60కి పైగా కంపెనీలతో పార్క్: రేవంత్

లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీకి హబ్‌గా తెలంగాణ మారిందన్న సీఎం రేవంత్ రెడ్డి.;

Update: 2025-08-24 14:37 GMT

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్లకు చేర్చడమే లక్ష్యంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ నినాదంతో ముందుకెళ్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అందుకోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. బయోడిజైన్స్, లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ ఒక ముఖ్యమైన కేంద్రంగా తెలంగాణ ఎదుగుతోందని ఆయన వివరించారు. బయో టెక్నాలజీ, ఫార్మా, మెడికల్ టెక్నాలజీ రంగాల్లో నూతన ఆవిష్కరణలకు అవసరమైన మద్దతును ఇవ్వడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తుందని చెప్పారు. హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జరిగిన ‘ఆసియా పసిఫిక్ బయో డిజైన్ ఇన్నొవేషన్ సమ్మిట్ 2025’ లో రేవంత్ పాల్గొన్నారు. ఈ వేదికగా “ఇన్నొవేషన్ ఆఫ్ భారత్ - ది బయోడిజైన్ బ్లూప్రింట్‌”ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగానే బయోడిజైన్ విధానం ఉపయోగించి వైద్య ఉత్పత్తుల ఆవిష్కరణల విషయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతునిస్తుందని చెప్పారు. మాన్యుఫాక్చరింగ్ స్థాయి నుంచి నూతన ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్‌ అభివృద్ధి చెందడం శుభ సూచకమని అన్నారు. “భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ, ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి స్వదేశీ ఆవిష్కరణలు ఎంతో అవసరం. అలాంటి పరిశోధనలకు, ఆవిష్కరణల కోసం తెలంగాణ మద్దతునివ్వడమే కాకుండా వైద్య డేటాను డేటా గోప్యతా ప్రమాణాలకు లోబడి అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని వెల్లడించారు.

‘‘నూతన ఆవిష్కరణల కోసం విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, కార్పొరేట్ భాగస్వాములతో అనుసంధానం చేస్తాం. చాలా ఏళ్లుగా మన మేదస్సు ఇతర దేశాల సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మన ప్రతిభ పాటవాలు దేశ ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. బయోడిజైన్ విధానం క్లినికల్ అవసరాలకు, ఆచరణాత్మక ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అందిస్తాయి. ఈ రంగంలో ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో నూతన ఆవిష్కరణల కోసం పరిశోధనా కార్యక్రమాలు కొనసాగించడం అభినందనీయం’’ అని అన్నారు.

‘‘లైఫ్ సైన్సెస్ రంగంలో జాతీయ స్థాయిలో తెలంగాణ ఉన్నత స్థానంలో ఉంది. ముఖ్యంగా డయాగ్నస్టిక్ పరికరాలు, ఇమేజింగ్ టెక్నాలజీ, ఇంప్లాంట్ టెక్నాలజీ, సర్జికల్ పరికరాలు, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్‌లో తెలంగాణకు గణనీయమైన పెట్టుబడులు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టమైన విజన్‌తో ముందుకు వెళుతోంది. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న తెలంగాణ రైజింగ్ లక్ష్యంతో పనిచేస్తున్నాం’’ అని తెలిపారు.

‘‘వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం సుల్తాన్‌పూర్‌లో దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్క్‌ను అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేశాం. అక్కడ 60 కి పైగా ప్రపంచ, దేశీయ కంపెనీలు ఇప్పటికే పని చేస్తున్నాయి. వివిధ రంగాల్లో హైదరాబాద్ ఒక ప్రత్యేకమైన కేంద్రంగా ఎదగడంలో స్థానిక స్టార్టప్ కంపెనీలు, ఎంఎస్ఎంఈలు, పరిశ్రమల సహకారం ఎంతో ఉంది..” అని అన్నారు.  

Tags:    

Similar News