చంచల్ గూడ జైలుకి రకుల్ ప్రీత్ సోదరుడు

డ్రగ్స్‌ కేసులో నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌ కు న్యాయస్థానం జుడీషియల్ రిమాండ్ విధించింది.

Update: 2024-07-16 13:15 GMT

డ్రగ్స్‌ కేసులో నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌ కు న్యాయస్థానం జుడీషియల్ రిమాండ్ విధించింది. అమన్ కి పాజిటివ్‌ రావడంతో అతనితోపాటు ఐదుగురు నిందితులకు ఉప్పర్ పల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌ విధించింది. దీంతో పోలీసులు వీరిని చంచల్ గూడ జైలుకి తరలించారు. కాగా, టాలీవుడ్ ని డ్రగ్స్ వ్యవహారం వెంటాడుతూనే ఉంది. ఎక్కడ భారీగా డ్రగ్స్ పట్టుబడినా టాలీవుడ్ కి సంబంధించిన వ్యక్తుల పేర్లు వినపడటం పరిపాటి అయిపోయింది. ఈ క్రమంలో సోమవారం హైదర్షాకోట్ లో పోలీసులు నిర్వహించిన దాడిలో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పట్టుబడ్డారు. దీంతో ఈ విషయం నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయింది. సంచలనం రేపిన ఈ కేసు వివరాలను సోమవారం రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ మీడియాకి వెల్లడించారు.

కేసు వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ హైదర్షాకోట్ లోని విశాఖనగర్ వ్యూ అపార్ట్మెంట్ లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా ఉన్నట్లు పోలీసులకులు సమాచారం అందింది. దీంతో తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో (టీజీ న్యాబ్) అధికారులు సైబరాబాద్ పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రకుల్ ప్రీత్ సోదరుడు అమన్ ప్రీత్ సహా 13 మంది వినియోగదారులు పట్టుబడ్డారు. 13 మంది వినియోగదారులను అమన్, కిషన్ రాఠి, అనికేత్, యశ్వంత్, రోహిత్, శ్రీ చరణ్, ప్రసాద్, హేమంత్, నిఖిల్, మధు, రఘు, కృష్ణం రాజు, వెంకట్‌లుగా గుర్తించారు. ఇద్దరు నైజీరియన్లు సహా ఐదుగురు డ్రగ్స్ స్మగర్లను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పోలీసులు వారికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో పదిమందికి పాజిటివ్ రాగా... వారిలో అమన్ కొకైన్ తీసుకున్నట్లు తేలిందని డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు.

నైజీరియాకు చెందిన ఒనుహా బ్లెస్సింగ్ అలియాస్ జోయానా గోమ్స్ అలియాస్ జో అనే మహిళ డ్రగ్స్ సరఫరా డాన్ గా పోలీసులు గుర్తించారు. ఆమెతోపాటు నైజీరియాకు చెందిన అజీజ్ నొహీం అడెషోలా ఈ కార్యకలాపాల్లో ముఖ్య సభ్యుడిగా ఉన్నట్లు తేలింది. హైదరాబాద్ కు చెందిన అల్లం సత్యవెంకట గౌతమ్, సానబోయిన వరుణ్ కుమార్, మహమ్మద్ మహబూబ్ షరీఫ్ వీరి ముఠాలో పెడ్లర్లుగా పని చేస్తున్నట్లు పోలీసులు తేల్చారు. కాగా, అపార్ట్మెంట్ పై పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్ట్ చేయడంతోపాటు... వీరి నుంచి రూ. 35లక్షల విలువ చేసే 199 గ్రాముల కొకైన్ ని సీజ్ చేశారు. ఇక వీరి గ్యాంగ్ కి సంబంధించిన నైజీరియన్ స్మగ్లర్లు డ్రైవిన్ ఎబుకా అలియాస్ ఇమ్మాన్యుయేల్, ఎజియోనిలి ప్రాంక్లిన్ అలియాస్ కలేషీ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఏ6 గా అమన్ ప్రీత్...

డ్రగ్స్ కేసులో పట్టుబడిన అమన్ ప్రీత్ సింగ్ ని ఏ6 గా పోలీసులు చేర్చారు. ఏ1 గా ఒనుహా బ్లెస్సింగ్, ఏ2 గా అజీజ్, ఏ3 గా అల్లం సత్యనారాయణ, ఏ4 గా సానబోయిన వరుణ్, ఏ5 గా మహబూబ్ షరీఫ్, ఏ6 గా అమన్ ప్రీత్ సింగ్ ని డ్రగ్స్ కేసులో నిందితులుగా చేర్చారు. అమన్ ప్రస్తుతానికి కస్టమరేనని తాము గుర్తించినట్లు టీజీ న్యాబ్ పోలీసులు తెలిపారు. అతను నిజంగానే కస్టమరా? లేక డ్రగ్స్ సప్లయరా? అనేది దర్యాప్తులో తేలుతుందని అన్నారు. గతంలో డ్రగ్స్ కేసులో రకుల్ పేరు బయటపడిన నేపథ్యంలో.. ఇప్పుడు అమన్ పోలీసులకు పట్టుబడడం సినీ ఇండస్ట్రీలో మరోమారు చర్చనీయాంశమైంది. అప్పట్లో రకుల్ ఈడీ విచారణను సైతం ఎదుర్కొన్నారు.

Tags:    

Similar News