తెలంగాణాకు రెండో రాజధాని

మంత్రి సురేఖ చెప్పారనికాదుకాని ఎన్నికల నాటినుండే వరంగల్ జిల్లాకు రేవంత్ బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు.

Update: 2024-11-19 11:03 GMT
Minister Konda Surekha

తెలంగాణాకు వరంగల్ రెండో రాజధానిగా అభివృద్ధి అవుతోందా ? అవుననే అంటున్నారు మంత్రి కొండా సురేఖ(Konda Surekha). మంగళవారం వరంగల్ జిల్లా(Warangal District)లో ప్రజాపాలన విజయోత్సవ సభ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. వరంగల్ అభివృద్ధిగురించి బీఆర్ఎస్(BRS) హయాంలో కేసీఆర్(KCR) ప్రకటనలు మాత్రమే చేసినట్లు ఈ సందర్భంగా మండిపడ్డారు. అభివృద్ధిని కేసీఆర్ ప్రకటనలకు మాత్రమే పరిమితంచేస్తే తమ ప్రభుత్వం చేతల్లో చూపిస్తోందన్నారు. వరంగల్ అభివృద్ధికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రు. 4 వేల కోట్లను ఖర్చు చేస్తున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. వరంగల్ ను తెలంగాణాకు రెండో రాజధానిగా అభివృద్ధి చేయబోతున్నట్లు చెప్పారు. తమపైన ఆరోపణలు, విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు జరుగుతున్న అభివృద్ధిని చూసి తర్వాత మాట్లాడాలని సవాలు చేశారు.

వరంగల్ అభివృద్ధికి తమ ప్రభుత్వం నిధుల వరదపారిస్తోందన్నారు. వరంగల్ జిల్లా మామనూరు(Mamanur airport) దగ్గర విమానాశ్రయం రాబోతోందన్నారు. అలాగే టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుకు రెడీ అవుతోందని చెప్పారు. పారిశ్రామికంగా కూడా జిల్లాను అభివృద్ధిచేయటానికి రేవంత్ రెడ్డి(Revanth Reddy) అనేక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మహిళల సాధికారత కోసం ప్రత్యేకంగా కృషిచేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయటమే ధ్యేయంగా అనేక కార్యక్రమాలను అమలుచేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

మంత్రి సురేఖ చెప్పారనికాదుకాని ఎన్నికల నాటినుండే వరంగల్ జిల్లాకు రేవంత్ బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు. వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో ఎన్నికలకు ముందే భారీ బహిరంగసభలు నిర్వహించిన విషయం గుర్తుండే ఉంటుంది. రైతుల కోసం ప్రత్యేకించి వరంగల్ లో బహిరంగసభ నిర్వహించి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ప్రత్యేకంగా పిలిపించారు. ఈ సభలోనే రైతు డిక్లరేషన్ ప్రకటించేట్లుగా రేవంత్ కృషిచేశారు. మార్కెటింగ్ యర్డులను డెవలప్ చేస్తున్నారు. పత్తికొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నది ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వరంగల్ అంటేనే రేవంత్ సెంటిమెంటుగా ఫీలవుతున్నారు. అందుకనే వీలైనంతలో రేవంత్ వరంగల్ కు బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకనే కొండా సురేఖ మాట్లాడుతు తెలంగాణాకు వరంగల్ రెండో రాజధాని(Warangal second capital) అవబోతున్నట్లు ప్రకటించింది.

Tags:    

Similar News