ట్యాంక్‌బండ్‌పై రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ప్రారంభమైన ర్యాలీ రాష్ట్ర సచివాలయం జంక్షన్‌ మీదుగా సైనిక ట్యాంక్‌ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా వారు భారత్‌ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు.;

Update: 2025-05-17 15:17 GMT

పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సందూర్’కు దేశమంతా సెల్యూట్ చేస్తోంది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఆపరేషన్ చేసిన భద్రతా బలగాలకు పూర్తి మద్దతు పలుకుతున్నాయి. భారత ఐక్యతను చాటేలా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ర్యాలీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం శనివారం.. తిరంగా ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో డాక్టర్లు, న్యాయవాదులు, టీచర్లు, కరాటే విద్యార్థులు, NCC క్యాడేట్స్, ఆర్మీ వెటరన్స్, మహిళా సంఘాలు, బ్రాహ్మ్మ కుమారీస్, నగరంలో వివిధ పాఠశాలల విద్యార్థులు పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్‌మీద మువ్వన్నెల జెండాల రెపరెపలాడాయి. హైదరాబాద్ ట్యాంక్‌ బండ్‌ రోడ్డులో చేసిన ఈ ర్యాలీలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌ రావుతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ప్రారంభమైన ర్యాలీ రాష్ట్ర సచివాలయం జంక్షన్‌ మీదుగా సైనిక ట్యాంక్‌ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా వారు భారత్‌ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు. ‘‘మనది శాంతి కోరుకునే దేశం. భారత్ ఎప్పుడూ కూడా ఏ దేశంపైన కూడా దాడులు చేయడం, యుద్ధం చేయడం చేయలేదు. ఎప్పుడూ శాంతి మార్గంలో వెళ్ళాలనే భావిస్తుంది. కానీ మనపై దాడి చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని మన భద్రతా బలగాలు ఘాటు సమాధానం ఇచ్చాయి. ఉద్రిక్తతల వేళ మోదీ ప్రదర్శించిన సమయస్ఫూర్తిని మెచ్చుకోవాల్సిందే. దేశ అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లితే ప్రజలంగా కుల, మత, భాష, ప్రాంతాలకు అతీతంగా ఉండాలి’’ అని వెంకయ్య నాయుడు కోరారు.

Tags:    

Similar News