తెలంగాణ అడవుల్లో పులుల ప్రణయ ఘట్టం ముగిసింది...

త్వరలో వన్యప్రాణుల సంఖ్య పెరుగుతుందా?

Update: 2025-09-29 07:30 GMT
అభయారణ్యంలో సంచరిస్తున్న పులులు (ఫొటో క్రెడిట్:అటవీశాఖ కెమెరాట్రాప్ చిత్రం)

తెలంగాణ రాష్ట్రంలోని అమ్రాబాద్, కవ్వాల్ పులుల అభయారణ్యాల్లో పులులు, ఇతర వన్యప్రాణులకు మూడు నెలల శృంగార సమయం సెప్టెంబరు 30వతేదీతో ముగియనుంది. ఈ ఏడాది వర్షాకాలంలో జులై 1వతేదీ నుంచి మేటింగ్ సీజన్ కోసం అభయారణ్యాల్లో సపారీ యాత్రలను నిలిపివేశారు. పులులు, ఇతర వన్యప్రాణుల శృంగార సమయానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా సఫారీ యాత్రల పేరిట అడవుల్లోకి జన సంచారం లేకుండా అటవీశాఖ నిషేధించింది. మూడు నెలల విరామం తర్వాత అక్టోబరు 1వతేదీన అడవుల్లో విధించిన ఆంక్షలను అటవీశాఖ ఎత్తివేయనుంది.




 తెరచుకోనున్న సపారీల గేట్లు

పులులే కాదు ఇతర వన్యప్రాణుల మేటింగ్ సీజన్ ముగియడంతో అక్టోబరు 1వతేదీ నుంచి సఫారీల సందర్శనకు అటవీశాఖ గేట్లు తెరిచింది. అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోని ఫరాబాద్, గుండం, అక్కమహాదేవి, కవ్వాల్ పులుల అభయారణ్యంలోని జన్నారం, మంచిర్యాల్ జిల్లాలోని హాజిపూర్ మండలం ర్యాలీ గాద్పూర్ గ్రామంలో కొత్త జంగిల్ సఫారీల గేట్లు సందర్శకుల కోసం తెరచుకోనున్నాయి.తెలంగాణలో అయిదు జంగిల్ సఫారీ యాత్రలు ఆరంభం కానున్న నేపథ్యంలో వీటిలో పాల్గొనేందుకు వన్యప్రాణిప్రియులు, సందర్శకులు సమాయత్తం అవుతున్నారు. కవ్వాల్ పులుల అభయారణ్యంలో ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా మంచిర్యాల్ జిల్లాలోని హాజిపూర్ మండలం ర్యాలీ గాద్పూర్ గ్రామంలో కొత్త జంగిల్ సఫారీని గత ఏడాది ప్రారంభించారు.



 పులుల మేటింగ్ తో...

పులుల మేటింగ్ సీజను ముగియడంతో పులులు కూనలకు త్వరలో జన్మనివ్వనున్నాయని అమ్రాబాద్ డీఎఫ్ఓ గోపిడి రోహిత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పులుల కదలికలు, మేటింగ్ సీజన్ లో కలిసిన వైనాలపై కెమెరా ట్రాప్ లద్వారా తాము సమాచారాన్ని సేకరించామని ఆయన తెలిపారు. పులులే కాదు జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో జింకలు ఇతర వన్యప్రాణులు కలుస్తుంటాయని, దీనివల్ల మరో నెలా రెండు నెలల్లోనే పులులు కూనలకు జన్మనివ్వనున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎన్ని ఆడ పులులు ఎన్ని కూనలకు జన్మనిస్తాయన్నది మరో నెలరోజుల్లో వెల్లడవుతుందని ఆయన చెప్పారు. ఈ ఏడాది మేటింగ్ సీజన్ తర్వాత అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో పులుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన వివరించారు.



 108 రోజుల్లోనే పులి కూనలకు జననం

జులై నుంచి సెప్టెంబరు వరకు పులులు ఏకాంతంగా గడిపి గర్భం దాల్చిన ఆడ పులులు కేవలం 103 నుంచి 108 రోజుల్లోనే పులి కూనలకు జన్మనిస్తుంటాయని హైదరాబాద్ నెహ్రూ జూపార్కు వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్ హకీం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబరు 30వతేదీతో పులుల మేటింగ్ సీజన్ ముగిసిందని ఇక పులి కూనల జననమే మిగిలిందని ఆయన చెప్పారు. పులుల మచ్చలను బట్టి కెమెరా ట్రాప్ చిత్రాలు చూసి ఏ ఏ పులులు మేటింగ్ అయ్యాయో తెలుస్తుందని చెప్పారు.

