పెద్దల జోలికి వెళ్లి చెప్పండి.. హైడ్రాకు హైకోర్టు చురకలు

సంస్థ టార్గెట్‌ పేద, మధ్య తరగతి మాత్రమేనా? ప్రముఖులకు ఈ రాష్ట్రంలో ప్రత్యేక చట్టం ఉందా? అని న్యాయస్థానం ప్రశ్నించింది.;

Update: 2025-03-19 16:06 GMT

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సంస్థ హైడ్రా. గ్రేటర్ పరిధిలోని చెరువులను రక్షించడంతో పాటు ఆక్రమణలకు చెల్లుచీటి పలకడమే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తోంది. ప్రతి సోమవారం నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తూ వారి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటుంది. కాగా హైడ్రా తన కూల్చివేతలను శని, ఆదివారాల్లో చేపట్టడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. హైడ్రాకు మొట్టికాయలు కూడా వేసింది. కాగా తాగాజా హైడ్రాపై హైకోర్టు మరోసారి ఘాటుగా వ్యాఖ్యానించింది. పేదోళ్లను వదిలి ఆక్రమణలకు పాల్పడిన పెద్దోల జోలికి వెళ్లి చెప్పండంటూ చురకలంటించింది. హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీస్తోంది.

‘‘సంస్థ టార్గెట్‌ పేద, మధ్య తరగతి మాత్రమేనా? ప్రముఖులకు ఈ రాష్ట్రంలో ప్రత్యేక చట్టం ఉందా? మియాపూర్‌, దుర్గం చెరువు ఆక్రమణ పరిస్థితి ఏంటీ? అందరికీ ఒకేలా న్యాయం జరిగితేనే హైడ్రా ఏర్పాటుకు సార్థకత. హైడ్రా పనితీరు అశాజనకంగా లేదు. ‘మీరాలం’పై ఉమ్మడి సర్వే చేపట్టాలి’’ అని సూచించింది. కాగా తహసీల్దార్‌ నోటీసులను సవాల్‌ చేస్తూ ఫాతిమా అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది న్యాయస్థానం. ఈ సందర్భంగానే హైడ్రాపై ఘాటు వ్యాఖ్యలు చేసింది.

అయితే హైడ్రాపై ఇది వరకు కూడా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీకెండ్ డేస్‌లో కూల్చివేతలు చేపట్టడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. తన ఆస్తులను అక్రమంగా కూల్చివేశారంటూ అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడ గ్రామానికి చెందిన సామ్రెడ్డి బాల్ రెడ్డి అనే వ్యక్తి.. హైకోర్టులో ఫిబ్రవరి 9న హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేసిన జస్టిస్ కె.లక్ష్మణ్.. సెలవు దినాల్లో కూల్చివేతలు చేపడితే కఠిన చర్యలు తప్పవంటూ హైడ్రాకు హెచ్చరిక జారీ చేశారు. ‘‘ఎన్నిసార్లు చెప్పినా మారరా! శుక్రవారం నోటీసులు ఇచ్చి ఆదివారం కూల్చివేయడం ఏంటి.. ఒక్క రోజులో పత్రాలు సమర్పించడం ఎలా సాధ్యం’’ అని ప్రశ్నించింది న్యాయస్థానం.

Tags:    

Similar News