రైతుకూలీలకు ‘రైతు భరోసా’ ఎపుడో రేవంత్ సర్కార్ చెప్పాలి

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొన్ని పదాలు బాగా వినిపిస్తున్నాయి. హైడ్రా, ఫోర్త్ సిటీ , రీజనల్ రింగ్ రోడ్డు లాంటివి. మీడియా కథనాలు కూడా రోజంతా వీటి చుట్టూనే తిరుగుతున్నాయి.

Update: 2024-08-22 06:07 GMT

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొన్ని పదాలు బాగా వినిపిస్తున్నాయి. హైడ్రా, ఫోర్త్ సిటీ , రీజనల్ రింగ్ రోడ్డు లాంటివి. మీడియా కథనాలు కూడా రోజంతా వీటి చుట్టూనే తిరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పాలనలో మారిపోయిన ప్రాధాన్యతలకు ఇవి అద్దం పడుతున్నాయి. అభివృద్ధి, నగరాలు, ప్రపంచ బ్యాంకు అప్పులు, విదేశీ పర్యటనలు, విదేశీ పెట్టుబడులు, విదేశీ కన్సల్టెన్సీ లు, నగరాలలో మౌలిక సదుపాయాలు, ఇవన్నీ 1991 నుండీ ముందుకు వచ్చిన కొత్త అభివృద్ధి నమూనాలో భాగమైన భాషలో పుట్టిన పదాలు . ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వాడీ వాడీ అరగ దీసిన భాష ఇది. సాధారణ ప్రజలు, వాళ్ళ నిజమైన అవసరాలు మచ్చుకయినా కనపడని అభివృద్ధి నమూనా భాష ఇది. ప్రభుత్వ రంగాన్ని బలహీన పరిచి, ప్రైవేటీకరణను ముందుకు నెట్టే బాష ఇది.

ఇదే సమయంలో రాష్ట్ర జనాభాలో 60 శాతం జనాభా ఇప్పటికీ గ్రామాలలోనే ఉన్నారనీ, కనీసం సగం జనాభా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారనీ, అక్కడ మౌలిక వసతుల అభివృద్ధికి కూడా పెట్టుబడులు పెట్టాలనీ, రాష్ట్రంలో వ్యవసాయ భూములను విచ్చలవిడిగా ఇతర అవసరాలకు మళ్లించకుండా కాపాడుకోవడానికి, భూ వినియోగ విధానం తీసుకు రావాలనీ సామాజిక కార్యకర్తలు మరో భాష మాట్లాడుతున్నారు.

ప్రభుత్వం ఏ అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టినా పర్యావరణ స్పృహ తప్పకుండా ఉండాలనీ, మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల గడ్డు రోజులు రానున్నాయనీ, రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెంచే చర్యలు ఎట్టి పరిస్థితులలోనూ చేపట్టవద్దని పర్యావరణ వేత్తలు తమ దైన భాషలో సూచిస్తున్నారు. అందుకే దామగుండం అటవీ ప్రాంతంలో వెరీ లో ఫ్రీక్వెన్సీ నావల్ రాడార్ స్టేషన్ ఏర్పాటును అక్కడి ప్రజలతో కలసి వ్యతిరేకిస్తున్నారు. ఈ కారణం చేతనే అత్యధిక నీటి వినియోగంతో పాటు, ఖరీదైన విద్యుత్ సరఫరాతో నదుల నుండీ నీళ్ళను లిఫ్ట్ చేసి ,రిజర్వాయర్లు నింపి సాగు చేస్తున్న బియ్యం,మొక్కజొన్న ఆధారంగా అత్యంత కాలుష్య కారకమైన ఇథనాల్ కంపెనీల ఏర్పాటుకు రాష్ట్రంలో ఇస్తున్న అనుమతులను రద్ధు చేయాలని కూడా కోరుతున్నారు. ఆగస్ట్ 17 న వివిధ జిల్లాలలో ఈ ప్రాజెక్టుల బాధిత ప్రజలు హైదరాబాద్ ప్రజా భవన్ కు తరలి వచ్చి ప్రజావాణి లో తమ ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రానికి ఇప్పటికే ఉన్న అప్పుల భారాన్ని మరింత పెంచేలా , కొత్త అప్పులు చేయకుండా, అందుబాటులో ఉన్న నిధులతో సాధారణ ప్రజల సంక్షేమానికి, సామాజిక న్యాయం కల్పనకు బడ్జెట్ లో అవసరమైన నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం సుస్థిర అభివృద్ధి వైపు ప్రణాళికలు రచించాలని ఎందరు సూచించినా, ప్రభుత్వాలు ఎప్పుడూ నగరీకరణ వైపూ, రియల్ ఎస్టేట్ విస్తరణ వైపూ, నగరాల చుట్టూ భారీ మౌలిక వసతుల కల్పన వైపూ అప్పులు చేసి మరీ పరుగులు పెడుతుంటాయి.

