అధికారులతో అసెంబ్లీ స్పీకర్ సమావేశం..

కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లకు సూచనలు చేశారా..?;

Update: 2025-08-29 09:07 GMT

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు వేళయింది. చర్చించాల్సిన అంశాలపై రాజకీయ పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. అసెంబ్లీ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. పోలీసులు ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై ఆయన చర్చించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లు సహా పలు ఇతన అంశాలపై వారు చర్చించారు. ఈ సమావేశం అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్‌లో జరిగింది. అసెంబ్లీలో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టడంతో పాటు పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. అంతేకాకుండా పోలీసు శాఖ ఉన్నతాధికారులు చేస్తున్న భద్రతా ఏర్పాట్లపై కూడా వారిని అడిగి తెలుసుకున్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో అదే కీలకం..

అయితే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పిసీ ఘోష్ ఇచ్చిన నివేదికను ప్రవేశపెట్టనున్నారు. ఈ నివేదికపై చర్చించి అందరి అభిప్రాయం సేకరించనున్నారు. దీంతో ఈ అంశం అత్యంత కీలకంగా మారింది. ఈ నివేదికపై బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది ప్రధానంగా ఉంది. అంతేకాకుండా ఈ నివేదిక అంశంపై అసెంబ్లీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది కూడా సంచలనంగా మారనుంది. దాంతో పాటుగా ఇప్పటి వరకు నివేదికలో ఏముంది? అనేది ఎవరికీ తెలీదు. ఇప్పటి వరకు బయటకు వచ్చిన అంశాలన్నీ కూడా లీకుల రూపంలోనో, ఏదైనా సమావేశంలో కాంగ్రెస్ నేతలు చెప్పినవో మాత్రమే. దీంతో అసలు నివేదికలో ఏముంది? అనేది మాత్రం ఇప్పటి వరకు తెలియదు. అది తెలియాలంటే అసెంబ్లీ సమావేశాల్లో నివేదికను ప్రవేశపెట్టిన తర్వాతనే.

అసెంబ్లీకి కేసీఆర్ రావాల్సిందేనా..?

అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నాయకుడు, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తప్పనిసరిగా రావాల్సిందేనా? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. కాళేశ్వరం నివేదికపై తన అభిప్రాయం చెప్పడానికి కేసీఆర్ కచ్చితంగా అసెంబ్లీకి రావాల్సిందే. ఇప్పటికే దీనిని ఆపాలని కోరుతూ ఆయన కోర్టును ఆశ్రయించారు. కాగా కేసీఆర్, హరీష్ వాదనలను కోర్టు కొట్టేసింది. ఏమున్నా అసెంబ్లీలో చెప్పాలని తెలిపింది. దీంతో ఇప్పుడు ఆయనకు అసెంబ్లీకి తప్పనిసరిగా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ రాకపోతే.. అది కాంగ్రెస్‌కు పెద్ద ప్లస్ పాయింటే అవుతుంది.

కేసీఆర్ రాక కోసమే భారీ భద్రతా..?

కాళేశ్వరం నివేదికపై చర్చకు కేసీఆర్ వస్తారనే అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవడం కోసమే భారీ భద్రత ఏర్పాట్లు చేయాలని సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నొక్కి చెప్పినట్లు సమాచారం. కాళేశ్వరం రిపోర్ట్ నివేదిక చర్చ సమయంలో కాస్తంత వాతావరణం వేడెక్కొచ్చని గ్రహించే ఆయన పోలీసుల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో పలు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News