తెలంగాణలో 46 శాతం బీసీలే.. కాంగ్రెస్ తన హామీని నెరవేర్చేనా?
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే నివేదికను ప్లానింగ్ కమిషన్ అధికారులు ఆదివారం కేబినెట్‌కు అందించారు.;
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే నివేదికను ప్లానింగ్ కమిషన్ అధికారులు ఆదివారం కేబినెట్‌కు అందించారు. రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపాల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా నేతృత్వంలోని బృందం, కేబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమర్పించారు అధికారులు. ఇందులో అధికారులు అందించిన నివేదికను కేబినెట్ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సర్వే 50 రోజుల పాటు కొనసాగింది. ఇందులో తెలంగాణ ప్రజల ఆర్థిక, సామాజిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సంబంధిత వివరాలను సేకరించారు. మొత్తం 3,889 మంది అధికారులు ఈ సర్వేలో పాల్గొన్నారు. 96.9 శాతం కుటుంబాలను సమీక్షించారు. 3.54కోట్ల మంది ప్రజల వివరాలను నమోదు చేశారు. రాష్ట్రంలోని 3.1శాతం మంది ప్రజలు సర్వేలో పాల్గొనలేదని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా ఈ సర్వే ప్రకారం తెలంగాణలో 46శాతం మంది బీసీలే ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ నివేదికపై సోమవారం నిర్వహించనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. సర్వేకు కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఈ నివేదికను ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో చర్చ తర్వాత ఈ నివేదికపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఈ రోజు చర్చ తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక విషయాలు పంచుకున్నారు.
‘‘ఈరోజు తెలంగాణ చరిత్రలో మిగులుతుంది. రాహుల్ గాంధీ ఆలోచన విధానంతో కులగణన చేపట్టి సర్వే చేసి నివేదిక సబ్ కమిటీకి అందించటం జరుగుతుంది. సామాజిక ఆర్థిక వెనుకబాటుకు గురి అయిన వారికి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సర్వే చేపట్టడం జరిగింది. 4 ఫిబ్రవరిలో క్యాబినెట్ లో తీర్మానం.. ఫిబ్రవరి 16 న అసెంబ్లీలో తీర్మానం. రాష్ట్రంలోని 96 శాతం ప్రజలు ఈ సర్వేలో పాల్గొన్నారు. 3కోట్ల54 లక్షల మంది ఈ సర్వే లో పాల్గొన్నారు. దాదాపుగా 16 లక్షల మంది సర్వే లో పాల్గొనలేదు. కర్ణాటక, బీహార్ రాష్ట్రాల్లో జరిగిన సర్వే పై సమీక్షించనున్నాం. తెలంగాణ సామాజిక న్యాయం అందించడంలో గొప్ప అధ్యాయం మొదలు అయింది. 4 వ తారీఖు క్యాబినెట్ భేటీ.. అదే రోజున అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది’’ అని ఆయన తెలిపారు.
సర్వే ప్రకారం తెలంగాణలోని సామాజిక వర్గాలు జనాభా
ఎస్సీ 17.43% - 61,84,319
St 10.45% - 37,05,929
బీసీ 46.25% - 1,64,09,179
బీసీ ముస్లిం 10.08% -35,76,588
ఓసి ముస్లిం 2.48
టోటల్ ముస్లిం ఓసి 12.56%
ఓసి 13.31 % జనాభా
బీసీ డిక్లరేషన్ జరిగేనా..
అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. ఈ అంశంపై ఇప్పటికే పలుసార్లు పలు సమావేశాలు నిర్వహించి.. బీసీ డిక్లరేషన్ అమలును డిమాండ్ చేశారు. ఇటీవల ఇందిరాపార్క్ దగ్గర నిర్వహించిన బీసీ సమావేశంలో.. రాష్ట్రంలో బీసీలు ఎంత శాతం మంది ఉంటే వారికి అంత శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆమె డిమాండ్ ప్రకారం.. కుల గణన సర్వే చూసుకుంటే బీసీలకు 46శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇచ్చిన హామీ ప్రకారం 42శాతం రిజర్వేషన్లే అందిస్తుందా.. లేదంటే 46శాతం అందిస్తుందా అనేది కీలక చర్చగా మారింది. అంతేకాకుండా అన్ని పథకాల్లో కోతలు పెడుతున్న కాంగ్రెస్.. బీసీ డిక్లరేషన్ విషయంలో కూడా కోతలు పెడుతుందా? లేదంటే మొత్తానికే ఈ హామీని అటకెక్కిస్తుందా? అన్న చర్చ కూడా జోరుగానే సాగుతోంది.