రైతులకు పంట ఋణ మాఫీ లాంటి ఎన్నికల హామీని అమలు చేయడమొక్కటే లక్ష్యం అన్నట్లుగా, అదొక్కటే అన్ని సమస్యలను పరిష్కరిస్తుందన్నట్లుగా గత నెల రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది . నిజానికి ఈ హామీ కూడా అరకొర గానే అమలయింది. మార్గదర్శకాల ప్రకారం పూర్తి స్థాయిలో ఈ హామీ అమలు కావడానికి ఎన్ని నెలలు పడుతుందో ఎవరూ చెప్పలేక పోతున్నారు.

నిజంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు అందుబాటులో ఉంటే, రెండు లక్షల పైన రుణాలు ఉన్న వారి రుణ మాఫీకి ప్రాధాన్యత ఇవ్వడం కంటే, గత ప్రభుత్వం అమలు చేయకుండా ఎగ్గొట్టిన, 2018 డిసెంబర్ 11 లోపు బ్యాంకు రుణాల బకాయి ఉండి, ఇప్పటికీ సాగులో ఉన్న సన్న,చిన్నకారు రైతుల రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది.

కొత్త రెవెన్యూ చట్టంపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడం, ఆగస్ట్ 23 లోపు ప్రజల అభిప్రాయాల సేకరణ కోసం ముసాయిదా ప్రజల ముందు ఉంచడం లాంటి చర్యలు అవసరమైనవే అయినా, ధరణి సమస్యలు పరిష్కారం కాక, రైతులు ఇంకా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు జరిగితే కానీ, ఈ బిల్లు చట్టం కాదు. సెప్టెంబర్ 30 నాటికి ఖరీఫ్ సీజన్ కూడా ముగిసిపోతుంది.

మరి ఈ ఖరీఫ్ సీజన్ లో రైతులకు రైతు భరోసా చెల్లిస్తారా? ఈ లోపు కౌలు రైతులను గుర్తించి , వారికి కూడా రైతు భరోసా సహాయం అందిస్తారా ? ధరణి స్థానంలో వచ్చే కొత్త చట్టం ప్రకారం పార్ట్ బీ లో ఉన్న రైతుల సమస్యలను, సాదాబైనామా రైతుల సమస్యలను కూడా కొలిక్కి తెచ్చి, వారికి కూడా ఈ ఖరీఫ్ సీజన్ నుండీ రైతు భరోసా చెల్లిస్తారా ?

మానిఫెస్టో లో హామీ ఇచ్చిన విధంగా వ్యవసాయ కూలీలను కూడా ఈ సీజన్ లోనే గుర్తించి వారికి కూడా రైతు భరోసా సహాయం అందిస్తారా ? అనే ప్రశ్నలకు జవాబు ఇచ్చే వారెవ్వరు ?

2024 ఖరీఫ్ సీజన్ ముగింపుకు వస్తున్నా, పంటల బీమా పథకం ఇంకా పట్టాలు ఎక్కలేదు. ఈ ఖరీఫ్ లో భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఈ పథకం ప్రకారం పరిహారం చెల్లిస్తారా? 2024-2025 రబీ సీజన్ పంటల బీమా నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు ? అన్నీ ప్రశ్నలే. వ్యవసాయ మంత్రి గారి నుండీ కమిషనర్ వరకూ ఎవరూ వీటిపై రైతులకు స్పష్టత ఇవ్వడం లేదు.

ఆగస్ట్ 15 గడువు ముగిసిపోయినా, రైతు బీమా పథకం భూమి లేని కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు విస్తరించలేదు . గత నెలలో మంత్రుల బృందం వెళ్ళి జిల్లాలలో రైతుల అభిప్రాయాలు సేకరించినా, ఇప్పటికీ కౌలు రైతుల గుర్తింపు కోసం అడుగులు ముందుకు పడలేదు. రైతు భరోసా విధి విధానాలు ఖరారు కాలేదు.

రైతు కమిషన్ ఏర్పాటుపై ఏమి చర్యలు తీసుకుంటున్నారో ఎవరికీ స్పష్టత లేదు. సమగ్ర వ్యవసాయ విధానం, శాస్త్రీయ పంటల ప్రణాళిక ఊసే లేదు. ముఖ్యమంత్రి అంటే గుంపు మేస్త్రి లాంటి వాడని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యానించారు కానీ, వ్యవసాయ శాఖ నుండీ వ్యవసాయ విశ్వ విద్యాలయం వరకూ సకాలంలో ఎవరి పని వారు చేసేలా, నిర్ధిష్ట బాధ్యతలు అప్పగించడం లేదనిపిస్తుంది. అన్నీ నత్తనడక నడుస్తున్నాయి.

పైగా గతంలో వ్యవసాయ శాఖా మంత్రిగా పని చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి కి ఇప్పుడు వ్యవసాయ సలహాదారుగా క్యాబినెట్ హోదా ఇచ్చారు. ఇది అర్థం లేని పని. రాష్ట్రానికి వ్యవసాయ మంత్రి గారు ఉండగా మరో సలహాదారు ఎందుకు? పైగా గత పదేళ్ళ BRS పాలనలో కేసీఆర్ కు భజన చేయడం తప్ప, ఆయన రాష్ట్ర వ్యవసాయానికి గానీ, నిజామాబాద్ జిల్లా వ్యవసాయానికి గానీ చేసిన సేవ ఏమీ లేదు. ఇలాంటి నియామకాలు చేపట్టి, విలువైన రాష్ట్ర నిధులను దుర్వినియోగం చేయడం న్యాయం కాదు.

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) ఏర్పాటు ఒక గొప్ప ముందడుగు గా ప్రభుత్వం చెప్పుకుంటున్నది. ఈ వ్యవస్థలో 70 ప్రత్యేక బృందాలు, పోలీస్, GHMC,ఇతర శాఖల నుండీ 3000 మంది సిబ్బంది ఉంటారు.హైడ్రా పర్యవేక్షణలో ACP స్థాయి ఆధ్వర్యంలో కొత్త పోలీస్ స్టేషన్ కూడా ప్రారంభం కాబోతుంది. చెరువులు, కుంటాలు, నాలాలు, భూములు ఆక్రమించుకున్న వారిపై ఈ స్టేషన్ లో కేసులు నమోదవుతాయి. విచారణ జరుగుతుంది. ఈ వ్యవస్థ కోసం ఈ సంవత్సర బడ్జెట్ లో 200 కోట్లు కేటాయించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో అక్కడక్కడా కొన్ని అక్రమ కట్టడాల కూల్చి వేతలు జరుగుతున్నాయి. కొన్ని అక్రమ కట్టడాలకు నోటీసులు ఇచ్చారు. గత పదేళ్ళ కాలంలో విచ్చలవిడిగా సాగిన అక్రమ కట్టడాలకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అవసరమే . కానీ ఈసందర్భంగా ప్రభుత్వం విచక్షణ పాటించాల్సిన అవసరముంది.

అక్రమాలకు పాల్పడి, అధికారులకు లంచాలు మేపి , ప్రభుత్వ భూములను, చెరువులను, నాలాలను ఆక్రమించిన బడా బాబుల పట్ల ( వాళ్ళు ఏ పార్టీ వాళ్లయినా) ప్రభుత్వం కటినంగా వ్యవహరించి కేసులు నమోదు చేయాలి. అక్రమ కట్టడాలను కూలగొట్టాలి.

కొన్ని సందర్భాలలో రియల్ ఎస్టేట్ యజమానులు, కంపెనీలు, బిల్డర్లు ఇలా ఆక్రమంచిన స్థలాలలో వెంచర్లు వేసి, మధ్యతరగతి కుటుంబాలకు అమ్మారు. అక్కడ భవంతులు కట్టడానికి అధికారులు పర్మిషన్ లు ఇచ్చారు. సబ్ రిజిస్ట్రార్ లు రిజిస్ట్రేషన్ లు చేశారు. ఆయా స్థలాలలో, ముఖ్యంగా చెరువు శిఖం భూములలో ఉన్నవి కూడా నిజానికి అక్రమ కట్టడాలే. వాటిని కూడా తొలగిస్తే మాత్రమే నీటి ప్రవాహానికి దారి ఏర్పడుతుంది. చెరువులు పునరుద్ధరణ అవుతాయి.

కానీ అకస్మాత్తుగా తొలగిస్తే అక్కడ ఇల్లు కొనుక్కున్న మధ్యతరగతి కుటుంబాలు నష్టపోతాయి . కాబట్టి సుప్రీం కోర్టు కొన్ని కేసులలో ఇచ్చిన తీర్పులను దృషిలో ఉంచుకుని అక్రమ కట్టడాలు నిర్మించిన యాజమానుల నుండీ ( బిల్డర్ లు) వాటిని కొనుగోలు చేసిన ఇళ్ల యజమానులకు నష్ట పరిహారం ఇప్పించాలి. ప్రభుత్వ ఖజానాపై ఆ భారం వేసుకోకూడదు. తప్పుడు పద్ధతిలో లంచాలు తీసుకుని అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు నమోదు చేసి శిక్షించాలి.

కొన్ని సందర్భాలలో నాలాలను ఆక్రమించి పేదలు గుడిసెలు, చిన్న ఇల్లు నిర్మించుకున్నారు. నాలాలను కూడా తప్పకుండా పునరుద్ధరించాలి.

