మావోయిస్టుల పనయిపోయింది
తెలంగాణ నూతన డిజిపి శివధర్ రెడ్డి మీడియాతో
మావోయిస్టు సిద్దాంతాలకు కాలం చెల్లిందని, మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని తెలంగాణ నూతన డిజిపి శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ డిజిపిగా నియామకమైన తర్వాత శివధర్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతం పట్ల పూర్తి అవగాహన ఉందని చెప్పారు. డ్రగ్ రహిత తెలంగాణ కోసం పాటుపడతానని ఇప్పటికే ఈగల్ టీం డ్రగ్ నిర్మూలనకు సమర్దవంతంగా పని చేస్తుందన్నారు. లొంగిపోతున్న మావోయిస్టుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి మావోయిస్టు సిద్దాంతాల వల్ల ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదని శివధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మావోయిస్టుల పనయిపోయిందని శివధర్ రెడ్డి అన్నారు. సైబర్ నేరాలను అరికట్టడానికి ఫోకస్ పెడతానని శివధర్ రెడ్డి హామి ఇచ్చారు.
విశాఖపట్నంలో ఏఎస్పీ నుంచి...
తెలంగాణ నూతన డిజిపిగా శివధర్ రెడ్డి నియామకమయ్యారు. అసిస్టెంట్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి నుంచి డిజి స్థాయికి చేరుకున్న శివధర్ రెడ్డి 1994 బ్యాచ్ ఐపిఎస్ అధికారి. ప్రస్తుతం డిజిపిగా ఉన్న జితేందర్ పదవీకాలం సెప్టెంబర్ 30తో ముగియనుండటంతో కొత్త డిజిపి నియామకం అనివార్యమైంది. డిజిపి పదవి కోసం పోటీ పడుతున్న వారిలో 1991 బ్యాచ్ కు చెందిన సీవీ ఆనంద్, 1990 బ్యాచ్ కు చెందిన రవిగుప్తా ఉన్నారు. వీరిద్దరు శివధర్ రెడ్డి కంటే సీనియర్లు అయినప్పటికీ డిజిపి పదవి వరించలేదు. శివధర్ రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన శివధర్ రెడ్డి ఉస్మానియా యూనివర్శిటీ నుంచి ఎల్ ఎల్ బి పట్టభధ్రుడు. ఐపిఎస్ అధికారిగా మొదటిసారి ఉమ్మడి రాష్ట్రం విశాఖ పట్నంలోని నర్సీపట్నం, అనకాపల్లి, చింతపల్లి సబ్ డివిజన్లకు ఎఎస్పిగా పని చేశారు. తర్వాత గ్రే హౌండ్స్, డిఐజి స్పెషల్ (ఇంటెలిజెన్స్ బ్యూరో),వైజాగ్ పోలీస్ కమిషనర్, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయ్యాక ఇంటెలిజెన్స్ విభాగంలో పని చేశారు.