లగచర్ల భూసేకరణకు హైకోర్టు బ్రేకులు
తక్షణమే ఈ భూసేకరణ ఆపేయాలని ఆదేశించింది న్యాయస్థానం.;
వికారాబాద్ జిల్లా లగచర్ల మండల పరిధిలోని 8 ఎకరాల భూసేకరణపై హైకోర్టు స్టే విధించింది. వికారాబాద్ జిల్లా దుండిగల్ మండలం హకీంపేట.. లగచర్ల పరిధిలో ఎనిమిది ఎకరాల భూమి సేకరణకు ప్రభుత్వం నిశ్చయించింది. కాగా ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హకీంపేట రైతులు.. హైకోర్టును ఆశ్రయించారు. ఇద్దరు రైతులు వేసిన పిటిషన్ విచారణ నేపథ్యంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఈ భూసేకరణ ఆపేయాలని ఆదేశించింది న్యాయస్థానం. అనంతరం ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఏప్రిల్ 7కి వాయిదా వేసింది.
భూసేకరణకు సంబంధించి గతేడాది నవంబర్ 29న ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండస్ట్రియల్ పార్కు ఈ భూసేకరణ చేపట్టింది సర్కార్. హకీంపేట గ్రామంలో 351 ఎకరాల సేకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ రైతులు పిటీషన్ దాఖలు చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించడంలేదని పిటీషనర్ వాదించారు. నోటిఫికేషన్‌ను రద్ద చేయాలని కోరారు. అప్పటి వరకు నోటిఫికేషన్‌పై స్టే విధించాలని పిటీషన్లో అభ్యర్థించారు. ఈ పిటీషన్‌పై జస్టిస్ జె.శ్రీనివాస్ రావు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే హకీంపేట భూసేకరణపై స్టే విధించారు. నోటిఫికేషన్ ను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, టీఎస్ఐఐసీ ఎండీకి నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం.