Dil Raju | దిల్ రాజుకు కీలక పదవి.. తెలంగాణ సర్కార్ ఆలోచనేంటో..?
దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వ కీలక పదవి ఎందుకు కట్టబెట్టింది? నిజంగా సినీ ఇండస్ట్రీ అభివృద్ధికేనా? లేక వేరే కారణం ఏదైనా ఉందా?;
దిల్ రాజు(Dil Raju).. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. హీరో, విలన్ కాదు కదా.. కనీసం నటుడు కూడా కాకపోయినా.. అందరికీ సుపరిచితమైన పేరు ఇది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలకు ఈయనే నిర్మాత కావడం ఇందుకు ప్రధాన కారణం. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారంటేనే ఆ సినిమా హిట్ అయినట్లే అన్న టాక్ వినిపిస్తుంది. సినిమాలను నిర్మించే విషయంలో దిల్ రాజు చాలా జాగ్రత్త వహిస్తారని సన్నిహితులు చెప్పే మాట. అయితే ఇన్నాళ్లూ ఆయన సేవలను తన సినిమాలకు, కొద్దిగా ఇతర సినిమాలకే అందాయి. అయితే దీనిని మరో అడుగు ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకోసమే ఆయనకు కీలక పదవిని కట్టబెట్టింది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్(TSFDC) ఛైర్మన్ పదవికి దిల్ రాజును నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులను తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి విడుదల చేశారు. ఈ పదవిలో దిల్ రాజు రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ఈ అంశం ప్రస్తుతం ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. అందుకూ బలమైన కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండబట్టే దిల్ రాజుకు ఈ పదవి వచ్చిందన్న టాక్ కూడా వినిపిస్తోంది.
అందుకే పదవి ఇచ్చారా..
అయితే గతంలో కాంగ్రెస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో తలపడటానికి దిల్ రాజు సన్నాహాలు చేశారు. కాకపోతే అప్పటి రాజకీయ సమీకరణాలు ఆయన పోటీకి ఏమాత్రం అనుకూలించలేదు. దాంతో తన ప్రయత్నాలను విరమించుకున్నారు దిల్ రాజు. కానీ కాంగ్రెస్ పార్టీతో మాత్రం ఆయన మంచి సంబంధాలే ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగుతున్న క్రమంలో అప్పుడు ఇవ్వలేకపోయిన ఎంపీ టికెట్‌కు బదులుగానే తెలంగాణ స్టేల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరెషన్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టిందీ ప్రభుత్వం అన్న చర్చ కూడా మొదలైంది. దాంతో పాటుగానే దిల్ రాజుకు మరిన్ని రాజకీయ మార్గాలను తెరవడం కోసమే ఈనిర్ణయం తీసుకందని కూడా చర్చ సాగుతోంది.
ఇప్పటికే కీలక సభ్యుడు..
ప్రొడ్యూసర్స్ గిల్డ్‌లో దిల్ రాజు ఇప్పటికే కీలక సభ్యుడిగా ఉన్నారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వ సంబంధాల వారధిగా దిల్ రాజు ఎంతో చురుకుగా పనిచేస్తున్నారు. తన పనితీరుతో తనపై ప్రభుత్వ నమ్మకాన్ని పెంపొందించుకున్నారు. ఇప్పుడు టీఎస్ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా మారడంతో ఆయనకు, ప్రభుత్వానికి మధ్య బంధం మరింత బలపడిందని టాక్ వినిపిస్తోంది. ఈ పదవిని అందించిన సందర్బంగానే దిల్ రాజు.. అతి త్వరలోనే రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలవనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ.. కేవలం అభినందనలకే పరిమితం అవుతుందా లేక సినీ పరిశ్రమకు సంబంధించి పలు అంశాలపై చర్చకు వేదిక కానుందా? అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
అయితే ప్రస్తుతం దిల్ రాజు.. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోతా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో పాటుగా వెంకటేష్ నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను కూడా దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీ కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 14న విడుదల కానుంది. వీటితో పాటు పలు ఇతర సినిమాలకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.