అసెంబ్లీ ఆరంభం.. కేసీఆర్ దూరం దూరం

ఈ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు అవకాశం.;

Update: 2025-08-30 05:28 GMT

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ దూరం పాటిస్తున్నారు. తొలి రోజు సమావేశాలకు బీఆర్ఎస్ నేతలంతా కేటీఆర్ నాయకత్వంలో హాజరయ్యారు. తొలి రోజు సమావేశాల సందర్భంగా జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అదే విధంగా శాసనమండలిలో మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి మరణంపై సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వారికి ఉభయసభల్లో నివాళులు అర్పించారు.

నాలుగు రోజులే సమావేశాలు..!

అయితే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నాలుగు రోజులే నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ, శాసనమండలిలో బీఏసీ సమావేశాలను వేరువేరుగా నిర్వహిస్తారు. వాటిలో సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి అన్న అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజులు మాత్రమే జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. శుక్రవారం మిలాద్ ఉన్ నబీ పండగ, శనివారం గణపతి నిమజ్జనం ఉన్నాయి. వాటికి భారీ పోలీసు బందోబస్తు కావాల్సి ఉంటుంది. వాటిని దృష్టిలో పెట్టుకునే గురువారం వరకే సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

అసెంబ్లీకి కేసీఆర్ దూరం దూరం..

తొలిరోజు అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ దూరం పాటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సంతాప తీర్మానంపై చర్చకు కూడా ఆయన హాజరుకాలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ నాయకత్వంలో పాల్గొన్నారు. కాగా సమావేశంలో ఎలా నడుచుకోవాలి వంటి అంశాలపై కేటీఆర్, హరీష్ రావుకు కేసీఆర్ పలు కీలక సూచనలు చేసినట్లు సమాచారం.

గోపీనాథ్‌కు రేవంత్ సంతాపం..

ఈ సమావేశాల సందర్బంగా జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్‌కు సీఎం రేవంత్ సంతాపం తెలియజేశారు. ‘‘విద్యార్థి దశ నుంచే గోపినాథ్ చురుకుగా ఉండేవారు. 1983లో తెలుగుదేశం పార్టీలో గోపీనాథ్ తన రాజకీయ ప్రస్థానాన్ని గోపీనాథ్ ప్రారంభించారు. 1985 నుంచి 1992 వరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు యువత అధ్యక్షుడిగా పని చేశారు. 1987-88 లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ డైరెక్టర్‌గా, 1988-93 లో జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యుడిగా పనిచేశారు. గోపీ ఎన్టీఆర్ కు గొప్ప భక్తుడు. సినీ రంగంలోనూ గోపీనాథ్ నిర్మాతగా రాణించారు. సినిమా రంగంపై అభిమానంతో ‘పాతబస్తీ’(1995), ‘రవన్న’(2000), ‘భద్రాద్రి రాముడు’ (2004), ‘నా స్టైలే వేరు’ (2009) వంటి నాలుగు సినిమాలకు గోపీనాథ్ నిర్మాతగా వ్యవహరించారు. మాగంటి గోపినాథ్ నాకు మంచి మిత్రుడు. రాజకీయంగా పార్టీలు వేరైనా.. వ్యక్తిగతంగా నాకు మంచి మిత్రుడు. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఘనత సాధించిన వారిలో ఆయన ఒకరు. ఆయన మరణం వారి కుటుంబానికి తీరని లోటు. ఆయన అకాల మరణం ఆ కుటుంబానికి శోకాన్ని మిగిల్చింది. చూడటానికి ఆయన క్లాస్ గా కనిపించినా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఆయన మాస్ లీడర్. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా’’ అని రేవంత్ సంతాపం తెలిపారు.

Tags:    

Similar News