కానీ, వాటిపై నివాసాలను ఏర్పాటు చేసుకున్న పేదలకు సమీపంలోనే ప్రత్యామ్నాయ ఇంటి స్థలాలు చూపించి, ప్రభుత్యమే ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు పథకం క్రింద ఇల్లు నిర్మించి ఇవ్వాలి. వాళ్ళను నగరాల బయటకు తరలించి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రభుత్వ ఆలోచన సరి కాదు. వారి జీవనోపాధులు నగరం తో ముడిపడి ఉంటాయి. నగరాల అభివృద్ధిలో వారు కీలక భూమిక పోషిస్తారు. వారికి నగరాల మధ్యలో గౌరవంగా జీవించే హక్కు ఉంది. దానిని ప్రభుత్వం గుర్తించాలి. రానున్న రోజుల్లో హైడ్రా సంస్థ బడా బాబుల పట్ల మెతకగానూ, పేదల పట్ల కటువుగానూ వ్యవహరించకుండా ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయాలి. ఆక్రమణలను అడ్డుకునే పేరిట అన్ని చోట్లా ఒకే దూకుడు వైఖరి సరికాదు.

జనవాడ లో ఫార్మ్ హౌజ్ నిర్మించుకున్నKTR తప్పు చేసి ఉంటే, ప్రభుత్వ , హైడ్రా నిబంధనల ప్రకారం కటినంగా వ్యవహరించాలి. కానీ మూసీ నాలాల పైనో, మూసీ చుట్టూనో దశాబ్ధాలుగా ఇళ్ళు నిర్మించుకుని ఉంటున్న పేదలతో వ్యవహరించడానికి ప్రభుత్వం ఒక కమిషన్ వేయాలి. అక్కడ పని చేస్తున్న ప్రజా సంఘాలతో ఆ కమిషన్ చర్చించాలి. మూసీ ప్రక్షాళన అవసరమే కానీ, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే అది జరగాలి. ముందుగా స్థానికంగానే ప్రజలకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించిన తరువాత మాత్రమే మూసీ చుట్టూ ఉన్న పేదల బస్తీ లను ఖాళీ చేయించడానికి పూనుకోవాలి. ఎలాటి ప్రత్యామ్నాయం చూపకుండా, అడ్డగోలుగా ఇళ్లను, బస్తీలను కూలగొడతామంటే అది ప్రజలకు అన్యాయం చేయడమే అవుతుంది.

రీజనల్ రింగ్ రోడ్డు వ్యవహారంలో కూడా భూసేకరణకు ప్రభుత్వం పరుగులు పెడుతున్నది. కానీ స్థానిక రైతుల భూములకు పరిహారం విషయంలో ఇంతవరకూ ఒక స్పష్టమైన ప్రకటన ,జీవో ప్రభుత్వం విడుదల చేయలేదు. గతంలో ఇలాగే ఔటర్ రింగ్ రోడ్డు కోసం, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో, రైతుల నుండీ భూములు లాక్కున్నారు. సరైన పరిహారం చెల్లించలేదు. ఇప్పుడు మళ్ళీ అదే వైఖరితో ప్రభుత్వం వ్యహరిస్తే , గత ప్రభుత్వాలకూ ఈ ప్రభుత్వానికీ పెద్ద తేడా ఏమీ ఉండదు.

అసలు ఈ రీజనల్ రింగ్ రోడ్డు కార్పొరేట్ కంపెనీల సరుకుల రవాణాకు, రియల్ ఎస్టేట్ యాజమనుల లాభాపేక్షకు, కాంట్రాక్టర్ల లాభాల యావకు, , ఉన్న కొద్దిపాటి సాగు భూములను కూడా మళ్లించడానికి తప్ప, రాష్ట్ర ప్రజలకు ఎందుకూ పనికి రాదు. కానీ ప్రస్తుత ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఇప్పుడు ఇది ముందు వరసలో ఉంది. ఎలాగైనా వేగంగా ఈ రింగు రోడ్డును పూర్తి చేయాలనే దూకుడుగా ముందుకు వెళుతున్నది. కాబట్టి, ప్రభుత్వం రైతులకు తగిన నష్ట పరిహారం చెల్లించే వరకూ ఆయా ప్రాంతాల రైతులు పోరాడాలి. బీజేపీ , బీ ఆర్ ఎస్ లాంటి పార్టీలు ఇలాంటి సమయంలో ప్రజలకు అండగా ఉండవు. వారి అభివృద్ధి నమూనా కూడా ఇదే. ఇలాంటి సమయంలో ప్రజలకు సామాజిక కార్యకర్తలు, సంస్థలు అండగా నిలబడాలి.

కన్నెగంటి రవి, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TPJAC)

Tags:    

Similar News