్.;
తెలంగాణ అసెంబ్లీ ఆదివారం నాలుగు బిల్లులకు ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసింది. రెండో రోజు ఉదయం 9 గంటలకు మొదలైన అసెంబ్లీ సమావేశాలు ఒకదాని తర్వాత ఒకటిగా నాలుగు బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్ బిల్లు, ఇన్సాపూర్ మున్సిపాలిటీ విస్తరణ బిల్లులకు శాసనసభ అంగీకారం తెలిసింది. అనంతరం అసెంబ్లీ వాయిదా పడింది. కాగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో ఆదివారం చర్చ జరగనుంది. ఆ చర్చ కోసం సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీ తిరిగి ప్రారంభం కానుంది. ఈ చర్చలో భాగంగా కమిషన్ రిపోర్ట్‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చదవి వినిపించనున్నారు. ఆ తర్వాత ఈ అంశంపై ప్రతి ఒక్కరూ తమతమ అభిప్రాయాలను తెలియజేయనున్నారు.
అయితే కాళేశ్వరంపై కమిషన్ ఇచ్చిన నివేదికను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనిపై మాజీ మంత్రి హరీష్.. హైకోర్టులో పిటిషన్ వేశారు. నివేదికను అసెంబ్లీలో పెట్టకుండా ఆదేశాలివ్వాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. కాగా ఇంతలోనే ఆదివారం జరుగుతున్న సమావేశాల్లోనే కమిషన్ నివేదికపై చర్చించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది.
చర్చలు ఏంటనేది అప్పుడే తెలుస్తాం: ఉత్తమ్
అయితే అసెంబ్లీ విరామం సమయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. అందులో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కాళేశ్వరం రిపోర్ట్‌పై చర్చ జరుగుతుంది. ప్రతి ఫ్లోర్ లీడర్‌కు రిపోర్ట్ హార్డ్ కాపీ ఇచ్చాం. సభ్యులకు సాఫ్ట్ కాపీ ఇచ్చాం. ఎంత ఆలస్యం అయినా కాళేశ్వరంపై సంపూర్ణ చర్చ జరుగుతుంది. కేసీఆర్ తరుపున హరీష్ రావుకు కాపీ ఇచ్చాం. అన్ని పార్టీ అభిప్రాయాలు తీసుకుంటాం. కోర్టు విషయాలపై మాట్లాడను. సభలోనే అన్నీ మాట్లాడతాం. చర్చ తర్వాతే తదుపరి కార్యాచారణ ఏంటి అనే దానిపై నిర్ణయం తీసుకుంటాం’’ అని ఆయన తెలిపారు.