బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం చరిత్ర ఏమిటంటే...
వినాయక చవితి ఉత్సవాలు మంగళవారంతో ముగియనున్నాయి.ఉత్సవాల్లో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట ఆసక్తికరంగా మారనుంది. ఈ లడ్డూ వేలంపేట కథా కమామీషు గురించి తెలుసుకుందాం.
By : Saleem Shaik
Update: 2024-09-16 14:46 GMT
వినాయక ఉత్సవాల సందర్భంగా ‘‘జైజై గణేశా జై కొడతా గణేశా, జయములివ్వు బొజ్జ గణేశా ’’ అంటూ హైదరాబాద్ నగరంలోని వీధులన్నీ మారుమోగిపోయాయి. విఘ్నాలు తొలగించమంటూ విఘ్నేశ్వరుడిని భక్తులు నైవేద్యం సమర్పించి పదిరోజుల పాటు అత్యంత భక్తి ప్రపత్తులతో పూజలు చేశారు.
- భక్తజనుల విశేష పూజలందుకున్న వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు శోభాయాత్రగా వెళ్లేందుకు సమాయత్తం చేస్తున్నారు. లంబోదరుడి శోభాయాత్రకు ముందు వినాయకుడి చేతిలో ఉన్న లడ్డూలను వివిధ గణేష్ మండపాల భక్త మండళ్లు వేలం వేయనున్నారు.
- గణేష్ మండపాల్లోనే బాలాపూర్ గణేష్ విగ్రహమే కాదు బాలాపూర్ గణనాథుడి లడ్డూల వేలానికి హైదరాబాద్ నగరంలోనే కాకుండా తెలంగాణలోనే ఎంతో ప్రాధాన్యం ఉంది. అతి పెద్ద గణేషుడిగా ఖైరతాబాద్ వినాయకుడికి పేరుంటే, బాలాపూర్ లడ్డూ విశిష్ఠత, వేలంపై భక్తజనుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది.
రూ.450 నుంచి రూ.27 లక్లల దాకా...
హైదరాబాద్ నగరంలోని బాలాపూర్ గ్రామ గణేష్ లడ్డూ వేలంపాట మళ్లీ తెరమీదకు వచ్చింది. 1994వ సంవత్సరంలో రూ.450 నుంచి ప్రారంభమైన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ధర ఏటేటా పెరుగుతూ వచ్చింది. గతేడాది ఈ లడ్డూను రూ.27 లక్షలకు వేలం పాటలో దాసరి దయానంద్ రెడ్డి దక్కించుకున్నారు.
- హైదరాబాద్ బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం చరిత్రను పరిశీలిస్తే భక్తులు ఆశ్చర్యపోతారు. 1994వ సంవత్సరంలో గణేష్ లడ్డూను వేలం వేయగా స్థానిక రైతు కొలన్ మోహన్ రెడ్డి కేవలం 450 రూపాయలకు దక్కించుకున్నారు.
పలు ఏళ్లు రెండు కుటుంబాలు...వేలంలో లడ్డూ సొంతం
బాలాపూర్ లడ్ూ వేలంలో ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఒకే కుటుంబం పలు వేలంపాటల్లో పాల్గొని లంబోదరుడి లడ్డూను దక్కించుకుంది. 1994,1995 వ సంవత్సరాల్లో కొలను మోహన్ రెడ్డి లడ్డూను కొనుగోలు చేశారు. 1996, 1997లలో రెండేళ్ల పాటు కలన్ కృష్ణారెడ్డి లడ్డూ వేలంపాట పాడారు. 1998లో కొలను మోహన్ రెడ్డి మళ్లీ లడ్డూను కొన్నారు. 1999లో కళ్లెం అంజి రెడ్డి 65,000రూపాయలకు, 2001లో కళ్లెం ప్రతాప్ రెడ్డి 66,000 లడ్డూ వేలంపాట పోయింది. కొలన్, కళ్లెం కుటుంబాలు వినాయకుడి లడ్డూను కొన్నారు.
లడ్డూ దక్కించుకున్న గణేష్ భక్తులు
2002లో బాలాపూర్ లో జరిగిన గణేష్ లడ్డూ వేలంలో జి రఘునందన్ చారి 85,000రూపాయలకు దక్కించుకున్నారు.2003లో కందాడ మాధవ రెడ్డి రూ.1,05,000, 2004లో చిగిరింత బాల రెడ్డి 1,55,000 లడ్డూ కొన్నారు.2005వ సంవత్సరంలో మళ్లీ కొలన్ మోహన్ రెడ్డి 2,01,000 లక్షలకు లడ్డూను పొందారు. 2006లో ఇబ్రమ్ శేఖర్ రూ. 2,08,000,2007లో చిగిరింత తిరుపతి రెడ్డి రూ.3,00,000,2008లో జి రఘునందన్ చారి రూ.4,15,000,2009లో కొలన్ మోహన్ రెడ్డి రూ.5,07,000,2010లో సరిత రూ.5,10,000,2011లో కొడాలి శ్రీధర్ బాబు రూ.5,35,000,2012లో కోలన్ బ్రదర్స్ రూ.5,45,000,2013లో పన్నాల గోవర్ధన్ రెడ్డి రూ.7,50,000,2014లో తీగల కృష్ణా రెడ్డి రూ.9,26,000,2015లో సింగి రెడ్డి జైహింద్ రెడ్డి రూ.9,50,000,2016లో కళ్లెం మధన్ మోహన్ రెడ్డి రూ.10,32,000,2017లో కందాడి స్కైలాబ్ రెడ్డి రూ.14,65,000,2018లో నాగం తిరుపతి రెడ్డి రూ.15,60,000,2019లో తేరేటిపల్లి శ్రీనివాస్ గుప్తా రూ.16,60,000,2020లో కొలన్ రామ్ రెడ్డి రూ.17,60,000 లక్షలకు లడ్డూ కొన్నారు.
సీఎంకు బాలాపూర్ లడ్డూ
బాలాపూర్ లడ్డూను సీఎం కేసీఆర్ కు అప్పగించారు. 2021లో ముఖ్యమంత్రికి లడ్డూను అందించారు.2022లో రమేష్ యాదవ్ & మర్రి శశాంక్ రెడ్డి రూ.18,90,000,2023లో వంగేటి లక్ష్మా రెడ్డి రూ.24,60,000,2024లో దాసరి దయానంద రెడ్డి రూ.27,00,000 దక్కించుకున్నారు.
గ్రామాభివృద్ధికి లడ్డూ వేలం పాట డబ్బు
వినాయకుడి లడ్డూ వేలం ద్వారా వచ్చిన సొమ్మును బాలాపూర్ గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు.గణేష్ నిమజ్జన ఊరేగింపునకు సంబంధించిన మార్గాలను హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు.మంగళవారం బాలాపూర్ లడ్డూ వేలంలో ఎంత ధర పలుకుతుందో వేచి చూడాల్సిందే.