సమస్యల పరిష్కారంలో పుల్లూరు విద్యార్ధులే మార్గదర్శనం
కలెక్టర్ స్వయంగా గురుకుల్ స్కూలును సందర్శించి విద్యార్ధులతో మాట్లాడి సమస్యలేంటో తెలుసుకున్నారు;
సమస్యల పరిష్కారం కోసం జోగులాంబ గద్వాల్ జిల్లా, అలంపూర్ లోని పుల్లూరు గురుకుల స్కూల్ విద్యార్ధుల దెబ్బకు జిల్లా కలెక్టర్ సంతోష్ దిగొచ్చారు. సమస్యలను పరిష్కరించుకోవటంలో మిగిలిన విద్యార్ధులకు పుల్లూరు గురుకుల్ విద్యార్దులు మార్గదర్శనం అయ్యారనే చెప్పాలి. కలెక్టర్ స్వయంగా గురుకుల్ స్కూలును సందర్శించి విద్యార్ధులతో మాట్లాడి సమస్యలేంటో తెలుసుకున్నారు. సమస్యలపరిష్కారానికి కలెక్టర్ అక్కడికక్కడే కొన్ని ఆదేశాలిచ్చారు. నిర్లక్ష్యం వహించినందుకు కొందరిని సస్పెండ్ కూడా చేశారు. గురుకుల పాఠశాలలో సమస్యలను ఎవరూ పట్టించుకోవటంలేదన్న ఆగ్రహంతో విద్యార్ధులు తమ స్కూలు నుండి కలెక్టర్ ఆఫీసుకు గురువారం పాదయాత్రగా బయలుదేరిన విషయాన్ని మనం నిన్ననే చెప్పుకున్నాము. 45కిలోమీటర్ల పాదయాత్రకు బయలుదేరిన విద్యార్ధులను 9 కిలోమీటర్ల నడక తర్వాత పోలీసులు అడ్డుకున్నారు. సమస్యల పరిష్కారానికి తాము చొరవతీసుకుంటామని నచ్చచెప్పి అందరినీ తిరిగి స్కూలుకు చేర్చిన విషయం తెలిసింది.
గురువారం మధ్యాహ్నం అడిషినల్ కలెక్టర్ నర్సింగరావు స్కూలుకు వచ్చి సమస్యలగురించి విద్యార్ధులతో మాట్లాడారు. తర్వాత కలెక్టర్ ను కలిసి రిపోర్టు అందించారు. దాంతో సాయంత్రం కలెక్టర్ స్వయంగా స్కూలుకు వచ్చి సమస్యలను పరిశీలించారు. విద్యార్ధులు చెబుతున్నట్లుగా ఫ్లోరైడ్ వాటర్ సరఫరా అవుతున్నది నిజమే అని, మరుగుదొడ్లు లేవని, పురుగులు కలిసిన ఆహారాన్ని అందిస్తున్నట్లు నిర్ధారణ చేసుకున్నారు. అందుకనే డిప్యుటి వార్డెన్ రజిత, సూపర్ వైజర్ నవీన్ను అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. ప్రిన్సిపల్ రామకృష్ణ, వార్డెన్, హౌస్ మాస్టర్ కు మెమోలు జారీచేశారు. మూసేసిన మరుగుదొడ్లను వెంటనే తెరిపించారు. పాడైపోయిన మరుగుదొడ్ల స్ధానంలో నెలలోపు కొత్తవి నిర్మించాలని ఆదేశించారు. ఆహారంలో పురుగులు లేకుండా నాణ్యమైన బియ్యాన్ని తెప్పించాలని చెప్పారు. చెడిపోయిన ఆర్వోఆర్ ను రిపేర్ చేయించేవరకు మినరల్ వాటర్ బాటిళ్ళను తెప్పించి మంచినీటిని అందుబాటులో ఉంచాలని చెప్పారు. పిల్లలను బెదిరిస్తున్న భవనం యజమనిపైన కూడా చర్యలకు ఆదేశించారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సమస్యల పరిష్కారానికి విద్యార్దులు పాదయాత్ర పేరుతో రోడ్డెక్కితే కాని ప్రభుత్వం దిగిరాలేదు. ఇక్కడ ఇన్ని సమస్యలు ఉన్నాయని ప్రభుత్వానికి బాగా తెలుసు. అయినా ఏ ఒక్కరు వాటి పరిష్కారానికి చొరవచూపించకపోవటమే ఆశ్చర్యం. సంవత్సరాల తరబడి గురుకుల స్కూలులో చదువుతున్న విద్యార్ధులు 560 మంది ఇబ్బందులు పడుతున్నా ప్రిన్సిపాల్, వార్డెన్, డిప్యుటి వార్డెన్ కు కనీసం చీమకుట్టినట్లు కూడా అనిపించలేదు. తెలంగాణ మొత్తంమీద 1023 గురుకుల స్కూళ్ళల్లో సుమారు 6 లక్షలమంది విద్యార్ధులు చదువుతున్నారు. మెజారిటి స్కూళ్ళలో కనీస సౌకర్యాలు లేవన్నది వాస్తవం. లక్షలాదిమంది విద్యార్దులు ప్రతిరోజు తమ అవసరాలు తీర్చుకోవటానికి నానా అవస్ధలు పడుతున్నారు. మొత్తానికి సమస్యలను పరిష్కరించుకునే విషయంలో పుల్లూరు విద్యార్ధులు చూపించిన నిరసనబాట మిగిలిన స్కూళ్ళల్లో చదువుతున్న విద్యార్దులకు మార్గదర్శనం అయ్యిందనే చెప్పాలి.