తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కి సీఐడీ నోటీసులు

తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కి తెలంగాణ సీఐడీ పోలీసులు నోటీసులిచ్చారు. పన్నుల ఎగవేత కుంభకోణం లో ఆయనకి నోటీసులు జారీ చేశారు.

Update: 2024-09-14 13:53 GMT

తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కి తెలంగాణ సీఐడీ పోలీసులు నోటీసులిచ్చారు. పన్నుల ఎగవేత కుంభకోణం లో ఆయనకి నోటీసులు జారీ చేశారు. కాగా, దాదాపు రూ.1400 కోట్ల జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై విచారణ చేపట్టిన సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) పోలీసులు.. ఆయనపై కేసు నమోదు చేశారు. సోమేశ్ కుమార్ తో పాటు కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వర రావు, డిప్యూటీ కమిషనర్ ఏ.శివరామ ప్రసాద్, ‘ప్లియాంటో టెక్నాలజీస్’, ఐఐటీ-హైదరాబాద్‌ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు లపై కేసు నమోదైంది. పోలీసులు ఎఫ్ఐఆర్ లో సోమేశ్ కుమార్ ని ఏ-5 గా చేర్చారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన సీఐడీ పోలీసులు తాజాగా సోమేశ్ కుమార్ కి నోటీసులు ఇచ్చారు.

రూ.1400 కోట్లు పన్ను ఎగవేత...

ఈ ఏడాది జూలై 26న జిఎస్‌టి మోసం జరిగిందని సెంట్రల్ కంప్యూటర్ వింగ్, నాంపల్లి జాయింట్ కమిషనర్ (సిటి) కానూరి రవి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ‘బిగ్ లీప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ దాఖలు చేసిన ఐటి రిటర్న్స్‌ పై వాణిజ్య పన్నుల శాఖ ఆడిట్‌ నిర్వహిస్తుండగా వ్యత్యాసాలు బయటపడటంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. పన్ను చెల్లింపులు చేయకుండానే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC)ని పాస్ చేసిందని, దీని ఫలితంగా రాష్ట్ర ఖజానాకు గణనీయమైన నష్టం వాటిల్లిందని కానూరి సీసీఎస్ చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఒక్క తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ పన్ను ఎగవేత ద్వారానే వాణిజ్య పన్నుల శాఖకు రూ.1,000కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని.. మరో 11 ప్రైవేటు సంస్థలు సుమారు రూ.400కోట్లు ఎగవేసినట్లు ప్రాథమికంగా వెల్లడైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ట్యాక్స్ ఎగవేతదారులకు ఈ నలుగురు సహకరించారని ఆయన ఫిర్యాదులో తెలిపారు. దీంతో పోలీసులు వీరిపై ఐపీసీ 406, 409, 120B ఐటి చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

స్కామ్ బయటపడిందిలా...

మ్యాన్ పవర్ సప్లై చేసే బిగ్ లీప్ అండ్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పన్ను చెల్లించకుండానే రూ.25కోట్ల ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ తీసుకొని మోసానికి పాల్పడినట్లు తేలింది. ఈ నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ అంతర్గతంగా విచారణ చేపట్టింది. ఈ శాఖకు టెక్నాలజీ అందించే సర్వీస్ ప్రొవైడర్ గా ఐఐటి హైదరాబాద్ వ్యవహరించింది. ఈ సర్వీస్ ప్రొవైడర్ పని ఏంటంటే.. తెలంగాణలో పన్ను చెల్లింపుదారులు నమోదు చేసే ఐటీ రిటర్న్స్ లో అక్రమాలను గుర్తించడంతోపాటు డేటాను విశ్లేషించడం. అలాగే ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సర్వీస్ ప్రొవైడర్ రూపొందించిన స్క్రూటినీ మాడ్యూల్ గుర్తించాల్సి ఉంటుంది. కానీ 'బిగ్ లీప్' అక్రమాలకు పాల్పడినప్పటికీ ఈ మాడ్యూల్ కనిపెట్టలేదు. దీంతో వాణిజ్య శాఖకు సర్వీస్ ప్రొవైడర్ పై అనుమానాలు మొదలయ్యాయి.

