రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి పురస్కారం..
అధికారంలోకి రాగానే అని చెప్పి.. 20 నెలల తర్వాత నజరానా అందించిన సీఎం రేవంత్.;
టాలీవుడ్ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌కు తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి.. కోటి రూపాయాల నజరానా ప్రకటించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు పాతబస్తీ బోనాల సందర్భంగా రూ.కోటి నజరానాను రేవంత్ ప్రకటించారు. స్వయం కృషితో ఎదిగిన రాహుల్.. నేటి యువతకు ఎంతో ఆదర్శమని అన్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు లభించింది. ఆ పాటను ఆలపించిన గాయకుల్లో రాహుల్ సిప్లిగంజ్ కూడా ఒకడు. ఈ నేపథ్యంలోనే 2023లోనే రాహుల్‌కు రేవంత్ రూ.10 లక్షల బహుమతి ఇచ్చారు. అప్పుడే తాము అధికారంలోకి వస్తేమాత్రం.. అధికారం వచ్చిన వెంటనే కోటి రూపాయల నజరానా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని రేవంత్ ఇప్పుడు నెరవేర్చారు.
అధికారంలోకి రాగానే అన్నారు..?
అయితే ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఒక క్యాంపెయిన్ బాగా జరుగుతోంది. 12 మే 2023న బోయిన్‌పల్లిలో జరిగిన రాజీవ్ గాంధీ యూత్ ఆన్‌లైన్ క్విజ్ కాంపిటీషన్‌కు రాహుల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ కూడా వచ్చారు. అప్పుడే రాహుల్‌కు రూ.10 లక్షల బహుమతి అందించి.. అధికారంలోకి రాగానే రూ.కోటి బహుమతి అందిస్తామని చెప్పారు. అదే విధంగా 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కానీ ఇప్పటి వరకు రాహుల్‌కు ఎటువంటి బహుమతి, నజరానా అందలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల తర్వాత బోనాల పండగ సందర్భంగా తన హామీని రేవంత్ నెరవేర్చారు. దీంతో ఇన్నాళ్లూ రేవంత్‌కు తన హామీ గుర్తు లేదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లూ ఎందుకు రాహుల్‌కు నజరానా ఇవ్వలేక పోయారా చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
గుర్తులేక కాదు.. ఖజానా లేక..
రాహుల్‌కు రేవంత్..రూ.కోటి బహుమతి ఇవ్వడంలో ఆలస్యంపై జరుగుతున్న చర్చపై రేవంత్ మద్దతుదారులు ఘాటుగా స్పందిస్తున్నారు. రాహుల్‌కు ఇచ్చిన మాటను రేవంత్ మర్చిపోలేదని, నిర్లక్ష్యం అంతకన్నా చేయలేదని అన్నారు. అయితే.. రాష్ట్రంలో పథకాల అమలుకు, అభివృద్ధి పనులు చేయడానికే సరిపడా ఖజానా లేదని, గత ప్రభుత్వం తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టడానికి రాష్ట్ర ఆదాయం ఆవిరవుతుండటంతోనే కాస్తంత ఆలస్యం అయిందని చెప్తున్నారు. రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి గాడిన పెట్టి.. ఆదాయం పెంచుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు రాహుల్‌కు చెప్పిన నజరానా అందించారని పేర్కొంటున్నారు.