కాగితాల్లోనే తెలంగాణ పోలీసు భద్రతా కమిషన్
తెలంగాణలో పోలీసు భద్రతా కమిషన్ ఏర్పాటు కాగితాలకే పరిమితమైంది. సుప్రీం ఆదేశాల ప్రకారం భద్రతా కమిషన్, పోలీసు కంప్లయింట్ అథారిటీలను నియమించలేదు...
By : The Federal
Update: 2024-04-08 16:02 GMT
తెలంగాణలో భద్రతా కమిషన్ ఏర్పాటు చేయక పోవడంతో రాష్ట్ర హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ జరపాలని నిర్ణయించింది. దీనిపై 2021 జులై 9వతేదీన హైకోర్టు విచారణ జరగాల్సి ఉండగా, దీనికి రెండు రోజుల ముందు అప్పటి కేసీఆర్ సర్కారు ఆదరాబాదరాగా 2021 జులై 7వతేదీన భద్రతా కమిషన్ ను ఏర్పాటు చేశారు.దీంతో హైకోర్టు నాటి కేసు విచారణను మూసేసింది. నాడు హైకోర్టును సంతృప్తి పర్చడానికి తప్ప భద్రతా కమిషన్ ఏర్పాటు చేసినా అది క్రియాశీలకంగా పనిచేయడం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల కనుగుణంగా పోలీసు శాఖలో సంస్కరణలను తెలంగాణ సర్కారు తీసుకురాక పోవడంతో పోలీసు వ్యవస్థ పనితీరు అధ్వానంగా మారి, ఫోన్ ట్యాపింగ్ కు తెర లేచింది.
పోలీసు భద్రతా కమిషన్ అంటే ఏమిటి?
పోలీసు వ్యవస్థపై రాజకీయ ఒత్తిడి, ఆధిపత్యం లేకుండా పనిచేసేందుకు రాష్ట్ర పోలీసు భద్రతా కమిషన్ మార్గదర్శకం చేయనుంది. రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పనిచేసేలా ఈ కమిషన్ ను ఏర్పాటు చేయాలని సాక్షాత్తూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కమిషన్ లో ముగ్గురు సభ్యులు ఉంటారు. రాజకీయాలకు సంబంధం లేకుండా రిటైర్డు లేదా పనిచేస్తున్న న్యాయమార్తి, సమాజంలో పేరున్న ముగ్గురు వ్యక్తులతో కూడిన భద్రతా కమిషన్ ను ఏర్పాటు చేయాలని సుప్రీం సూచించింది. ఈ భద్రతా కమిషన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా హోంశాఖ మంత్రి అధ్యక్షుడిగా డీజీపీ కార్యదర్శిగా శాసనసభలో విపక్షనేత, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచించిన వారితో ఈ కమిషన్ నియమించాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాల్లో సూచించింది.
పోలీసు కంప్లయింట్ అథారిటీ నియామకం ఏది?
జిల్లా స్థాయిలో కానిస్టేబుల్ నుంచి డీఎస్పీల దాకా వారిపై వచ్చే అవినీతి, అభియోగాలపై కంప్లయింట్ అథారిటీని నియమించాలని సుప్రీంకోర్టు సూచించింది. రాష్ట్ర స్థాయి అథారిటీ ఎస్పీ, పోలీసు ఉన్నతాధికారులపై వచ్చే ఫిర్యాదులను రాష్ట్ర స్థాయి అథారిటీ విచారించాల్సి ఉంది. అలాగే రాష్ట్ర స్థాయి అథారిటీ ఎస్పీ, పోలీసు ఉన్నతాధికారులపై వచ్చే ఫిర్యాదులను విచారించనుంది. జిల్లాస్థాయి అథారిటీలో పదవీ విరమణ చేసిన జిల్లా జడ్జీని అధిపతిగా, రాష్ట్ర స్థాయి ఫిర్యాదుల అథారిటీకి రిటైర్డు లేదా పనిచేస్తున్న హైకోర్టు జడ్జీ ఇన్ చార్జీగా ఉంటారు. ఈ అథారిటీలకు సహాయం చేయడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచించిన రాజకీయాలకు సంబంధం లేని ఐదుగురు సభ్యులను నియమిస్తారు. రాష్ట్ర స్థాయి అథారిటీ తీవ్రమైన నేరారోపణలపై విచారణ జరపనుంది. జిల్లాల్లో పోలీసు అధికారుల బలవంతపు వసూళ్లు, అవినీతిపై, అధికార దుర్వినియోగంపై జిల్లా స్థాయి అథారిటీ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. అలా అథారిటీ పంపించే నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది.
కేసీఆర్ పాలనలో ఏం జరిగిందంటే...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి కేసీఆర్ పాలనలోని ప్రభుత్వ పెద్దలు పోలీసు శాఖ మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకున్నారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. కింది స్థాయి పోలీసు అధికారుల బదిలీలు స్థానిక శాసనసభ్యుల కనుసన్నల్లో జరిగాయని, పోలీసు ఉన్నతాధికారుల బదిలీలు నాటి పాలకులే చేశారని ఆయన ఆరోపించారు. పోలీసు ఉన్నతాధికారులు కొందరు రాజ్యాంగాన్ని, చట్టాన్ని పక్కన పెట్టి నాటి రాజకీయ నాయకులకు నమ్మిన బంట్లుగా పనిచేశారని అందువల్ల వారు పదవీ విరమణ చేశాక వారిని సలహాదారులుగా తాయిలాలు పొందారని పద్మనాభరెడ్డి పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ బాగోతం
పోలీసుల అక్రమాలపై విచారణకు కంప్లయింట్ అథారిటీని ఏర్పాటు చేయక పోవడం వల్లనే గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఫోన్ ట్యాపింగ్ బాగోతం జరిగిందని కొందరు ప్రభుత్వ అధికారులే చెబుతున్నారు. రాష్ట్రంలో పోలీసు భద్రత కమిషన్, పోలీసు కంప్లయింట్ అథారిటీలు ఏర్పాటు చేసి ఉంటే నాడు ఫోన్ ట్యాపింగ్ జరిగేది కాదని అంటున్నారు. నాడు పోలీసు అధికారుల ఆత్మస్థయిర్యం దెబ్బతింటుందని నాటి సర్కారు పోలీసు కంప్లయింట్ అథారిటీని ఏర్పాటు చేయలేదు.హైకోర్టు కేసును మూసివేయించేందుకు ఏర్పాటు చేసిన పోలీసు భద్రతా కమిషన్ ఏర్పాటు చేసినా అది కాగితాలకే పరిమితమైంది.
తెలంగాణలో పోలీసు భద్రతా కమిషన్ ఏర్పాటు చేయండి
రాజకీయాలకు అతీతంగా తెలంగాణలో పోలీసు భద్రతా కమిషన్ ను ఏర్పాటు చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు ఎం పద్మనాభరెడ్డి కోరారు. ఈ మేర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు. పోలీసు శాఖ పనితీరులో రాజకీయ ఒత్తిళ్లను తగ్గించి పోలీసు వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా పనిచేయడానికి వీలుగా తెలంగాణలో పోలీసు భద్రతా కమిషన్, పోలీసులపై వచ్చే ఫిర్యాదులపై విచారణకు పోలీసు కంప్లయింట్ అథారిటీని నియమించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ముఖ్యమంత్రిని కోరింది.