తీగ లాగితే డొంక కదిలింది...

బిగ్ లీప్ అక్రమాలను సర్వీస్ ప్రొవైడర్ గుర్తించకపోవడంతో వాణిజ్య పన్నుల శాఖ ఓ అధికారిని నియమించి విచారణ మొదలు పెట్టింది. ఆ అధికారి గత ఏడాది డిసెంబర్ 26న ఐఐటీ హైదరాబాద్ ప్రాంగణంలో ఎంక్వైరీ జరిపారు. అప్పటి రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ తో పాటు, కాశీ విశ్వేశ్వర రావు, శివరాం ప్రసాద్ ల మౌఖిక ఆదేశాల మేరకు అక్రమాలను గుర్తించకుండా సాఫ్ట్వేర్ లో మార్పులు చేశారని ఆయన తన నివేదికలో పొందుపరిచారు. సాఫ్ట్వేర్ లో మార్పులు చేసిన కారణంగా ఐజీఎస్టీలో అక్రమాలు బయటపడలేదని, దీంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిందని ఆయన పేర్కొన్నారు.

ఇక ఐఐటీ హైదరాబాద్ ప్రాంగణంలోని ప్లియాంటో టెక్నాలజీస్ సంస్థ వాణిజ్య పన్నుల శాఖ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నట్లు రిపోర్టులో తెలిపారు. ఈ రిపోర్ట్ ఆధారంగా కాశీ విశ్వేశ్వర రావు, శివరాం ప్రసాద్, ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్ని వాణిజ్యపన్నుల శాఖ వివరణ కోరింది. అయితే సోమేశ్ కుమార్ ఆదేశాలతోనే తాము సాఫ్ట్వేర్ లో మార్పులు చేసినట్లు కాశీ విశ్వేశ్వర రావు, శివరాం ప్రసాద్ వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో వాణిజ్యశాఖకి, ఐఐటీ హైదరాబాద్ కి మధ్య జరిగిన చీకటి ఒప్పందం గురించి మరింత సమాచారం రాబట్టేందుకు జనవరి 25న స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కి వాణిజ్యపన్నుల శాఖ లేఖ రాసింది. అయితే డేటా అంతా ఐఐటీ హైదరాబాద్ నియంత్రణలో ఉందని, డేటాలో అవసరమైనప్పుడు మార్పులు చెంసేందుకు వీలుందని స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ రిప్లై ఇచ్చింది.

వాట్సాప్ గ్రూప్ ద్వారా సూచనలు...

పోలీసుల విచారణలో ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు ‘స్పెషల్ ఇనిషియేటివ్స్’ అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా సూచనలను తీసుకున్నారని, అందులో సభ్యులు సోమేశ్ కుమార్, విశ్వేశ్వరరావు, శివ రామ ప్రసాద్‌లు ఉన్నారని తేలింది. ఈ క్రమంలో గ్రూప్ ఏర్పాటు, గ్రూప్ లో జారీ చేసిన ఆదేశాల ఆధారంగా సాఫ్ట్‌వేర్‌లో చేసిన మార్పులను వివరించాలని విశ్వేశ్వరరావు, శివ రామ ప్రసాద్‌లకు వాణిజ్య పన్నుల శాఖ అత్యవసర మెమో జారీ చేసింది. దీనికి వారు సోమేష్ కుమార్ పర్యవేక్షణలో గ్రూప్ చేసిందని, డిసెంబర్ 2022 నుండి గ్రూప్ యాక్టివ్ గా లేదని సమాధానమిచ్చారు.

"అయితే, గ్రూప్ ఫిబ్రవరి 2024 వరకు యాక్టివ్‌గా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. వాట్సాప్ చాట్ హిస్టరీలో IGST నష్టాలను అంచనా వేసే నివేదికలు రూపొందించబడ్డాయి. అవకతవకలు జరిగినా రిజిస్ట్రేషన్లను రద్దు చేయవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఆధారాలను తారుమారు చేసేందుకు వీలు లేకుండా నిందితుల ఫోన్ లు స్వాధీనం చేసుకున్నాం" అని పోలీసులు చెబుతున్నారు.

Tags:    

Similar News