రాష్ట్రపతి రాఖీ పండగలో తెలంగాణ విద్యార్థులు
ఇంగ్లీషు మీడియం ప్రభావం. పల్లెటూరి పిల్లల ఇంగ్లీష్ ప్రతిభకు గుర్తింపు;
By : Saleem Shaik
Update: 2025-08-10 06:17 GMT
పట్టుదల, ఆత్మవిశ్వాసం, కఠోర సాధన ఉంటే చాలు ఆంగ్ల భాషలోనూ మన తెలంగాణ అమ్మాయిలూ ఎవరికీ తీసిపోరని నిరూపించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయానికి చెందిన అయిదుగురు విద్యార్థినులు ఆంగ్ల భాషలో ప్రావీణ్యాన్ని పొందారు. మారుమూల అంతర్గాం బాలికల విద్యాలయంలోనూ బాలికలు చదువులో రాణిస్తూ అందరి ప్రశంసలు అందుకున్నారు. బాలికల్లోని ప్రతిభను వెలికితీసి, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించి, ఇంగ్లీషులో మాట్లాడేలా ప్రోత్సహించిన ఆంగ్ల భాషా ఉపాధ్యాయురాలు బుర్రా లతకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఆంగ్ల భాషలో బాలికల ప్రతిభ
అంతర్గాం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయానికి చెందిన పెండెం అమూల్య, పెరుక అక్షర, ఎలిగేటి సహస్ర, అరుముల సౌమ్య, బింగి సహస్ర అనే బాలికలు ఆంగ్ల భాషలో చూపించిన ప్రతిభతో తెలంగాణ రాష్ట్రం నుంచి రాష్ట్రపతి భవన్ కు వెళ్లే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన రాఖీ ఫెస్టివల్ వేడుకల్లో అంతర్గాం బాలికలు పాల్గొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాఖీలు కట్టడంతో పాటు ఆమె నుంచి బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో బాలికలు మాట్లాడారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మను కలిసిన అరుదైన గౌరవాన్ని పొందిన బాలికలను ఉపాధ్యాయులు ప్రశంసించారు.
వందరోజుల్లో ఆంగ్లభాష నేర్పేందుకు ప్రణాళిక
‘‘నా పేరు బుర్రా లత...నేను ఎంఏ ఇంగ్లీషులో పోస్టుగ్రాడ్యుయేషన్ చదివి 2018వ సంవత్సరంలో కస్తూర్బా గాంధీ విద్యాలయలో ఇంగ్లీషు టీచరుగా ఉద్యోగంలో చేరాను. టీచరుగా చేరిన నాటి నుంచి వందరోజుల్లో బాలికలకు ఆంగ్లభాషలో అనర్గళంగా మాట్లాడేందుకు వీలుగా వినూత్న కార్యాచరణ ప్రణాళికను రూపొందించాను. బాలికలకు రోజువారీగా రోజుకు ఒక అంశంపై ఆంగ్లభాషలో మాట్లాడటం, ఆటపాటల ద్వారా, వీడియోలు చూపించడం ద్వారా వారు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడేలా నేర్పించాను.అని చెప్పారు ఇంగ్లీష్ టీచర్ బుర్రా లత.
పర్సనల్ డిక్షనరీ
సాధారణంగా ఇంగ్లీషు టు తెలుగు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలు ఉంటాయని కానీ, బాలికలకు వారు సాధన చేసిన ఇంగ్లీషు అక్షరాలతో వారు పర్సనల్ డిక్షనరీలు రాసేలా ప్రోత్సహించానంటారు ఆంగ్ల ఉపాధ్యాయురాలు బుర్రా లత. పర్సనల్ డిక్షనరీలు రాయడం వల్ల బాలికలకు ఆంగ్ల పదాలు వారికి గుర్తుండిపోయేలా చేశానన్నారు. ఆంగ్ల వీడియోలను బాలికలకు చూపించి వారికి ఇంగ్లీషు మాటలు పలకడంపై శిక్షణ ఇచ్చానని చెప్పారు రోజుకు అయిదు తరగతులు తీసుకొని ఇంగ్లీషు బోధించడంతోపాటు అదనంగా వారానికి మూడు క్లాసులు తీసుకొని బాలికలకు ఆంగ్లభాషను నేర్పానని బుర్ర లత వివరించారు.
మా పాఠశాల విద్యార్థుల ఘనత గర్వకారణం
తమ అంతర్గాం కస్తూర్బా గాంధీ విద్యాలయం బాలికలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ప్రశంసలు అందుకొని ఘనత సాధించడం తమకెంతో గర్వంగా ఉందని అంతర్గాం పాఠశాల ప్రిన్సిపాల్ పులి కల్పన చెప్పారు. బాలికలకు ఆంగ్ల భాషను నేర్చించి వారిని భవిష్యత్తులో గ్లోబల్ లీడర్లుగా తయారు చేయాలనేదే మా లక్ష్యం అని పులి కల్పన పేర్కొన్నారు.
బాలికల విద్యాభివృద్ధికి చర్యలు : జి కవిత, పెద్దపల్లి జిల్లా బాలికల విద్యా విభాగం అధికారిణి
పెద్దపల్లి జిల్లాలో బాలికల విద్యాభివృద్ధికి కస్తూర్బా గాంధీ విద్యాలయాల ద్వారా బాటలు వేస్తున్నామని పెద్దపల్లి జిల్లా బాలికల విద్యాభివృద్ధి అధికారిణి జి కవిత ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్టు ప్రకారం కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినులకు పాఠాలు చెబుతున్నామని ఆమె చెప్పారు. బాలికల విద్య ద్వారా వారిని అంతర్జాతీయ స్థాయికి చేరేలా చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని కవిత వివరించారు.
బాలికలూ భేష్...పెద్దపల్లి కలెక్టర్ అభినందన
నాణ్యమైన విద్యను బాలికలకు అందించడంతో పాటు బాలికల సాధికారతకు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు తోడ్పడుతున్నాయని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష చెప్పారు.తమ ప్రతిభను చాటిచెప్పి రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం విద్యార్థినులను కలెక్టర్ అబినందించారు. ఈ అంతర్గావ్ విద్యార్థినులు ఆంగ్ల భాషలో అసాధారణ ప్రతిభతో తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి ఎంపిక అయ్యారని కలెక్టర్ పేర్కొన్నారు.
మర్చిపోలేని మధుర అనుభవం
‘‘ ఆంగ్లభాషను నేర్చుకొని అనర్గళంగా మాట్లాడినందుకు మాకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కు పిలిచి ద్రౌపది ముర్మును కలిసి మాట్లాడే అవకాశం దక్కింది’’అని అంతర్గగాం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం బాలికలు పెండెం అమూల్య, పెరుక అక్షర, ఎలిగేటి సహస్ర, అరుముల సౌమ్య, బింగి సహస్ర ఆనందంగా చెప్పారు. రాష్ట్రపతితో భేటి అయ్యే అవకాశం తాము జీవితం మరవలేమని, రాష్ట్రపతి ఇచ్చిన స్ఫూర్తితో తాము చదువులో మరింత ముందుకు సాగుతామని బాలికలు చెప్పారు.