ఏడాదిన్నరపాటు తల్లి వెంటే పులికూనలు
పులికి కూనలు జన్మించాక అవి ఆరు నెలల పాటు పాలు తాగుతూ తల్లివెంట ఉంటాయి. ఆరు నెలల తర్వాత పులి పిల్లలకు జంతువులను సొంతంగా వేటాడటాన్ని తల్లి పులి నేర్పిస్తుందని అలా ఏడాదిన్నర కాలం పాటు తల్లి వెంట ఉండి వేట నేర్చుకొని పులి పిల్లలు అడవిలో మరో ప్రాంతాన్ని ఎంచుకొని వెళుతుంటాయని వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్ హకీం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.ఒక్కో పులి సంచరించేందుకు వీలుగా 25 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలోని అటవీ ప్రాంతాన్ని తన టెరిటరీగా ఎంచుకొని, దానిలోకి ఇతర పులులు రాకుండా తన టెరిటరీలో చెట్లను గీకి, మూత్రం పోసి సరిహద్దును సిద్ధం చేసుకుంటాయని వెటర్నరీ డాక్టర్ చెప్పారు.



 మహారాష్ట్ర పులులు కవ్వాల్ లోకి వచ్చాయి...

సరిహద్దు రాష్ట్రం అయిన మహారాష్ట్ర పులుల అభయారణ్యాల నుంచి రెండు ఆడపులులు తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లోకి ప్రవేశించాయి.తిప్పేశ్వర్, తాడోబా అభయారణ్యాల నుంచి రెండు ఆడ పులులు కవ్వాల్ పులుల అభయారణ్యంలోకి వచ్చాయని తమ కెమెరా ట్రాప్ చిత్రాలు, వీడియోల ద్వారా తేలిందని కవ్వాల పులుల అభయారణ్యం అటవీశాఖ టాస్క్ ఫోర్స్ అధికారి కారం శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మహారాష్ట్ర పులులు లక్సెట్టిపేట, బెల్లంపల్లి అడవుల్లో సంచరిస్తున్నట్లు వెల్లడైందని ఆయన తెలిపారు. మేటింగ్ సీజనులో మహారాష్ట్ర నుంచి పులులు మగ తోడు కోసం వచ్చాయని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణలోకి మహారాష్ట్ర పులి వలస
మహారాష్ట్ర నుంచి వచ్చిన ఆడ పులి కవ్వాల్ టైగర్ రిజర్వ్ (KTR),లక్సెట్టిపేట్ రేంజ్ మధ్య సంచరిస్తుందని అటవీశాఖ అధికారులు కెమెరా ట్రాప్ చిత్రాల ద్వారా గుర్తించారు. కొన్ని నెలల క్రితం మహారాష్ట్ర నుంచి తెలంగాణలోని కవ్వాల్ కు వలస వచ్చిన ఈ పెద్ద పులి కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాను దాటి లక్సెట్టిపేట్ అడవుల్లో స్థిరపడింది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌ల ద్వారా దాని కదలికలను ట్రాక్ చేస్తున్నారు. ఈ పులి క్రమం తప్పకుండా పశువులను వేటాడుతోందని అటవీశాఖ అధికారులు చెప్పారు.



 అయిదు పులులివ్వండి : మహారాష్ట్రాకు తెలంగాణ ప్రతిపాదనలు

2012వ సంవత్సరంలో కవ్వాల్ ను టైగర్ రిజర్వ్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కవాల్ కోర్ జోన్ 893 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.కవ్వాల అభయారణ్యం పరిధిలో ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల్ జిల్లాలలో 1,120 చదరపు కిలోమీటర్ల బఫర్ జోన్ ఉంది. కవ్వాల్ అభయారణ్యంలో పులులు లేకపోవడంతో మహారాష్ట్రలోని తాడోబా-అంథేరి టైగర్ రిజర్వ్ నుంచి అయిదు పులులను తరలించాలని తెలంగాణ అటవీ శాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించి మహారాష్ట్ర ఆమోదానికి పంపించారు. ఈ ఏడాది జూన్‌ నెలలో జాతీయ పులుల సంరక్షణ అథారిటీ (NTCA) నుంచి మహారాష్ట్ర పులులను తీసుకువచ్చేందుకు అనుమతి కోరుతూ ప్రతిపాదన సమర్పించారు.

అభయారణ్యాల్లో సఫారీ రైడ్ లకు స్వాగతం
పులుల మేటింగ్ సీజన్ ముగియడంతో పులుల అభయారణ్యాల్లోని సఫారీ యాత్రలకు తెలంగాణ అటవీ శాఖ స్వాగతం పలికింది. మూడు నెలల ఆంక్షల తర్వాత సఫారీ రైడ్ కు సందర్శకులను అటవీశాఖ ఆహ్వానించింది. అమ్రాబాద్ అడవుల్లో పులుల సంచారం, చెంగుచెంగున పరుగులీడుతున్న జింకలు, పచ్చని ఎత్తైన చెట్లు చూడాలనుకుంటే సఫారీ యాత్రకు రావాలని అమ్రాబాద్ డీఎఫ్ఓ గోపిడి రోహిత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు కోరారు.

జన్నారం జంగిల్ సఫారీ
కవ్వాల్ అభయారణ్యంలోని జన్నారం జంగిల్ సఫారీ ఎతైన పచ్చని చెట్లు, వన్యప్రాణులతో ప్రకృతి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జన్నారంలోని జంగిల్ సఫారీలో సందర్శించాలంటే ఆరుగురికి రూ.3,500రూపాయలు చార్జీగా అటవీశాఖ నిర్ణయించింది. అదే వీకెండ్స్ లో అయితే రూ.4వేలు చార్జి చేస్తారు.రోజుకు మూడు విడతలుగా సందర్శకులను సఫారీ సందర్శనకు తీసుకువెళతారు. ఈ సఫారీ సందర్శనకు ఉదయం 6.30 నుంచి 8.30 గంటల వరకు, 9.30 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 3.30 నుంచి 5.30 గంటల వరకు వేళలను నిర్ణయించారు. కవ్వాల అడవిలో ఫారెస్టు జీపులో తిరుగుతూ వన్యప్రాణులను వీక్షించవచ్చు.



 మన్ననూర్ జంగిల్ సఫారీ రైడ్

దట్టమైన అమ్రాబాద్ అడవిలో విహరిస్తూ వన్యప్రాణులను తిలకించడానికి మన్ననూర్ జంగిల్ సఫారీ రైడ్ ను తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసింది. పచ్చని ఎతైన చెట్లు, గుట్టలు, లోయలతో పాటు చెంగుచెంగున దూకుతూ పరుగెత్తె జింకలు, వాటిని వేటాడే చిరుతపులులు, పులులు, ఇతర వన్యప్రాణులను చూడొచ్చు. ఫారెస్ట్ గైడ్స్ వెంట రాగా సఫారీ యాత్ర సాగుతోంది. ప్రకృతి ఒడిలో మన్ననూర్ లో నిర్మించిన జంగిల్ రిసార్టులోని గదుల్లో ఒక రోజు బస చేయవచ్చు. మధ్యాహ్నం 1230 గంటలకు మొదలయ్యే ఈ ప్యాకేజీలో లంచ్, హై టీ, డిన్నర్, సఫారీ యాత్ర, ట్రెక్కింగ్ తో రెండో రోజు 10.30 గంటలకు ముగుస్తుంది.

దోమలపెంట అక్కమహాదేవి బస
అక్టోపస్ వ్యూ పాయింట్ కు అక్కమహాదేవి సఫారీ యాత్ర ఉత్కంఠ భరితంగా సాగుతుంది. కృష్ణా నదీ తీరాన ప్రకృతి అందాలను తిలకించే ఈ యాత్ర సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుంది. వన్యప్రాణులను చూస్తూ సాగే ఈ యాత్ర ట్రెకింగ్, గుహల సందర్శన ఉంటాయి. వనవిహంగ కాటేజీలో బస చేయవచ్చు.

ముచ్చర్లలో మరో జూపార్కు
హైదరాబాద్ నగరంలోని ముచ్చర్లలో మరో జూపార్కు త్వరలో సందర్శకులకు అందుబాటులోకి రానుంది. ముచ్చర్లలోని 203.83 ఎకరాల్లో అత్యాధునిక నైట్ సఫారీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాత్రివేళ జంతువులును చూసి వర్చువల్ రియాలిటీ అనుభవాలను సొంతం చేసుకునేలా ఈ జూపార్కును ఏర్పాటు చేయాలని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశంతో ఫ్యూచర్ సిటీ అయిన ఫోర్తె సిటీలో పిల్లల్ని ఆకట్టుకునేందుకు డైనోసార్ పార్క్, యువత కోసం అడ్వెంచర్ పార్కు ఏర్పాటు చేయనున్నామని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు మేనేజర్ కళ్యాణపు సుమన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. విదేశీ జంతువులు జిరాఫీలు, జిబ్రాలు ఇతర జంతువుల సంచారాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చని జంతువుల మధ్య తిరుగుతున్నట్లు వర్చువల్ రియాలిటీ అనుభూతిని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.


Tags:    

Similar News