కాంగ్రెస్ లో తీన్మార్ ‘బీసీ చిచ్చు’ ? పార్టీకి గుడ్ బై ?

రేవంత్ రెడ్డి(Revanth)ని మల్లన్న బాగా టార్గెట్ చేస్తుండటంతో ప్రభుత్వంతో పాటు పార్టీలో కూడా మంటలు రేగుతున్నాయి.;

Update: 2025-02-06 08:38 GMT
Revanth and Teenmar Mallanna

కాంగ్రెస్ పార్టీలో ఎంఎల్సీ తీన్మార్ మల్లన్న పెట్టిన బీసీ చిచ్చు బాగానే రగులుకుంటోంది. అధికారపార్టీలో ఉంటూనే తీన్మార్ కులగణన సర్వే రిపోర్టును బహిరంగంగా తగలబెట్టడంతో నిప్పు రాజుకుంది. కులగణన నివేదికంతా తప్పులతడకంటు మల్లన్న ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి(Revanth)ని మల్లన్న బాగా టార్గెట్ చేస్తుండటంతో ప్రభుత్వంతో పాటు పార్టీలో కూడా మంటలు రేగుతున్నాయి. కులగణన సర్వే(Cast Survey) రిపోర్టుపై ప్రతిపక్షాలు బీఆర్ఎస్9BRS), బీజేపీ(BJP) నేతలుచేస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ ఎంఎల్సీ మల్లన్న(Teenmar mallanna) ఆరోపణలు మద్దతుగా నిలుస్తుండటంతో ఏమిచేయాలో అర్ధంకాక మంత్రులు తలలుపట్టుకుంటున్నారు. సర్వే రిపోర్టుపై స్వయంగా అధికారపార్టీ నేతే ఆరోపణలు చేస్తుండటంతో ప్రతిపక్షాల నేతల ఆరోపణలకు బలం చేకూరినట్లవుతోంది. దీంతో మల్లన్న మద్దతుదారులంతా ఒక్కసారిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమిప్పుతున్నారు.

మల్లన్న వ్యవహారం ఇపుడే కాదు కొంతకాలంగా పార్టీతో పాటు రేవంత్ కు ఇబ్బందిగా తయారైంది. ఎందుకంటే కాంగ్రెస్ టికెట్ మీద నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎంఎల్సీగా గెలిచిన తీన్మార్ కొంతకాలం తర్వాత పార్టీ, ప్రభుత్వానికి పంటికింద రాయిలాగ తయారయ్యాడు. ప్రభుత్వవిదానాలను బహిరంగంగానే తప్పుపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. తీన్మార్ ఆరోపణలను ఆధారంగా చేసుకుని ప్రతిపక్షాల నేతలు కూడా ప్రభుత్వంపై రెచ్చిపోతున్నారు. ప్రతిపక్షాల నేతల ఆరోపణలకు మంత్రులు సమాధానాలు ఇస్తుంటే మళ్ళీ మల్లన్న పిక్చర్లోకి వచ్చేసి మరిన్ని ఆరోపణలతో రెచ్చిపోతున్నాడు. దాంతో అటు ప్రతిపక్షాల నేతల ఆరోపణలను సమర్ధవంతంగా తిప్పికొట్టలేక ఇటు తీన్మార్ ను కంట్రోల్ చేయలేక మంత్రులు బాగా ఇబ్బందిపడుతున్నారు.

తాజాగా కులగణన సర్వే రిపోర్టును తీన్మార్ తగలబెట్టడం పార్టీలో సంచలనంగా మారింది. దాంతో పార్టీ ఎంఎల్సీకి షోకాజ్ నోటీసు జారీచేసింది. అయితే ఆ నోటీసుకు తీన్మార్ సమాధానం ఇస్తారని ఎవరూ అనుకోవటంలేదు. తీన్మార్ వైఖరి చూస్తుంటే ఎక్కువరోజులు కాంగ్రెస్(Congress) లో కంటిన్యు అవుతారా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. మల్లన్నపై ఫైర్ అయిన మంత్రి సీతక్క మాట్లాడుతు అసలు మల్లన్న ఏ పార్టీనో ముందు తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీలో ఉండదలచుకుంటే మల్లన్న కాంగ్రెస్ పార్టీ లైనులోనే రాజకీయాలు చేయాలని కూడా సూచించారు. తాను నిర్వహించిన సమావేశాలకు పిలిచినా తీన్మార్ హాజరుకాలేదన్నారు. పార్టీలో ఉండి పార్టీ, ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేట్లుగా మాట్లాడటం తీన్మార్ కు మంచిదికాదని హితవు కూడా పలికారు. ఇదే విధంగా మరో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు.

కులగణన సర్వే రిపోర్టును తీన్మార్ తప్పుపట్టడం మంచిదికాదన్నారు. బీసీలకు న్యాయంచేయటానికి తీన్మార్ దగ్గర ఏదైనా ప్లాన్ ఉంటే వచ్చిమాట్లాడాలేకాని ఇలా బహిరంగంగా నిరసనలు తెలపటం తప్పన్నారు. ఈరోజు జరిగిన సీఎల్పీ(CLP meeting) సమవేశానికి కూడా తీన్మార్ మల్లన్న హాజరుకాలేదు. దాంతో పార్టీకి తీన్మార్ కు మధ్య గ్యాప్ బాగా పెరిగిపోతోంది. పార్టీతో పాటు బయటజరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే తీన్మార్ ఎక్కువరోజులు కాంగ్రెస్ లో కంటిన్యు అయ్యే విషయంలో అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఓడి గెలిచిన తీన్మార్

తీన్మార్ మల్లన్న ఎంఎల్సీగా పోటీచేసిన మొదటిసారి ఓడిపోయి రెండోసారి పోటీచేసి గెలిచాడు. 2021లో నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో తీన్మార్ ఇండిపెండెంటుగా పోటీచేశారు. బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన పల్లా రాజేశ్వరరావుకు 1,11,090 ఓట్లు రాగా, తీన్మార్ కు 83,520 ఓట్లొచ్చాయి. ఓడిపోయిన తర్వాత తీన్మార్ కాంగ్రెస్ లో చేరాడు. 2023 ఎన్నికల్లో పల్లా ఎంఎల్ఏగా గెలిచిన తర్వాత ఎంఎల్సీకి రాజీనామా చేశారు. దాంతో గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఎంఎల్సీకి ఉపఎన్నిక అనివార్యమైంది. 2024లో జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసిన తీన్మార్ గెలిచాడు. ఎంఎల్సీగా గెలిచిన కొద్దిరోజులు బాగానే ఉన్న తీన్మార్ తర్వాత ఏమైందో తెలీదుకాని రేవంత్ ను టార్గెట్ చేయటం మొదలుపెట్టాడు. అప్పటినుండి మల్లన్న ప్రభుత్వానికే కాదు పార్టీకి కూడా దూరమైపోతున్నాడు. కులగణన సర్వే రిపోర్టును తగలబెట్టడంతో చివరకు తీన్మార్ కు పార్టీ షోకాజ్ నోటీసు జారీచేసింది.

కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేశాడు కాబట్టే ఎంఎల్సీగా గెలిచిన విషయాన్ని తీన్మార్ మరచిపోయాడు. అంతకుముందే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఊపుమీదున్న ఎంఎల్ఏలు, మంత్రులు, సీనియర్ నేతలంతా కష్టపడి తీన్మార్ ను గెలిపించారు. అయితే తన గెలుపు తన గొప్పదనంగా తీన్మార్ భావిస్తున్నట్లున్నాడు. అందుకనే ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. ఇదే విషయాన్ని మంత్రి సీతక్క గుర్తుచేశారు. తామంతా ఎన్నికల్లో కష్టపడి పనిచేయబట్టే తీన్మార్ గెలిచిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. అయితే తీన్మార్ భావన ఎలాగుందంటే తాను అభ్యర్ధిగా పోటీచేయబట్టే కాంగ్రెస్ గెలిచిందన్నట్లుగా ఉంది. తొందరలోనే తీన్మార్ విషయం ఏదోకటి తేలిపోతుందనే అనుకుంటున్నారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News