గ్రూప్-3 హాల్‌టికెట్లు వచ్చేశాయ్.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
తెలంగాణలో గ్రూప్-3 పరీక్షలకు హాల్‌టికెట్లు విడుదలైనట్లు టీజీపీఎస్‌సీ ప్రకటించింది. అభ్యర్థులంతా కూడా ఈ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.
తెలంగాణలో గ్రూప్-3 పరీక్షలకు హాల్‌టికెట్లు విడుదలైనట్లు టీజీపీఎస్‌సీ ప్రకటించింది. అభ్యర్థులంతా కూడా ఈ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ నెల 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో కూడా జరగనున్నాయి. 17వ తేదీన ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒక పరీక్ష జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు పేపర్-1 పరీక్ష జరగనుండగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. మరుసటి రోజు అంటే నవంబర్ 18న ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు పేపర్-3 పరీక్ష జరగనుందని ప్రకటించారు అధికారులు. అభ్యర్థులు అందరూ కూడా తమ తమ హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రకటించింది టీజీపీఎస్‌సీ.
ఉదయం సమయంలో జరిగే పరీక్షలకు 8:30 గంటల నుంచే అభ్యర్థలును పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని, 9:30 తర్వాత ఒక్కరిని కూడా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు అధికారు. అదే విధంగా మధ్యాహ్నం సమయంలో జరిగే పరీక్షకు కూడా 1:30 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తామని, 2:30 గంటలకు పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తామని, ఆ తర్వాత ఎవరినీ లోపలికి అనుమతించమని అధికారులు స్ఫష్టంగా వివరించారు. అంతేకాకుండా ప్రతి అభ్యర్థి కూడా తమ పేపర్-1 పరీక్షకు వినియోగించిన హాల్‌టికెట్ కాపీనే మిగిలిన పరీక్షలకు కూడా వినియోగించాలని సూచించారు. నియామకాలు జరిగే వరకు కూడా హాల్‌టికెట్లను భద్రంగా ఉంచుకోవాలని సూచించారు.
హాల్ టికెట్ డౌన్‌లోడ్ ఇలా..
గ్రూప్-3 అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను ఇంట్లో కూర్చునే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసుకోవాలి. అందులో డౌన్‌లోడ్ హాల్ టికెట్ అన్న చోట గ్రూప్-3ని సెలక్ట్ చేసుకోవాలి. గ్రూప్-3 ఆప్షన్ సెలక్ట్ చేసుకోగానే టీజీపీఎస్‌సీ ఐడీ, పుట్టిన తేదీ వివరాలను అడుగుతుంది. వాటిని ఎంటర్ చేసి డౌన్‌లోడ్ పీడీఎఫ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అంతే మీ గ్రూప్-3 పరీక్ష హాల్‌టికెట్ డౌన్‌లోడ్ అయిపోతోంది. దానిని ప్రింట్ తీయించుకుంటే సరిపోతుంది. ఒకవేళ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ సమయంలో ఏదైనా సాంకేతిక సమస్య ఎదరయితే 040-23542185, 040-23542187 నెంబర్లను సంప్రదించవచ్చు.
ఎన్ని ఖాళీలున్నాయంటే..
తెలంగాణలో 1,388 గ్రూప్-3 ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి సంబంధించి పరీక్షలు నవంబర్ 17,18 తేదీల్లో జరగనున్నాయి. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మరి ఈ పరీక్షలకు ఎంతమంది హాజరవుతారో చూడాలి.