Tummala Nageswara Rao | రైతు రుణమాఫీలో కదలిక.. ముహూర్తం పెట్టుకుని మరీ..
తెలంగాణలో రుణమాఫీ పూర్తిపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు క్లారిటీ ఇచ్చారు. సాంకేతిక సమస్యలు సమసి పోవడంతో అతి త్వరలో రుణమాఫీ పూర్తవుతుందన్నారు.
తెలంగాణ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ(Loan Waiver) ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధమైందని చెప్పారు. అనేక కారణాల వల్ల రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఫలాలు అందలేదని, వారందరికీ ఈ రుణమాఫీని అందించడానికి తమ ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేస్తోందని చెప్పారు. వారందరికీ కూడా ఈ నెల 30న వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని వెల్లడించారు. పాలమూరు వేదికగా జరగనున్న రైతుపండగ సందర్భంగా ఈ నగదును విడుదల చేయనున్నట్లు తుమ్మల ప్రకటించారు. రైతు రుణమాఫీపై పలువురు దుష్ప్రచారం చేస్తున్నారని, కానీ రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరికీ రుణమాఫీ నగదు అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కొన్ని సాంకేతిక కారణాల వల్లే ఆలస్యమైందని వివరించారు. ఇప్పుడు అంతా సెట్ అయిందని, మరో రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నగదు జమ అవుతుందని ప్రకటించారు.
రైతు సంక్షేమానికి పెద్ద పీట..
‘‘రైతుల సంక్షేమంపై సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారు. వారికి ఎట్టిపరిస్థితుల్లో అన్యాయం జరగకూడదని తపన పడుతున్నారు. ప్రతిఒక్కరికీ రుణమాఫీ ఫలాలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్ర బడ్జెట్‌లో రైతుల కోసం రూ.47 వేల కోట్లు కేటాయించారు. అందులో ఇప్పటి వరకు రుణమాఫీకి రూ.18వేల కోట్లు, రైతుబంధుకు రూ.7,600 కోట్లు ఖర్చు చేశాం. రుణమాఫీ పంపిణీ విషయంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నాం. అందువల్లే ప్రతి రైతుకు తొలి విడతలోనే రుణమాఫీని అందించలేకపోయాం’’ అని మంత్రి వివరించారు.
‘‘కొందరు రైతులకు తెల్లకార్డు లేకపోవడం, బ్యాంకు, ఆధార్ కార్డుల్లో పేర్లు, నంబర్లు తప్పుగా ఉండటం వంటి కారణాల వల్ల రాష్ట్రంలో 3 లక్షల మందికి రుణమాఫీ ఆగింది. వ్యవసాయ శాఖ అధికారులు 3నెలలుగా వారందరి వివరాలు సేకరించి, తప్పులను సరి చేశారు. ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. ఈ నెల 30న మిగిలిన 3 లక్షల మంది రైతులకు రుణమాఫీ నగదు ఖాతాల్లో జమవుతుంది. అదే విధంగా వచ్చే ఏడాది నుంచి ‘రైతు బీమా’ను కూడా అందుబాటులోకి తీసుకొస్తాం’’ అని ప్రకటించారు.
రూ.2వేల కోట్ల అతిపెద్ద మార్కెట్
పాలమూరు, రంగారెడ్డి జిల్లాల రైతుల కోసం హైదరాబాద్-షాద్‌నగర్ మధ్య అతిపెద్ద మార్కెట్ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కూడా మంత్రి తుమ్మల వెల్లడించారు. ఈ మార్కెట్ హబ్ కోసం రూ.2వేల కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. ‘‘ధాన్యం దిగుబడిలో దేశంలో తెలంగాణ నెంబర్ 1గా నిలిచింది. ఈ విడతలో తెలంగాణ రైతులు 1.53 కోట్ల టన్నుల దిగుబడిని సాధించారు. తెలంగాణలో పండించిన వడ్లు మలేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశఆలకు ఎగమతి అవుతున్నాయి’’ అని తెలపారు మంత్రి.